
గత ప్రపంచకప్ ఫైనలిస్టులు ప్రస్తుతం గడ్డు పరిస్థితుల్లో ఉన్నాయి. జర్మనీ... మెక్సికో చేతిలో ఓడి కోలుకునే ప్రయత్నంలో ఉంది. క్రొయేషియాపై దారుణ ఓటమితో అర్జెంటీనా తీవ్ర ఇబ్బందుల్లో పడింది. చివరి మ్యాచ్‌లో అర్జెంటీనా గెలిచినా... ఆ జట్టు నాకౌట్‌కు వెళ్లే అవకాశం ఇతర జట్ల దయపై ఆధారపడి ఉంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో ప్రత్యేకించి రెండోది అర్జెంటీనాకు చాలా కష్టంగా సాగింది. యూరోపియన్ ప్రత్యర్థి, జట్టు పరిస్థితి, వ్యూహ లోపాలు, మెస్సీపై అతిగా ఆధార పడటం ఇలా ఇందుకు కారణాలు అనేకం. ఏదైనా మంచి జరుగుతుందని ఇప్పటికీ నా మనసులో ఓ మూలన ఆశ ఉంది. అయితే... ప్రేక్షకుల్లో కూర్చుని కరిగిపోతున్న కలను చూడటం చాలా విషాదకరం. పోరాట స్ఫూర్తి కొరవడటం సమస్యలను మరింత అధికం చేస్తుంది. జట్టులో స్ఫూర్తి నింపలేకపోయాడంటూ ఇప్పుడు వేళ్లన్నీ మెస్సీ వైపే చూపుతారని నాకు తెలుసు. ప్రతిసారి మనం అతడిపై ఆశలు పెట్టుకుంటున్నాం. ఈసారి చురుకుగా లేని మెస్సీని ప్రత్యర్థులు కట్టడి చేస్తున్నారు. ఐస్‌లాండ్‌పై పెనాల్టీని అతడు గోల్ కొట్టలేకపోవడం చాలా తేడా చూపింది. ఇక క్రొయేషియాపై ప్రభావం చూపలేకపోయాడు. తను ఎంత ప్రయత్నిస్తున్నా లయ అందుకోలేకపోవడం దురదృష్టకరం. ఫుట్‌బాల్ ఒక్క వ్యక్తి ఆట కాదు. ఇప్పుడే కాదు, 1986లో నా సారథ్యంలో కప్ గెలిచినప్పుడు కూడా...!
మెస్సీ ప్రభావవంతంగా లేడంటే దానికి కారణం అతడి చుట్టూ నాణ్యమైన ఆటగాళ్లు లేకపోవడమే. గెలుపు ఘనతంతా క్రొయేషియాకే దక్కుతుంది. ఓటములకు మెస్సీని నిందించడం సులువే. అయితే దీనిని వేరే కోణంలో చూడటం ముఖ్యం. ఇప్పుడు అర్జెంటీనాకో పెద్ద విజయం కావాలి. ఇతర మ్యాచ్‌ల ఫలితాలూ అనుకూలంగా రావాలి. ఇది సమష్టి వైఫల్యం. దీనికి మెస్సీని తప్పుబట్టడం అంటే అసలు విషయాన్ని పక్కదారి పట్టించడమే. ఇలాంటివి నైజీరియాతో చివరి మ్యాచ్ తర్వాత మాట్లాడుకోవాలి. జర్మనీకి సైతం పరిస్థితి సులువుగా ఏమీ లేదు. దక్షిణ కొరియాను ఓడించినా, స్వీడన్‌తో కష్టమే. ఇదే జరిగితే డిఫెండింగ్ చాంపియన్‌కు కష్టకాలమే.