
ముంబై: ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ భారత జట్టులోని లోపాలను బయటపెట్టిందని మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ చెప్పింది. పటిష్టమైన రిజర్వ్ బెంచ్ అవసరముందని తెలిపింది. ఆసీస్ చేతిలో సొంతగడ్డపై భారత్ 0–3తో క్లీన్‌స్వీప్ అయిన సంగతి తెలిసిందే. మంగ ళవారం మీడియా సమావేశంలో మిథాలీ మాట్లాడుతూ ‘గతేడాది ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచాకే భారత ‘ఎ’ జట్టును తయారు చేశాం. వాళ్లు రాటుదేలేందుకు సమయం పడుతుంది. ఇపుడు అంతర్జాతీయ జట్లతో ఆడుతున్న అనుభవం వాళ్లకు అక్కరకొస్తుంది. సత్తాగల క్రీడాకారిణులు అందుబాటులో ఉన్నారు. వాళ్లంతా విదేశీ జట్లతో ఆడినపుడే పరిణతి చెందుతారు. మరో రెండేళ్లలో పరిస్థితిలో తప్పకుండా మార్పుంటుంది’ అని చెప్పింది.
ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌పై స్పందిస్తూ... ఆ జట్టు అన్ని విభాగాల్లోనూ చాలా పటిష్టంగా ఉందని తొలి మ్యాచ్‌లోనే తమకు అర్థమైందని చెప్పింది. దక్షిణాఫ్రికా పర్యటనలో గెలిచిన సిరీస్‌ను, సొంతగడ్డపై ఓడిన సిరీస్‌తో పోల్చడం తగదని వివరించింది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలతో రేపటినుంచి జరుగనున్న టి20 ముక్కోణపు టోర్నీ పోటాపోటీగా సాగుతుందని తెలిపింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మహిళా క్రికెటర్ల కాంట్రాక్టు ఫీజుల పెంపుపై మిథాలీ హర్షం వ్యక్తం చేసింది. ఇప్పుడైతే మహిళల ఐపీఎల్ అవసరం లేదని చెప్పింది. దేశవాళీ మహిళల క్రికెట్‌లో బలమైన జట్లు ఉన్నప్పుడే లీగ్ విజయవంతమవుతుందని భారత సారథి పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment