భారత్ పాంచ్ పటాకా!
న్యూఢిల్లీ: భారత్ అంటే ప్రధానంగా వినిపించే క్రీడ క్రికెట్. అయితే క్రికెట్ తో పాటు టెన్నిస్ పట్ల కూడా ప్రేక్షకాదరణ క్రమేపి పెరుగుతోంది. అందుకు కారణం టెన్నిస్ లో భారత్ సాధిస్తున్న విజయాలే. గతంలో టెన్నిస్ లో విజయాలు అడపాదడపా వచ్చినా.. ఈఏడాది కాలంలో వాటి సంఖ్య మరింత పుంజుకుంది. భారత్ కు టెన్నిస్ లో 2015 వ సంవత్సరం బాగా కలిసొచ్చిందనే చెప్పొచ్చు. ప్రత్యేకంగా మహిళల డబుల్స్, మిక్స్ డ్ డబుల్స్ లో భారత్ కు చెందిన సానియా మీర్జా, లియాండర్ పేస్ లు స్విస్ క్రీడాకారిణి మార్టినా హింగిస్ తో జోడి కట్టి అంచనాలకు మించిన విజయాలు సాధించారు. ఈ సంవత్సరం ఆరంభంలో లియాండర్ పేస్-హింగిస్ ల జోడీ ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్ డ్ డబుల్స్ టైటిల్ తో శుభారంభం చేయగా.. అదే పరంపరంను యూఎస్ ఓపెన్ లో కూడా కొనసాగించి ఘనమైన ముగింపు నిచ్చారు.
ఆస్ట్రేలియా ఓపెన్: ఈ ఏడాది ఆరంభంలో మార్టినా హింగిస్-పేస్ ల జోడీ ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్ డ్ డబుల్స్ టైటిల్ ను గెలుచుకున్నారు. ఆ టోర్నీలో ఆద్యంతం ఆకట్టుకున్నహింగిస్-పేస్ ల జోడీ.. ఫైనల్ పోరులో 6-4, 6-3 తేడాతో డానియల్ నెస్టార్- క్రిస్టినా మ్లెదెనొవిక్ లను కంగుతినిపించి మిక్స్ డ్ టైటిల్ ను కైవసం చేసుకున్నారు.
వింబుల్డన్ గ్రాండ్ స్లామ్: ఏకైక గ్రాస్ కోర్టు వేదికైన వింబుల్డన్ లో కూడా పేస్-హింగిస్ ల జోడీ తమ జైత్రయాత్రను కొనసాగించింది. పేస్-హింగిస్ ల జోడీ 6-1, 6-1 తేడాతో ఐదో సీడ్ అలెక్సండర్ పియా, తిమియా బాబోస్ ల జోడీని మట్టికరిపించి వింబుల్డన్ మిక్స్ డ్ టైటిల్ ను చేజిక్కించుకున్నారు. అదే వేదికపై భారత్ కు మరో విజయం లభించింది. సానియా-హింగిస్ ల జోడీ రష్యాకు చెందిన ఎకతిరినా మకోరోవా- ఎలీనీ విస్నీనా జోడీని ఓడించి మహిళల డబుల్స్ టైటిల్ ను గెలుచుకున్నారు. అయితే ఫైనల్ కు చేరే క్రమంలో తొలి సెట్ కోల్పోని ఇండో-స్విస్ జోడీ.. తుది పోరులో మొదటి సెట్ ను చేజార్చుకుని కాస్త తడబడినట్లు కనిపించింది. అయితే తరువాత తేరుకున్న హింగిస్-మీర్జాల జోడీ తదుపరి రెండు సెట్లను గెలుచుకుని టైటిల్ ను కైవసం చేసుకుంది.
యూఎస్ ఓపెన్: ఇక్కడ కూడా వింబుల్డన్ ఫలితమే పునరావృతమైంది. తొలుత మిక్స్ డ్ విభాగంలో జరిగిన ఫైనల్లో పేస్-హింగిస్ ల జోడీ 6-4, 3-6, 10-7తో బెథానీ మాటెక్ సాండ్స్-సామ్ క్వైరీ (అమెరికా)పై విజయం సాధించి యూఎస్ ఓపెన్ టైటిల్ ను గెలవగా, మహిళల డబుల్స్ ఫైనల్లో టాప్ సీడ్ సానియా మీర్జా- మార్టినా హింగిస్ ద్వయం 6-3, 6-3తో నాలుగో సీడ్ కేసీ డెలాక్వా (ఆస్ట్రేలియా)-యారోస్లావా ష్వెదోవా (కజకిస్తాన్) జంటను ఓడించి యూఎస్ ఓపెన్ టైటిల్ ను గెలుచుకున్నారు. ఈ తాజా విజయాలతో గ్రాండ్ స్లామ్ కెరీర్ లో లియాండర్ పేస్ 17 వ టైటిల్ ను సాధించగా, సానియా ఖాతాలో ఐదో టైటిల్ వచ్చి చేరింది. దీన్ని ఇలా ఉంచితే ఒకే ఏడాది భారత్ ఖాతాలోఐదు టైటిల్స్ చేరడం నిజంగా గర్వకారణమే. భవిష్యత్తులో మనం మరిన్ని విజయాలు సాధించడానికి ఈ ఏడాది ఒక స్ఫూర్తిగా నిలుస్తుందడంలో ఎటువంటి సందేహం లేదు.