ధోనీ ఆగ్రహం.. ఓటమిపై వివరణ | MS Dhoni lashes out at bowlers for defeat | Sakshi
Sakshi News home page

ధోనీ ఆగ్రహం.. ఓటమిపై వివరణ

Published Sat, May 12 2018 9:26 AM | Last Updated on Sat, May 12 2018 11:07 AM

MS Dhoni lashes out at bowlers for defeat - Sakshi

జైపూర్‌: తప్పంతా బౌలర్లదేనని మండిపడ్డాడు కెప్టెన్‌ కూల్‌ ఎంఎస్‌ ధోనీ. బౌలింగ్‌కు సంబంధించి పక్కాగా వ్యూహాలు రచించినా, అమలు చేయడంలో బౌలర్లు విఫలమయ్యారని, అందుకే ఓడిపోవాల్సి వచ్చిందని అన్నాడు. ఐపీఎల్‌ 2018లో భాగంగా శుక్రవారం రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. కాగా, టాస్‌ గెలిస్తే ఫీల్డింగ్‌ తీసుకోవాలన్న కెప్టెన్‌ అభీష్టానికి వ్యతిరేకంగా చెన్నై యాజమాన్యం బ్యాంటింగ్‌కు మెగ్గుచూపడంపైనా పలురకాల కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఒకటి చెబితే.. ఇంకోటి చేశారు: ‘‘ఖచ్చితంగా బౌలర్ల వల్లే ఓడిపోయాం. పర్టికులర్‌ లెన్త్‌లో బౌలింగ్‌ చేస్తే ఫలితం దక్కేది. కానీ అలా జరగలేదు. ఫలానా ఏరియాలోనే బంతులు విసరాలని చెబితే మా వాళ్లు ఇంకోటి చేశారు. వ్యూహాన్ని అమలు చేయడంలో దారుణంగా విఫలమయ్యాం. నిజానికి ఇది(176) డిఫెండబుల్‌ స్కోరే. విజయాన్ని మా నుంచి దూరం చేసింది బౌలర్లే’’ అని ధోనీ అన్నాడు.

చివర్లో ధోనీ తీవ్ర అసహనం: మిస్టర్‌ కూల్‌గా పేరున్న కెప్టెన్‌ ధోని... రాజస్తాన్‌ ఇన్నింగ్స్‌ చివర్లో ఆగ్రహానికి గురయ్యాడు. 19వ ఓవర్లో విల్లీ 2 సిక్స్‌లు ఇవ్వడంతో అసహనం వ్యక్తం చేశాడు. 20వ ఓవర్లో బట్లర్‌ షాట్‌ కొట్టగా బంతి చాలాసేపు గాల్లో నిలిచింది. అయినా ఫీల్డర్లెవరూ అందుకోవడానికి రాకపోవడంతో ధోని ‘ఏంటిది?’ అన్నట్లు చూశాడు. రాయల్స్‌ గెలుపు పరుగును నియంత్రించడంలోనూ ఫీల్డర్లు స్పందించిన తీరు అతడికి ఆగ్రహం తెప్పించింది. (లాస్ట్‌ ఓవర్‌ వీడియోను కింద చూడొచ్చు) అంతకు ముందు బట్లర్‌ ఇచ్చిన మూడు క్యాచ్‌లనూ బౌలర్లు నేలపాలు చేశారు. అయితే మ్యాచ్‌ అనంతరం మాత్రం ధోనీ ఫీల్డింగ్‌ వైఫల్యాలపై పెద్దగా మాట్లాడలేదు.

బ్యాటింగ్‌కు దిగి తప్పు చేశారా: టాస్‌ గెలిచిన తర్వాత కామెంటేటర్‌తో ధోనీ మాట్లాడుతూ.. ‘‘మాకొక ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఉంది. ఆ కమిటీ నిర్ణయం మేరకు, కోచ్‌ సూచనల ప్రకారం తొలుత బ్యాటింగ్‌ చేస్తాం’’ అని చెప్పాడు. కాగా, టాస్‌ నెగ్గితే ఫీల్డింగ్‌ ఎంచుకుందామని ధోనీ వాదించినట్లు, సీఎస్‌కే ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ధోనీ వాదనతో విబేధించినట్లు కొన్ని వార్తలు వచ్చాయి. టాస్‌ సమయంలో ధోనీ వ్యాఖ్యలను బట్టి వాగ్వాదం నిజమై ఉంటుందని, తొలుత బ్యాటింగ్‌ దిగడం తప్పేనని సీఎస్‌కే అభిమానులు కామెంట్స్‌ చేస్తున్నారు.

మ్యాచ్‌ రిపోర్ట్‌: వరుసగా రెండో గెలుపుతో రాజస్తాన్‌ రాయల్స్‌... ఐపీఎల్‌ ఫ్లే ఆఫ్‌ రేసును రసవత్తరంగా మార్చింది. పటిష్ఠమైన చెన్నై సూపర్‌ కింగ్స్‌తో సొంతగడ్డపై శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో  ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ జాస్‌ బట్లర్‌ (60 బంతుల్లో 95 నాటౌట్‌; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ ఇన్నింగ్స్‌తో ఆ జట్టు నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అంతకుముందు టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్న చెన్నై సురేశ్‌ రైనా (35 బంతుల్లో 52; 6 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ శతకానికి తోడు ఓపెనర్‌ వాట్సన్‌ (31 బంతుల్లో 39; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్‌ ధోని (23 బంతుల్లో 33 నాటౌట్‌; 1 ఫోర్, 1 సిక్స్‌) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement