తంగవేలు...నీకు జేజేలు
భారతదేశం ప్రతిరోజు ఆశగా నిద్ర లేచింది. కానీ స్వర్ణం కల సాకారం కాకుండానే ఒలింపిక్స్ ముగిశాయి. అయితే అదే వేదికలో ఒలింపిక్స్ ముగిసిన 20 రోజుల తర్వాత భారత్‌కు బంగారు కల నెరవేరింది. రియోలోనే జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్ తంగవేలు హైజంప్‌లో స్వర్ణం సాధించి మువ్వన్నెలు రెపరెపలాడించాడు. ఇదే ఈవెంట్‌లో వరుణ్ సింగ్ భటి కాంస్యం సాధించడంతో ఆనందం రెట్టింపయిది. దివ్యాంగుల కోసం నిర్వహించే పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన ఈ ఇద్దరికీ భారత్ జేజేలు పలుకుతోంది.
పారాలింపిక్స్‌లో పతకం సాధిస్తానని నమ్ముతూ వచ్చాను. రియోకి రావడానికి ముందే 1.85మీ. ఎత్తును అధిగమించాను. నేను మాజీ ప్రపంచ నంబర్‌వన్‌ను. అందుకే అంత నమ్మకంతో ఉన్నాను. ఇక స్వర్ణం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. నా జీవితంలో ఇది అత్యంత మధురమైన రోజు. నా కోచ్ సత్యనారాయణ, సాయ్ అధికారుల కృషిని మరువలేను. కేంద్రం ‘టాప్’ స్కీంలో నేనూ ఉన్నాను. శిక్షణ కోసం జర్మనీ పంపారు. -తంగవేలు
రియో డి జనీరో: పారాలింపిక్స్‌లో రెండో రోజే భారత మువ్వన్నెల పతాకం రెపరెపలాడింది. దేశ అథ్లెట్ల సంచలన ప్రదర్శనతో ఒకే ఈవెంట్‌లో రెండు పతకాలు వచ్చారుు. శనివారం తెల్లవారుజామున జరిగిన పురుషుల హైజంప్ టి-42లో తమిళనాడుకు చెందిన మరియప్పన్ తంగవేలు కొత్త చరిత్ర సృష్టిస్తూ స్వర్ణం సాధించగా... ఇదే విభాగంలో వరుణ్ సింగ్ భటి కాంస్యం సాధించాడు. మరో అథ్లెట్ శరద్ కుమార్ ఆరో స్థానంలో నిలిచాడు. తంగవేలు 1.89మీ. ఎత్తుకు ఎగిరి అగ్రస్థానంలో నిలవగా... భటి 1.86మీ.తో మూడో స్థానంలో నిలి చాడు. అమెరికాకు చెందిన సామ్ గ్రెవే (1.86) రెండో స్థానంతో రజతం అందుకున్నాడు. ఇటీవల ట్యునీషియాలో జరిగిన ఐపీసీ గ్రాండ్‌ప్రి ఈవెంట్‌లో తంగవేలు 1.78మీ. జంప్‌తో స్వర్ణం అందుకున్నాడు.
హోరాహోరీ పోరాటంలో...
ఈసారి పారాలింపిక్స్ హైజంప్ పోటీ ఉత్కంఠభరితంగా సాగింది. మొత్తం 12 మంది అథ్లెట్లు పాల్గొన్న హైజంప్‌లో తొలి ఎనిమిది ప్రయత్నాల్లో 1.74మీ. అర్హత ప్రమాణాన్ని ఆరుగురు అథ్లెట్లు సాధించారు. పదో ప్రయత్నంలో తంగవేలు 1.77మీ. హైజంప్ చేసి సహచర అథ్లెట్ శరద్ కుమార్, మరో ఇద్దరితో కలిసి టాప్‌లో నిలిచాడు. కానీ చివరి దశల్లో పోటీ హోరాహోరీగా సాగింది. శరద్ నిరాశపరుస్తూ నిష్ర్కమిం చగా అటు తంగవేలు, వరుణ్ భటి 1.83మీ. ఎత్తుతో అందరికన్నా ముందు నిలిచారు.
ఆ తర్వాత సామ్ గ్రెవే వీరిద్దరిని వెనక్కి నెట్టి 1.86మీ. జంప్‌తో టాప్‌లో నిలిచాడు. కానీ ఫైనల్ ప్రయత్నంలో తంగవేలు అద్భుత ప్రదర్శన కనబరుస్తూ ఏకంగా 1.89మీ. హైజంప్‌తో స్వర్ణం అందుకోగా గ్రెవే, వరుణ్ 1.86మీ.లతో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. గ్రెవే, వరుణ్ ఇద్దరూ సమాన ఎత్తు ఎగిరినా... గ్రెవే తన తొలి ప్రయత్నంలో 1.86మీ. ఎగిరాడు. దీంతో తనకు రజతం లభించింది. వరుణ్ తన మూడో ప్రయత్నంలో 1.86మీ. ఎగిరాడు.