న్యూఢిల్లీ: తాను ఆత్మహత్య చేసుకోవాలన్న సందర్భాలు చాలానే ఉన్నాయని టీమిండియా పేసర్ మహ్మద్ షమీ తాజాగా తెలిపాడు. ఇటీవల బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో షమీ ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితిని చెప్పుకొచ్చాడు. పేలవమైన ఫామ్‌తో జట్టులో చోటు కోల్పోవడం మొదలుకొని ఫిక్సింగ్ ఆరోపణలు చుట్టిముట్టిన సమయంలో చావే శరణ్యమని అనిపించిందన్నాడు. కానీ ఆ కష్ట సమయంలో కుటుంబ సభ్యులు అండగా ఉండటంతో దాని నుంచి బయటపడ్డానన్నాడు. అదే సమయంలో భారత క్రికెట్‌లోని తన సహచర క్రికెటర్ల మద్దతు కూడా వెన్నంటే ఉండటం కూడా ఆ చెడు ఆలోచనల నుంచి బయటకు రావడానికి కారణమన్నాడు.(రోహిత్ నా రోల్ మోడల్: పాక్ క్రికెటర్)
‘డిప్రెషన్ అనేది చాలా పెద్ద సమస్య. అందుకు తగిన కౌన్సిలింగ్ తీసుకోవడం లేదా ఆ బాధను మనకు దగ్గర వాళ్లతో పంచుకుంటే ఎంతో కొంత ఉపశమనం లభిస్తుంది. నా విషయంలో కూడా అదే జరిగింది. ఆత్మహత్య ఒక్కటే శరణ్యమని భావించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఆ సమయంలో నా కుటుంబం అండగా నిలబడింది. నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. అలా ఆత్మహత్య ఆలోచనల నుంచి బయటపడి పోరాటం చేయాల్సిందే అనే భావనకు వచ్చా. నేను ఎప్పుడూ ఒంటరి కాదనే భరోసా నా కుటుంబ సభ్యులు నాకిచ్చారు. అలానే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, సహచర క్రికెటర్ల కూడా నాకు అండగా నిలిచారు. ఎవరైనా మానసిక సమస్యతో సతమతమైతే దాన్ని మీలోనే ఉంచుకోకండి. మన మంచిని కోరుకునే వాళ్లతో పంచుకోండి. సమాధానం దొరుకుతుంది. అంతేకానీ చావు ఒక్కటే మార్గం కాదు. నా విషయంలో జట్టు నుంచి వచ్చిన సహకారం ఎప్పటికీ మరవలేనిది. నేను నిజంగా అదృష్టవంతుడ్నే’ అని షమీ తెలిపాడు.
ఇంగ్లండ్, ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌ల్లో షమీ తన ఫామ్‌ను చాటుకుని నిలబడ్డాడు. సుదీర్ఘ కాలం జట్టుకు దూరమైన షమీ అంతే వేగంగా పుంజుకున్నాడు. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టులో ప్రధాన పేసర్‌గా షమీ కొనసాగుతున్నాడు. ఒకవైపు షమీపై భార్య లేనిపోని ఆరోపణలు చేయడం కూడా అతని మానసిక స్థైర్యాన్ని కుంగదీసింది. కాగా, వాటిని అధిగమించిన షమీ.. ఆత్మహత్య ఆలోచనలు అనేవి మంచివి కావన్నాడు. మనకు ఏమైనా బాధనిపిస్తే షేర్ చేసుకుంటే ఎంతో కొంత తీరుతుందని పేర్కొన్నాడు. (తల్లి మరణం: క్రికెటర్ భావోద్వేగ పోస్ట్)
Comments
Please login to add a commentAdd a comment