
ఫుట్‌బాల్ క్రీడకు ప్రోత్సాహం
సాక్షి, హైదరాబాద్: భారత్‌లో జరుగనున్న ‘ఫిఫా’ అండర్–17 ఫుట్‌బాల్ ప్రపంచకప్ ప్రచారంలో భాగంగా బుధవారం ఎల్బీ స్టేడియంలో ‘మిషన్ ఎలెవన్ మిలియన్’ పేరిట సెమినార్‌ను ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో ఫుట్‌బాల్ క్రీడాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు గురించి చర్చలు జరిపారు. పిల్లల్లో ఫుట్‌బాల్ క్రీడపై ఆసక్తి కలిగించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లు నిర్వహించాలని పాఠశాలల ప్రిన్సిపల్స్, పీఈటీలు నిర్ణయం తీసుకున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో వారంలో ఒకరోజు పిల్లలకి ఫుట్‌బాల్ క్రీడలో మెళకువలు నేర్పించాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో ‘శాట్స్’ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్‌రెడ్డి, ఎండీ దినకర్‌బాబు, సీనియర్ కోచ్ ఆరిఫ్, తెలంగాణ ఫుట్‌బాల్ సంఘం అధ్యక్షులు మొహమ్మద్ అలీ రఫాత్, కార్యదర్శి ఫల్గుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలకు 500 ఫుట్‌బాల్‌లను పంపిణీ చేశారు.