హసీన్ జహాన్, షేకీ సైఫుద్దీన్ ( హసీన్ మాజీ భర్తనని చెబుతున్న వ్యక్తి)
సాక్షి, స్పోర్ట్స్ : టీమిండియా పేసర్ మహ్మద్ షమీ వివాహేతర సంబంధాల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. షమీ భార్య హసీన్ జహాన్‌కు ఇదివరకే పెళ్లైనట్లు వార్తలు రావడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఆమె మాజీ భర్తనంటూ షేకీ సైఫుద్దీన్ అనే పశ్చిమ బెంగాల్ వాసి ఒకరు మీడియా ముందుకు వచ్చారు.
స్థానిక చానెల్ (జీ24 గంటా)తో మాట్లాడుతూ.. హసీన్ జహాన్ తన మాజీ భార్య అని, ఆమెను 2002లో పెళ్లి చేసుకున్నాని తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లోని బర్భమ్, సియూరిలో కొంత కాలం కాపురం చేసామన్నారు. అయితే తమ వివాహాన్ని కుటుంబ సభ్యులు అంగీకరించలేదని, హసీన్‌ను తొలిసారి 2000 సంవత్సరంలో కలిసానని, అనంతరం వివాహంతో ఇద్దరం ఒక్కటయ్యామన్నారు.
ఆమె ఇద్దరి కూతుళ్లకు కూడా జన్మనిచ్చిందన్నారు. 2003లో ఒకరిని, 2006లో మరొకరికి జన్మనిచ్చినట్లు సైఫుద్దీన్ తెలిపారు. అనంతరం సమస్యలు మొదలయ్యాయని, ఆమె ఉన్నత చదువులు చదువుకొని స్వతంత్రంగా నిలబడాలని కోరుకుందని, మధ్య తరగతి కుటుంబం కావడంతో అది సాధ్యం కాలేదన్నారు. దీంతోనే 2010లో విడాకులు తీసుకున్నామని, ఇద్దరు పిల్లలు హసిన్ దగ్గరే ఉండాలని, ఆమె వివాహనంతరం తండ్రి దగ్గరకు వెళ్లాలని కోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. షమీతో ఆమె వివాహనంతరం పిల్లలు తనవద్దకు వచ్చారన్నారు. షమీ, హసీన్ జహన్‌ల మధ్య వివాదం పరిష్కరమై ఒక్కటవ్వాలని సైఫుద్దీన్ కోరుకున్నారు.
హసీన్ కూతుళ్లు మాట్లాడుతూ.. తన తల్లి ఎక్కడున్నా సంతోషంగా ఉండాలన్నారు. సెలవుల్లో తన తల్లిని కలుస్తామని వారు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రతి రోజు మీడియా ముందు ప్రశాంతంగా మాట్లాడిన హసీన్ మంగళవారం మీడియాపై అసహన వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. అయితే ఆమెకు ఇదివరకే పెళ్లైందా లేదనే విషయం అధికారికంగా తెలియరాలేదు.
ఇక షమీ వివాహేతర సంబంధాలు కలిగి ఉన్నాడని, తనను వేధించాడని హాసిన్ జహాన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలతో షమీ క్రికెట్ కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment