‘మోంటెకార్లో’ ఫైనల్లో బోపన్న జంట
న్యూఢిల్లీ: భారత డబుల్స్ టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న తన భాగస్వామి పాబ్లో క్యువాస్ (ఉరుగ్వే)తో కలిసి మోంటెకార్లో మాస్టర్స్ సిరీస్ టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో బోపన్న–క్యువాస్ ద్వయం 6–4, 6–3తో రొమైన్ అర్‌నియోడో (మొనాకో)–హుగో నిస్ (ఫ్రాన్స్) జంటపై గెలిచింది. గంటపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న ద్వయం ఐదు ఏస్‌లు సంధించి, ప్రత్యర్థి జోడీ సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. ఆదివారం జరిగే ఫైనల్లో ఫెలిసియానో లోపెజ్–మార్క్ లోపెజ్ (స్పెయిన్)లతో బోపన్న–క్యువాస్ తలపడతారు.
చరిత్రకు విజయం దూరంలో: మరోవైపు ఇదే టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో తొమ్మిదిసార్లు విజేత రాఫెల్ నాదల్ (స్పెయిన్) 11వ సారి ఫైనల్‌కు చేరాడు. సెమీస్‌లో నాదల్ 6–3, 6–1తో డేవిడ్ గాఫిన్ (బెల్జియం)పై గెలిచాడు. ఆదివారం జరిగే ఫైనల్లో అల్బెర్ట్ రామోస్ (స్పెయిన్)తో ఆడతాడు. నాదల్ విజేతగా నిలిస్తే ఓపెన్ శకంలో (1968 నుంచి) ఒకే టోర్నీని పదిసార్లు గెలిచిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టిస్తాడు.