
టీమిండియాలో వారిద్దరినీ పక్కనపెట్టాలి
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో రెండో టెస్టుకు భారత్ తుది జట్టులో మార్పులు చేయాలని మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ సూచించాడు. తుది జట్టు నుంచి సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ, ఆల్ రౌండర్ జయంత్ యాదవ్‌లను తొలగించి వారి స్థానాల్లో ఇతరులకు అవకాశం ఇవ్వాలన్నాడు.
'టీమిండియా సిరీస్‌ను ఓడిపోతుందని చెప్పడం లేదు. భారత్‌కు గెలిచే అవకాశాలున్నాయి. రెండో టెస్టుకు జట్టులో రెండు మార్పులు చేయడం మేలని భావిస్తున్నా. తుది జట్టు నుంచి జయంత్, ఇషాంత్‌లను తొలగించాలి. భారత్ బ్యాటింగ్ ప్రదర్శనను పరిశీలిస్తే ఓ ఎక్స్ ట్రా బ్యాట్స్‌మన్ అవసరం. కరుణ్ నాయర్‌ను ఆడిస్తే బాగుంటుంది. జయంత్ స్థానంలో అతన్ని బరిలో దించాలి. అలాగే మ్యాచ్‌లు ఆడబోయే పిచ్‌లను బట్టి ఇషాంత్‌కు బదులు భువనేశ్వర్ కుమార్‌కు అవకాశం ఇవ్వాలి' అని అజర్ అన్నాడు. తొలి మ్యాచ్ లో భారత్ చిత్తుగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. రెండో టెస్టు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది.