పింక్ బంతిపై స్టార్క్ అనుమానం | michael starc statement on pink ball | Sakshi
Sakshi News home page

పింక్ బంతిపై స్టార్క్ అనుమానం

Published Thu, Jul 2 2015 7:49 AM | Last Updated on Sun, Sep 3 2017 4:45 AM

పింక్ బంతిపై స్టార్క్ అనుమానం

పింక్ బంతిపై స్టార్క్ అనుమానం

సంప్రదాయన్నే కొనసాగించాలంటున్న మరికొందరు
 
టీ20 రాకతో క్రికెట్‌లో మరో శకం మొదలైంది. అప్పటికే టెస్టులకు ఆదరణ తగ్గుతున్న సమయంలో టీ20లు రావడంతో వాటిని చూసే వారి సంఖ్య పడిపోయింది. టెస్టులను కూడా జనరంజకంగా చేయాలని భావించిన ఐసీసీ డే/నైట్ టెస్టులు నిర్వహించాలని 2000లోనే వచ్చిన ఆలోచనను మళ్లీ తెరపైకి వచ్చింది. ఇన్నేళ్లకు తొలిసారి ఒక అంతర్జాతీయ డే/నైట్ టెస్టు మ్యాచ్ జరగబోతోంది. అంతా బాగానే ఉన్నా అందులో ఉపయోగించబోయే పింక్ రంగు బంతి ఇప్పుడు వివాదాలకు దారితీస్తోంది. ఇంతకు పింక్ రంగు బంతిలో సమస్య ఏమిటి..
 
ఫీల్డింగ్ చేసే సమయంలో పింక్ బంతి సరిగ్గా కనిపించదు. ఫీల్డర్‌కు కనిపించనప్పుడు చూసే అభిమానులు దాన్ని ఎలా గుర్తించగలుగుతారు. తాజాగా ఆస్ట్రేలియా పేస్ స్టార్ మిచెల్ స్టార్క్ అడిగిన ప్రశ్న ఇది. టెస్టు మ్యాచ్‌లు సంప్రదాయ క్రికెట్‌లో భాగం.. సంప్రదాయాన్ని అలా కొనసాగిస్తేనే బాగుంటుంది.. ఇది కొంతమంది సీనియర్ న్యూజిలాండ్ ఆటగాళ్ల వాదన. డే/నైట్ టెస్టులతో  క్రికెట్‌లో మరో విప్లవం రానుంది. ఇప్పటికే కొన్ని దేశవాళీ టోర్నీలలో ప్రయోగాత్మకంగా డే/నైట్ టెస్టులు జరిగినా ఈ ఏడాది చివర్లో అంతర్జాతీయ మ్యాచ్ జరగనుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లు ఆ చరిత్రాత్మక మ్యాచ్‌లో తలపడనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు అత్రుతగా ఎదురుచూస్తున్న ఆ మ్యాచ్‌పై ఇరు దేశాల క్రికెటర్లు కొన్ని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

బంతితోనే అసలు సమస్య
ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్‌లో ఇప్పటికే డే/నైట్ టెస్టు మ్యాచ్‌లు మొదలయ్యాయి. ఆ మ్యాచ్‌ల్లో ఆడిన స్టార్క్ పింక్ బంతులపై అనుమానం వ్యక్తం చేశాడు. ‘‘ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ఫీల్డింగ్ సమయంలో  పింక్ బంతులు సరిగ్గా కనిపించవు. అలాగే బౌలింగ్ చేసే సమయంలో బంతి స్వింగ్ కాదు. త్వరగా మెరుపు కోల్పోతుంది. దాంతో పేసర్లకు ఇబ్బందిగా మారుతుంది. రివర్స్ స్వింగ్ చేయడం కూడా కష్టం. కచ్చితంగా ఎర్ర బంతితో పోలిస్తే పింక్ బాల్ చాలా వైవిధ్యమైంది’’ అని చెప్పుకొచ్చాడు. పైగా కొందరికి పింక్ కలర్ కనిపించని లోపం కూడా ఉంటుందని, దానికి తన సహచరుడు క్రిస్ రోజర్స్‌ను ఉదహరించాడు. డే/నైట్ టెస్టులకు వేరేగా స్టాట్స్ ఏర్పాటు చేయాలని చెప్పుకొచ్చాడు. అయితే మ్యాచ్‌లు నిర్వహించేది క్రికెట్‌కు క్రేజ్ పెంచేందుకే కాబట్టి మనం గౌరవించాలని చివరి మాటగా అన్నాడు.

సంప్రదాయాన్ని మార్చకూడదు
వన్డేల్లో మార్పులు తెచ్చినా సరేకానీ టెస్టుల్లో చెస్తే క్రికెట్ విలువ తగ్గించినట్లు అవుతుందని కొందరి అభిప్రాయం. టెస్టు ఫార్మాట్ సంప్రదాయ క్రికెట్ అని దానిలో ఎక్కువ మార్పులు చేస్తే బాగుండదని న్యూజిలాండ్  క్రికెటర్లు అంటున్నారు. ఇదే అభిప్రాయాన్ని మరో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ జాన్సన్ కూడా వ్యక్తపరిచాడు. ఎప్పుడో 1877లో ప్రారంభమైన టెస్టుల్లో ఇప్పటివరకు చాలా మార్పులు వచ్చాయని, ప్రస్తుతం కొత్త విప్లవం రాబోతుం దని కివీస్ బోర్డు అధ్యక్షుడు డేవిడ్ వైట్ చెప్పాడు. అయితే ఇప్పటికిప్పుడు డే/నైట్ టెస్టులు ఎక్కువగా జరిగే అవకాశం లేదని ప్రస్తుతం ఇంకా ప్రయోగ దశలోనే ఉందన్నాడు.
 
నిజానికి టెస్టుల్లో రెడ్ (ఎరుపు) రంగు బంతుల్ని వాడతారు. డే/నైట్ మ్యాచ్‌లో రాత్రి సమయంలో ఫడ్‌లైట్ల వెలుతురులో ఆడాల్సి ఉంటుంది. అందుకే ఎరుపు కంటే ఇంకా స్పష్టంగా కనిపించేందుకు పింక్ రంగు బంతులని వాడాలని ఐసీసీ నిర్ణయించింది. పింక్ బంతులు ప్రముఖ సంస్థ కుకుబుర్రా తయారుచేస్తోంది. ఎర్ర బంతి కంటే పింక్ బంతి స్పష్టంగా కనిపిస్తుందని ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.
 
డే/నైట్ టెస్టు మ్యాచ్ విశేషాలు
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య అడిలైడ్ ఓవల్‌లో నవంబర్ 27 - డిసెంబర్ 1 మధ్య మ్యాచ్ జరగనుంది.
మ్యాచ్ మధ్యహ ్నం గం. 2.30 నుంచి రాత్రి గం. 9.30 వరకు జరుగుతుంది.
తొలి, రెండో సెషన్ మధ్య 20 నిమిషాల బ్రేక్ సమయాన్ని ‘టీ’గా; రెండు, మూడో సెషన్ మధ్య 40 నిమిషాల బ్రేక్‌ను ‘డిన్నర్’గా పరిగణిస్తారు.
ఆస్ట్రేలియాతో క్రికెట్ సంబంధాలు మెరుగుపరచుకోవడానికి న్యూజిలాండ్ ఈ సిరీస్‌కు ఒప్పుకుంది. ఎందుకంటే ఈ రెండు జట్ల మధ్య 2011 తర్వాత టెస్టు మ్యాచ్ జరగలేదు.
మ్యాచ్ ఆడే పింక్ బంతిపై ఆసీస్ క్రికెటర్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
సంప్రదాయక టెస్టుల్లో మార్పులు మంచిది కాదని న్యూజిలాండ్ క్రికెటర్ల అభిప్రాయం.  -మన్నె కిశోర్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement