
వన్డే, టీ20 సిరీస్ లకు షమీ దూరం
న్యూఢిల్లీ: త్వరలో ఇంగ్లండ్తో జరగబోయే వన్డే, ట్వంటీ 20 సిరీస్లకు భారత ప్రధాన బౌలర్ మొహ్మద్ షమీ దూరం కానున్నాడు. మోకాలి గాయంతో బాధపడుతున్న షమీ.. ఇంగ్లండ్ తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్ నుంచి వైదొలగాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే అతని స్థానంలో ఇషాంత్ శర్మకు వన్డే జట్టు ప్రాబబుల్స్ లో చోటు దక్కే అవకాశం కనబడుతోంది. ఇటీవల ముగిసిన టెస్టు సిరీస్లో ఇషాంత్ కు చోటు కల్పించిన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) సెలక్టర్లు మరొకసారి అతనికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. అయితే వెటరన్ బౌలర్ ఆశిష్ నెహ్రా పేరును ట్వంటీ 20 సిరీస్ కు పరిశీలిస్తున్నారు.
ఇటీవల టీమిండియా కీలక ఆటగాళ్లు గాయాలు పాలు కావడంతో యువ క్రికెటర్లకు అవకాశం కల్పిస్తున్నారు. గాయం కారణంగా రోహిత్ శర్మ టెస్టు సిరీస్కు దూరమైన నేపథ్యంలో కరుణ్ నాయర్ కు అవకాశం కల్పించారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న నాయర్..ఇంగ్లండ్ తో జరిగే వన్డే, టీ 20 సిరీస్ల్లో ఆడే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంగ్లండ్ తో తదుపరి సిరీస్లకు అజింక్యా రహానే, శిఖర్ ధవన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. గాయం నుంచి కోలుకుంటున్న వీరిద్దరూ వన్డే, ట్వంటీ20 సిరీస్ల్లో ఆడతారని సెలక్టర్లు భావిస్తున్నారు.