మహ్మద్ షమీ, హసీన్ జహాన్ (ఫైల్ ఫొటో)
కోల్‌కతా : ఓ వైపు టీమిండియా పేసర్ మహ్మద్ షమీ భార్యకోసం పరితపిస్తుంటే.. ఆమె మాత్రం అతన్ని మరింత ఇబ్బందుల్లో నెట్టడానికి ప్రయత్నిస్తోంది. తాజాగా హసీన్ జహాన్ షమీపై మరో కేసు దాఖలు చేసింది. మంగళవారం కోల్‌కతాలోని అలీపూర్ కోర్టులో గృహహింస చట్టం 2005 కింద ఆమె పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌లో తనకు, తన కూతురి పోషణకు.. షమీ భరణం చెల్లించేలా ఆదేశాలివ్వాలని కోరింది. తమ అకౌంట్ నుంచి డబ్బులు తీసుకోకుండా షమీ బ్యాంకులకు సూచనలిచ్చాడని జహాన్ ఆరోపించింది. ఇటీవల తాను చెక్ సాయంతో డబ్బుతీసుకోవాలని ప్రయత్నించానని, కానీ డబ్బులు రాలేదని ఆమె పేర్కొంది. ఈ నేపథ్యంలోనే భరణం కోసం కోర్టుకెక్కినట్లు తెలిపింది.
గతంలో షమీ ఇతర మహిళలతో సంబంధాలు పెట్టుకున్నాడని, తనను మానసికంగా వేధించాడని, ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని జహాన్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. గృహ హింస చట్టం కింద షమీతో పాటు, అతని కుటుంబ సభ్యులపై కోల్‌కతా పోలీసులకు సైతం ఫిర్యాదు చేసింది. అంతటితో ఆగని ఆమె షమీని ఐపీఎల్‌లో ఆడనివ్వద్దని బీసీసీఐ అధికారులకు కూడా విజ్ఞప్తి చేసింది. తొలుత వార్షిక వేతనాల్లో కాంట్రాక్టు ఇవ్వని బీసీసీఐ ఫిక్సింగ్ ఆరోపణల విచారనంతరం గ్రేడ్ బీ కాంట్రాక్టును పునరుద్దరించింది. జహాన్ విన్నపాన్ని తోసిపుచ్చిన బీసీసీఐ షమీకి ఐపీఎల్‌లో ఆడే అవకాశం కూడా కల్పించింది. ప్రస్తుతం షమీ ఢిల్లీ డేర్ డేవిల్స్ జట్టు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఆదివారం కింగ్స్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సైతం పాల్గొన్నాడు. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఓడిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment