సిడ్నీ: ‘మీకు రికీ పాంటింగ్, ఎంఎస్ ధోనిల్లో ఫేవరెట్ వన్డే కెప్టెన్ ఎవరు?’ అనే ప్రశ్న ఆసీస్ మాజీ క్రికెటర్ మైక్ హస్సీకి ఎదురైంది. ఆసీస్ తరఫున పాంటింగ్‌తో కలిసి సుదీర్ఘ కాలం క్రికెట్ ఆడగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఎంఎస్ ధోని నేతృత్వంలో హస్సీ ఆడాడు. ఈ నేపథ్యంలో హస్సీని ఒక ఇబ్బందికర ప్రశ్న కాస్త ఆలోచనలో పడేసింది. భారత్ క్రికెట్ తరఫున ఒక టీ20 వరల్డ్‌కప్, 2013 చాంపియన్స్ ట్రోఫీ, వన్డే వరల్డ్‌కప్‌లను గెలిచిన ఘనత ధోనిది. ఐసీసీ నిర్వహించే ఈ మూడు మెగా టైటిల్స్‌ను ధోని తన కెప్టెన్సీలో అందుకుని దీన్ని సాధించిన ఏకైక భారత కెప్టెన్‌గా గుర్తింపు పొందాడు. ఇక ధోని వన్డే విజయాల సగటు 59.52గా ఉంది.
మొత్తం వన్డే ఫార్మాట్‌లో 199 మ్యాచ్‌లకు గాను 110 విజయాలు అందుకున్నాడు ధోని. ఇక పాంటింగ్ విషయానికొస్తే 2003, 2007 వన్డే వరల్డ్‌కప్‌లను అందించిన ఆసీస్ కెప్టెన్. ఆ జట్టు కెప్టెన్‌గా తన కెరీర్‌గా ముగిసే నాటికి పాంటింగ్ విజయాల సగటు 76.14గా ఉంది. అయితే ఇద్దరి కెప్టెన్లతో ఆడిన క్రికెటర్ హస్సీ. దాంతో హస్సీకి కష్టతరమైన ప్రశ్న ఎదురైనా దానికి మాత్రం క్లియర్‌గా సమాధానం చెప్పాడు.
‘నేను ధోని, పాంటింగ్‌ల సారథ్యంలో మ్యాచ్‌లు ఆడా. ఆ ఇద్దరిలో ఎవరు మీ ఫేవరెట్ కెప్టెన్ అంటే ఏమి చెబుతా. ఇది కచ్చితంగా కఠినతరమైన ప్రశ్నే. కాకపోతే నేనే పాంటింగే నా ఫేవరెట్ కెప్టెన్ అని బదులిస్తా. ఎందుకంటే ధోని కెప్టెన్సీలో నేను వన్డేలు ఆడలేదు. దాంతో నా ఫేవరెట్ వన్డే కెప్టెన్ పాంటింగే అవుతాడు కదా’ అని హస్సీ చెప్పాడు. 2011, 2012 ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన సీఎస్‌కే జట్టులో హస్సీ సభ్యుడిగా ఉన్నాడు. ధోని కెప్టెన్సీలో వరుసగా రెండు టైటిల్స్ సాధించిన సీఎస్‌కే జట్టులో హస్సీ పాల్గొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment