ఉండబట్టలేక బంతులేశాడు.. జట్టును ముంచాడు..! | Michael Vaughan Critics Afghanistan Captain Bowl Against Pakistan | Sakshi
Sakshi News home page

ఉండబట్టలేక బంతులేశాడు.. జట్టును ముంచాడు..!

Published Sun, Jun 30 2019 10:55 AM | Last Updated on Sun, Jun 30 2019 11:15 AM

Michael Vaughan Critics Afghanistan Captain Bowl Against Pakistan - Sakshi

లీడ్స్‌: ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో అఫ్గాన్‌ చేజేతులో ఓడింది. స్పిన్నర్లు అద్భుత బౌలింగ్‌తో పాక్‌ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేస్తున్న తరుణంలో అఫ్గాన్‌ కెప్టెన్‌ గుల్బదిన్‌ చెత్త నిర్ణయం తీసుకున్నాడు. అప్పటికీ 228 పరుగుల లక్ష్య ఛేదనలో తడబడిన పాక్‌ ఒక దశలో 45 ఓవర్లలో 6 వికెట్లకు 182 పరుగులు చేసింది. 5 ఓవర్లలో 46 పరుగులు అంటే 9కి పైగా రన్‌రేట్‌తో కష్టసాధ్యమైన పరిస్థితి! ప్రధాన స్పిన్నర్లు రషీద్, ముజీబ్‌లకు కలిపి 3 ఓవర్లు, అంతకుముందు ఓవర్లో 2 పరుగులే ఇచ్చిన లెగ్‌స్పిన్నర్‌ షిన్వారికి మరో 2 ఓవర్లు మిగిలే ఉన్నాయి. 

కానీ, అప్పటికే అందరికంటే ఎక్కువ పరుగులు ఇచ్చిన నైబ్‌ అత్యుత్సాహంతో బౌలింగ్‌కు సిద్ధమయ్యాడు. బౌలింగ్‌ (46వ ఓవర్‌) చేసి విజయాన్ని బంగారు పళ్లెంలో పెట్టి ప్రత్యర్థికి అందించాడు. ఈ ఓవర్లో చెలరేగిన ఇమాద్‌ వసీం మూడు ఫోర్లు సహా ఏకంగా 18 పరుగులు రాబట్టి పాక్‌ పని సులువు చేశాడు. ఒక్కసారిగా 18 బంతుల్లో 28 పరుగులకు సమీకరణం మారిపోగా, 16 బంతుల్లోనే పాక్‌ పని పూర్తి చేసింది. ఈ విజయంతో పాక్‌ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరగా.. ఇంగ్లండ్‌ ఐదో స్థానానికి పడిపోయింది.
(అయ్యో అఫ్గాన్‌!)

ఇదిలాఉండగా.. గుల్బదిన్‌ అత్యుత్సాహంపై స్వదేశీ అభిమానులతోపాటు ఇంగ్లండ్‌ మాజీ ఆటగాళ్లు, అభిమానులు సైతం మండిపడుతున్నారు. ప్రపంచకప్‌లో అఫ్గాన్‌ తొలి విజయం సాధించే అవకాశానికి గండికొట్టడంతో పాటు ఇంగ్లండ్‌ సెమీస్‌ అవకాశాలనూ సంక్లిష్టం చేశారని ఇంగ్లీష్‌ జుట్టు మాజీ కెప్టెన్‌ మైఖేల్‌వాన్‌ అసహనం వ్యక్తం చేశాడు. ఓటమితో సెమీస్‌రేసులో వెనకబడిపోతుందనుకున్న పాక్‌కు అనూహ్య విజయాన్నందించాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక పాక్‌ విజయంతో సెమీస్‌ చేరాలంటే ఇంగ్లండ్‌ భారత్‌, న్యూజిలాండ్‌తో తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకవేళ అఫ్గాన్‌ చేతిలో పాక్‌ పరాజయం పాలైతే ఇంగ్లండ్‌ సెమీస్‌ అవకాశాలు మరింత సరళమయ్యేవి.

శనివారం ఇక్కడి హెడింగ్లీ మైదానంలో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ 3 వికెట్ల తేడాతో అఫ్గాన్‌పై గెలుపొందింది. ఫలితంగా తమ సెమీస్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్‌ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. అస్గర్‌ అఫ్గాన్‌ (35 బంతుల్లో 42; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), నజీబుల్లా జద్రాన్‌ (54 బంతుల్లో 42; 6 ఫోర్లు) టాప్‌ స్కోరర్లుగా నిలిచారు.షాహిన్‌ అఫ్రిది 4 వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. అనంతరం పాకిస్తాన్‌ 49.4 ఓవర్లలో 7 వికెట్లకు 230 పరుగులు సాధించింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఇమాద్‌ వసీం (54 బంతుల్లో 49 నాటౌట్‌; 5 ఫోర్లు) అద్భుత బ్యాటింగ్‌తో చివరి వరకు నిలిచి జట్టును గెలిపించగా... బాబర్‌ ఆజమ్‌ (51 బంతుల్లో 45; 5 ఫోర్లు), ఇమామ్‌ ఉల్‌ హఖ్‌ (36) రాణించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement