పుణె: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో సోమవారం మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్-ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో చెన్నై 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా, చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్‌లో చోటు చేసుకున్న అంబటి రాయుడు రనౌట్ అభిమానుల్లో నవ్వులు పూయించింది.
చెన్నై సూపర్ కింగ్స్ 130 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయిన క్రమంలో కెప్టెన్ ఎంఎస్ ధోని-అంబటి రాయుడుల జోడి ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేపట్టింది. వీరిద్దరూ నాల్గో వికెట్‌కు ఆరు ఓవర్లలో 79 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన తర్వాత రాయుడు పెవిలియన్‌కు చేరాడు. అయితే ఇక్కడ రాయుడు అనవసర పరుగు కోసం యత్నించి రనౌట్‌గా ఔటయ్యాడు. ఢిల్లీ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ వేసిన 20 ఓవర్ ఐదో బంతిని స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న ధోని ఎదుర్కొన్నాడు. ఆ బంతి బ్యాట్ తగలకుండా వికెట్ కీపర్ రిషబ్ పంత్ చేతుల్లోకి వెళ్లింది. అదే సమయంలో నాన్ స్టైకింగ్ ఎండ్‌లో ఉన్న రాయుడు పరుగే లక్ష్యంగా స్టైకింగ్ ఎండ్‌లోకి వెళ్లిపోయాడు. అయితే స్టైకింగ్ ఎండ్‌లో ఉన్న ధోని నుంచి ఎటువంటి సంకేతాలు రాలేదు. అప‍్పటికే కీపర్ బంతిని అందుకున్న రిషబ్.. ట్రెంట్ బౌల్ట్‌కు అందించాడు. అయితే అప్పటికే స్టైకింగ్ ఎండ్‌లోకి వెళ్లిపోయిన రాయుడు తిరిగి మళ్లీ నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లోకి వచ్చే యత్నంలో రనౌట్‌గా ఔటయ్యాడు. పిచ్ మధ్య నుంచి బౌల్ట్ బంతిని వికెట్లపైకి విసిరడం, బెయిల్స్ పడటం చకచకా జరిగిపోయాయి. రాయుడు తొందరపాటుకు అభిమానులతో పాటు చెన్నై శిబిరంలో నవ్వులు విరిశాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment