
మూడుసార్లు ఐపీఎల్ ఛాంపియన్స్ గా నిలిచిన చెన్నై జట్టు ఈ ఏడాది టైటిల్ సాధించేందుకు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. గత ఏడాది ప్రదర్శనను పునరావృతం కాకుండా ఐపిఎల్ 2021 లో తిరిగి తమ పాత ఫామ్‌ను అందుకోవాలని ఆ జట్టు భావిస్తోంది. అయితే ధోని, రైనా, రాయుడు బ్యాటింగ్ ఫామే ఎల్లో ఆర్మీకి పెద్ద సవాలుగా మారనుందని భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు. గతేడాది చెన్నై వైఫల్యాలకు బ్యాటింగే ప్రధాన కారణమని ఈ సందర్భంగా చోప్రా గుర్తు చేశాడు.
ఆ ముగ్గురు ఆడితేనే సీఎస్‌కే నిలబడుతుంది
ఇటీవలి కాలంలో ధోని, రైనా, రాయుడు అంతర్జాతీయ క్రికెట్‌లోనే కాక ఏ ఇతర ఫార్మట్‌లోనూ ఆడలేదు. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గాయం కారణంగా కొంతకాలంగా ఆటకు దూరంగా ఉన్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో సీఎస్‌కే బ్యాటింగ్ పరంగా కొంచెం బలహీనంగా ఉందనే చెప్పాలి. ఇదిలా ఉండగా, దేశవాళీ క్రికెట్‌లో రాబిన్ ఉతప్ప, రుతురాజ్ గైక్వాడ్‌లు మంచి ఫామ్‌లో ఉండటం సీఎస్‌కేకు ఊరట కలిగించే అంశం. దక్షిణాఫ్రికా వెటరన్ ఆటగాడు డుప్లెసిస్ ఫామ్ సీఎస్‌కేకు అదనపు బలం కానుంది. ఏదిఏమైనప్పటికీ, ధోని, రైనా, రాయుడుల బ్యాటింగ్ ఫామ్ చెన్నై జట్టుని కలవరపెడుతోందని ఆకాశ్ పేర్కొన్నాడు.
కాగా, చైన్నై జట్టు ముంబైలో మొత్తం 5 మ్యాచ్‌లు ఆడనుంది. ధోని నేతృత్వంలోని చెన్నై జట్టు ఏప్రిల్ 10న ముంబైలోని వాంఖడే స్టేడియంలో తమ మొదటి పోరులో ఢిల్లీతో తలపడనుంది. ఈ జట్టు ముంబైలో మొత్తం 5 మ్యాచ్‌లను ఆడనుంది. ఇతర వేదికలైన ఢిల్లీలో 4, బెంగళూరులో 3, కోల్‌కతాలో 2 మ్యాచ్‌లు ఆడనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం పేసర్లకే అనుకూలించే అవకాశం ఉండటంతో స్పిన్నర్లు ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment