'క్లార్క్ కు కోలుకోవడానికి ఎక్కువ సమయం కావాలి'
సిడ్నీ: ఆసీస్ ఆటగాడు మైకేల్ క్లార్క్ గాయం నుంచి తిరిగి కోలుకోవడానికి మరింత ఎక్కువ సమయం కావాలిని మాజీ ఆటగాడు మైకేల్ హస్సీ అభిప్రాయపడ్డాడు. క్లార్క్ కు మరో రెండు నుంచి మూడు వారాల పాటు విశ్రాంతి అవసరమని హస్సీ ఈ సందర్భంగా తెలిపాడు. ప్రపంచకప్ ఆరంభంలో పెద్దగా అద్బుతాలు ఏమీ ఉండవని.. అసలైన పోటీ క్వార్టర్ ఫైనల్ మరియు సెమీ ఫైనల్లోనే ఉంటుందని స్పష్టం చేశాడు. ఆసీస్ క్రికెటర్లు మరింత మంచి క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నట్లు హస్సీ తెలిపాడు.' క్లార్క్ కచ్చితంగా కీలక ఆటగాడు. కెప్టెన్ కూడా. ఆసీస్ కు అతని అవసరం చాలా ఉంది. అందువల్ల క్లార్క్ ఎక్కువ సమయం విశ్రాంతి కల్పిస్తే ప్రధాన మ్యాచ్ లకు అందుబాటులోకి వస్తాడు' అని హస్సీ తెలిపాడు. తొలి నాలుగు మ్యాచ్ లకు అందుబాటులోకి రాకపోయినా పెద్దగా ఇబ్బందేమీ లేదన్నాడు.
ప్రస్తుతం ప్రపంచకప్ కు ఎంపికైన క్లార్క్ ఫిబ్రవరి 21 లోపు తన ఫిట్ నెస్ ను నిరూపించుకోవాలి. 15 మందితో కూడిన జట్టు సభ్యుల జాబితాను ఆదివారం ప్రకటించారు. అదే నెల 14న వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుంది. అదే రోజు తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో ఆస్ట్రేలియా ఆడుతుంది. ప్రస్తుతం క్లార్క్ ఫిట్ నెస్ ఆసీస్ డైలామాలో పడింది. ఒకవేళ క్లార్క్ ఫిట్ నెస్ ను నిరూపించుకోకపోతే ప్రపంచకప్ టోర్నీ మొత్తానికి దూరం కావాల్సి వస్తుంది. టీమిండియాతో డిసెంబర్ 9 వ తేదీన జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో క్లార్క్ గాయం తిరగబెట్టడంతో టెస్ట్ సిరీస్ నుంచి వైదొలిన సంగతి తెలిసిందే.