
కోల్‌కతా: భారత్ తరఫున టెస్టుల్లో ఈ ఏడాది అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ మొహమ్మద్ షమీ. 9 టెస్టుల్లో అతను 27.60 సగటుతో 33 వికెట్లు పడగొట్టాడు. దక్షిణాఫ్రికాతో జొహన్నెస్‌బర్గ్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన షమీ జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఆస్ట్రేలియాతో జరగబోయే టెస్టు సిరీస్‌లో అతను మరింత కీలకం కానున్నాడు. అయితే అనేక సార్లు గాయాలపాలైన షమీ ఫిట్‌నెస్‌పై బీసీసీఐకి సందేహాలున్నాయి. దాంతో అతని విషయంలో బోర్డు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. ఆసీస్ టూర్‌కు ముందు మ్యాచ్ ప్రాక్టీస్ కోసం రంజీ ట్రోఫీ ఆడాలని నిర్ణయించుకున్న షమీకి బౌలింగ్ విషయంలో పరిమితులు విధించింది.
ఈ నెల 20నుంచి కేరళతో తలపడే బెంగాల్ జట్టు తరఫున షమీ బరిలోకి దిగనున్నాడు. ఈ మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో గరిష్టంగా 15 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయాలని, మరీ తప్పనిసరి అయితే మరో రెండు ఓవర్ల వరకు అదనంగా వేయవచ్చని సూచించింది. పైగా షమీపై అదనపు భారం పడకుండా చూడాలని, ప్రతీ రోజు అతని ఆటను పర్యవేక్షించి బీసీసీఐ ఫిజియో నివేదిక పంపించాలని కూడా ఆదేశాలిచ్చింది. బోర్డు సూచనను తాము పరిగణలోకి తీసుకుంటామని, అయితే షమీ రంజీ మ్యాచ్ ఆడటం అతనికే కాకుండా భారత జట్టుకు కూడా ఉపయోగపడుతుందని బెంగాల్ జట్టు మెంటర్ అరుణ్ లాల్ అభిప్రాయ పడ్డారు.