ఆసీస్ క్రికెటర్లకే కాదు ఆ దేశానికి చెందిన క్రికెట్ అభిమానులకు కూడా నోటి దురుసు ఎక్కువేనని మరోసారి రుజువైంది. భారత్- ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మూడో టెస్టులో భాగంగా టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆతిథ్య జట్టు పతనాన్నిశాసించి.. టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఏడాదిలోపే అత్యధిక వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్‌గా సరికొత్త రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఉన్న భారత అభిమానులు, ఆటగాళ్లు సంబరాలు చేసుకోవడాన్ని ఓర్చుకోలేని ఆస్ట్రేలియా అభిమానులు జాత్యహంకారంతో రెచ్చిపోయారు. ‘ మీ వీసాలు చూపించండి.. మీ కెప్టెన్ ఓ పనికిరాని వ్యక్తి’ అంటూ టీజ్ చేశారు. బాక్సింగ్ డే టెస్టు మొదలైన నాటి నుంచి వీరు ఇలాగే ప్రవర్తిసున్న నేపథ్యంలో... వారి మాటలను రికార్డు చేసిన ‘ఈఎస్‌పీన్‌క్రిక్‌ఇన్‌ఫో’ ... ఈ విషయమై క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ)కు ఫిర్యాదు చేసింది. వీటిని రుజువు చేసేందుకు ఇందుకు సంబంధించిన వీడియోను కూడా జత చేసింది.(పంత్‌పై నోరుపారేసుకున్న టిమ్ పైన్)
ఈ విషయంపై స్పందించిన సీఏ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ‘ క్రికెట్ ఆస్ట్రేలియా జాత్యహంకార చర్యలను, వ్యాఖ్యలను ఎంతమాత్రం సహించదు. ఇతర దేశాలకు చెందిన ఆటగాళ్లు, అభిమానులు, సిబ్బంది ఇలా ఎవరినైనా సరే ఇలాంటి పిచ్చి చేష్టలతో బాధపెడితే సహించబోము. ఈ విషయం గురించి బాధితులు అక్కడున్న భద్రతా సిబ్బందికి ఫిర్యాదు చేయవచ్చు. విక్టోరియా పోలీసులు ఎంసీజీ వద్ద సెక్యూరిటీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అనుచితంగా ప్రవర్తించిన వారిని పోలీసులు బయటికి పంపించి వేశారు కూడా’ అని సమాధానమిచ్చారు. ఇలాంటి చర్యలు శ్రుతిమించితే వాళ్లు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అభిమానులపై సీఏ చర్యలు తీసుకోవడం బాగుంది... కానీ కవ్వింపు చర్యలతో భారత క్రికెటర్ల ఏకాగ్రతను దెబ్బతీసే వారి ఆటగాళ్లను మాత్రం అదుపు చేయలేదు ఎందుకో అంటూ టీమిండియా అభిమానులు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment