
ప్రధాని మోదీని కలిసిన మేరీకోమ్
న్యూఢిల్లీ: భారత మేటి మహిళా బాక్సర్ మేరీకోమ్ బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసింది. ఏప్రిల్‌లో మణిపూర్‌లో తన అకాడమీ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వానించింది. ‘ప్రధాని అపాయింట్‌మెంట్ కావాలని మంగళవారం అడిగా. బుధవారం కలిసేందుకు అనుమతి వచ్చింది. నా అకాడమీ నిర్మాణం ఏప్రిల్‌లో పూర్తవుతుంది. ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించా. తగిన సమయం దొరికే వరకు వేచి చూస్తానని ప్రధానికి చెప్పా. సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.
ఏం జరుగుతుందో చూద్దాం. మోదీతో సమావేశం చాలా ఆనందాన్నిచ్చింది’ అని మేరీకోమ్ వెల్లడించింది. తాను చెప్పిన విషయాలను చాలా శ్రద్ధగా విన్న ప్రధాని... భవిష్యత్‌లోనూ కావాల్సిన సహాయ సహకారాలను అందిస్తానన్నారని తెలిపింది. ‘నన్నో కూతురిలాగా భావించారు. అన్ని విషయాలు చాలా సావధానంగా విన్నారు. ఏ అవసరం వచ్చినా తనను సంప్రదించవచ్చని, ఓ కూతురిగా ఎప్పుడైనా తన ఇంటికి రావొచ్చని చెప్పారు’ అని ఈ బాక్సర్ వ్యాఖ్యానించింది.