సాక్షి, హైదరాబాద్: జాతీయ సబ్ జూనియర్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్‌లో తెలంగాణ జట్లకు మిశ్రమ ఫలితాలు లభించాయి. బాలుర గ్రూప్ ‘ఎఫ్’ లీగ్ మ్యాచ్‌లో తెలంగాణ 42-21తో బిహార్‌ను ఓడించగా... బాలికల గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో తెలంగాణ జట్టు 29-46తో ఉత్తర్ ప్రదేశ్ చేతిలో ఓడిపోయింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ బాలబాలికల జట్లు శుభారంభం చేశాయి. ఇక్కడి సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో శనివారం మొదలైన ఈ టోర్నమెంట్‌ను కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. బాలికల గ్రూప్ ‘ఎఫ్’ లీగ్ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్ 41-16తో చండీగఢ్‌ను ఓడించింది.
ఆంధ్రప్రదేశ్ తరపున వెంకటలక్ష్మి (17 పాయింట్లు), జాస్మిన్ (10), అంజలి (8) రాణించారు. బాలుర విభాగం గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్ 58-56తో ఉత్తర్‌ప్రదేశ్‌పై గెలిచింది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో భారత బాస్కెట్‌బాల్ సమాఖ్య (బీఎఫ్‌ఐ) ఉపాధ్యక్షులు అజయ్ సూద్, షఫీఖ్ షేక్, తెలంగాణ బాస్కెట్‌బాల్ సంఘం అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ నార్మన్ ఐజాక్, హైదరాబాద్ జిల్లా బాస్కెట్‌బాల్ సంఘం అధ్యక్షుడు ఆర్.శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.