ధోని ధమాకా... | MS Dhoni blistering ton inspires Jharkhand win in Vijay Hazare Trophy | Sakshi
Sakshi News home page

ధోని ధమాకా...

Published Mon, Feb 27 2017 1:00 AM | Last Updated on Tue, Sep 5 2017 4:41 AM

ధోని ధమాకా...

ధోని ధమాకా...

సెంచరీతో జార్ఖండ్‌ను గెలిపించిన కెప్టెన్‌  
 విజయ్‌ హజారే ట్రోఫీ   


కోల్‌కతా: జార్ఖండ్‌ డైనమైట్‌ మహేంద్ర సింగ్‌ ధోని దేశవాళీ క్రికెట్‌లో మరో మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. జాతీయ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీలో దుమ్ము రేపి తన జట్టుకు తొలి విజయాన్ని అందించాడు. ధోని (107 బంతుల్లో 129; 10 ఫోర్లు, 6 సిక్సర్లు) అద్భుత సెంచరీతో ఆదివారం ఇక్కడ జరిగిన గ్రూప్‌ ‘డి’ మ్యాచ్‌లో జార్ఖండ్‌ 78 పరుగుల తేడాతో ఛత్తీస్‌గఢ్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన జార్ఖండ్‌ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. ధోని, షాబాజ్‌ నదీమ్‌ (90 బంతుల్లో 53; 4 ఫోర్లు, 1 సిక్స్‌) ఏడో వికెట్‌కు 151 పరుగులు జోడించారు. అనంతరం ఛత్తీస్‌గఢ్‌ 38.4 ఓవర్లలో 165 పరుగులకే ఆలౌటైంది.

పరుగుల మోత...
కర్ణాటకతో జరిగిన తొలి మ్యాచ్‌లో కూడా రాణించిన ధోని ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో తనదైన శైలిలో దూకుడుగా ఆడాడు. ఛత్తీస్‌గఢ్‌ బౌలర్ల ధాటికి ఒక దశలో జార్ఖండ్‌ స్కోరు 57/6 వద్ద నిలిచింది. ఈ సమయంలో నదీమ్‌తో కలిసి ధోని జట్టును ఆదుకున్నాడు. ఈ క్రమంలో 71 బంతుల్లో అతని అర్ధ సెంచరీ పూర్తయింది. ఆ తర్వాత మహి మరింత ధాటిని ప్రదర్శించాడు. ఆఫ్‌ స్పిన్నర్‌ సాహిల్‌ గుప్తా వేసిన ఓవర్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో ధోని 23 పరుగులు రాబట్టడం విశేషం. 95 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షార్ట్‌ ఎక్స్‌ట్రా కవర్‌లో కైఫ్‌ క్యాచ్‌ వదిలేయడంతో బతికిపోయిన కెప్టెన్‌ ఆ వెంటనే లిస్ట్‌ ‘ఎ’ క్రికెట్‌లో 17వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దేశవాళీ వన్డేల్లో 2004లో బీహార్‌ తరఫున శతకం సాధించిన ధోని జార్ఖండ్‌ తరఫున సెంచరీ చేయడం ఇదే తొలిసారి. ఆ తర్వాత లక్ష్య ఛేదనలో జార్ఖండ్‌ బౌలర్లు ఆరోన్‌ (3/26), నదీమ్‌ (3/36) బౌలింగ్‌ ముందు నిలవలేక ఛత్తీస్‌గఢ్‌ కుప్పకూలింది.

గెలిపించిన విహారి...
చెన్నై: మధ్యప్రదేశ్‌తో ఇక్కడ జరిగిన గ్రూప్‌ ‘సి’ మ్యాచ్‌లో ఆంధ్ర 2 వికెట్ల తేడాతో గెలిచింది. ఆంధ్ర బౌలర్లు శివకుమార్‌ (3/17), అయ్యప్ప (3/33) ధాటికి మధ్యప్రదేశ్‌ 40.2 ఓవర్లలో 127 పరుగులకే కుప్పకూలింది. సారాంశ్‌ జైన్‌ (56) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం కెప్టెన్‌ హనుమ విహారి (112 బంతుల్లో 58 నాటౌట్‌; 5 ఫోర్లు) పట్టుదలగా ఆడి ఆంధ్రను గెలిపించాడు. ఆంధ్ర 37.5 ఓవర్లలో 8 వికెట్లకు 131 పరుగులు సాధించింది.

అక్షత్‌ సూపర్‌ శతకం...
కోల్‌కతా: అక్షత్‌ రెడ్డి (154; 14 ఫోర్లు, 2 సిక్స్‌లు) అద్భుత సెంచరీకి తోడు కొల్లా సుమంత్‌ (91; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా చెలరేగడంతో హైదరాబాద్‌ 113 పరుగుల తేడాతో సౌరాష్ట్రను చిత్తుగా ఓడించింది. ముందుగా హైదరాబాద్‌ 50 ఓవర్లలో 7 వికెట్లకు 312 పరుగులు చేసింది. అనంతరం సౌరాష్ట్ర 38.5 ఓవర్లలో 199 పరుగులకే ఆలౌటైంది. ప్రేరక్‌ మన్కడ్‌ (104) సెంచరీ చేసినా లాభం లేకపోయింది. సీవీ మిలింద్‌ (4/30) చక్కటి బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టడి చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement