మొయిన్ అలీ
బెంగళూరు: సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ శక్తి వంచన లేకుండా పోరాడినప్పటికీ విజయం మాత్రం రాయల్ చాలెంజర్స్ బెంగుళూరునే వరించింది. గురువారం రాత్రి ఇక‍్కడి ఎమ్ చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మీద బెంగుళూరు 14 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంలో మొయిన్ అలీ కీలక పాత్ర పోషించాడు. ఏబీ డివిలియర్స్‌కి జతగా క్రీజులోకి దిగిన మొయిన్ అలీ వరుస సిక్స్‌లతో జట్టును విజయ తీరాలవైపు నడిపించాడు. ఈ విజయపై అలీ మాట్లాడుతూ.. ‘ఇప్పుడు మా జట్టు విజయం సాధించడం చాలా అవసరం. మేం ప్లే ఆఫ్ చేరడానికి ఈ విజయం దోహదపడుతుంది. జట్టులోని మిగతా సభ్యులను నేను కోరేది ఒక్కటే. మనం ఎప్పుడూ వారిద్దరి(కోహ్లి, డివిలియర్స్) మీదే ఆధారపడటం మంచిది కాదు. జట్టు విజయం కోసం మనందరం కృషి చేయాలని’ సూచించాడు.
నెట్స్‌లో చేసిన ప్రాక్టీసు తనకు బాగా కలిసొచ్చిందన్నాడు. తానేమీ చాలా గొప్ప ఆటగాడిగా ఇక్కడకు రాలేదని తెలిపాడు. కానీ ఐపీఎల్‌లో ఆడిన అనుభవం తనకు ఇకనుంచీ ఆడే వన్డేల్లో బాగా ఉపయోగపడుతుందని హర్షం వ్యక్తం చేశాడు. అదేవిధంగా తనకు శిక్షణ ఇచ్చిన కోచ్‌లు గ్యారీ, ట్రెంట్‌లను గుర్తు చేసుకున్నాడు. వారు బ్యాటింగ్ విషయంలో తనకు చాలా సలహాలు ఇచ్చారని, వారి వల్లే తన ఆట తీరు మెరుగుపడిందని వెల్లడించాడు. గురువారం జరిగిన మ్యాచ్‌లో అలీ-డివిలియర్స్ 105 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయగా, అందులో అలీ 34 బంతుల్లోనే 65 పరుగులు సాధించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment