దాదా, ధోనీల గురించి యువీ కామెంట్
న్యూఢిల్లీ: భారత్ క్రికెట్లో డాషింగ్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ది కీలక పాత్ర. సౌరవ్ గంగూలీ, మహేంద్ర సింగ్ ధోనీల సారథ్యంలో టీమిండియాకు యువీ ప్రాతినిధ్యం వహించాడు. యువీకి దాదా మెంటర్ అయితే, ధోనీ స్నేహితుడి కంటే ఎక్కువ. దాదా, ధోనీలకు సంబంధించి ఓ ప్రశ్నకు యువీ ఆసక్తికర సమాధానం చెప్పాడు.
ఇటీవల ఓ రేడియో మిర్చి షోలో పాల్గొన్న యువీని.. ధోనీ, దాదాలలో ఎవరు బెస్ట్ కెప్టెన్ అని అడిగారు. ఈ ప్రశ్నకు యువీ సమాధానమిస్తూ.. 'గంగూలీ సారథ్యంలో నా కెరీర్ను ప్రారంభించా. దాదా జట్టును ఒక్కతాటిపై నిలిపాడు. నాతో సహా నెహ్రా, సెహ్వాగ్, జహీర్, హర్భజన్ వంటి ఆటగాళ్లను ప్రోత్సహించాడు. కాబట్టి బహుశా దాదానే బెస్ట్ కెప్టెన్' అని చెప్పాడు. యువీనే కాదు హర్భజన్, సెహ్వాగ్ కూడా పలుమార్లు ఇదే సమాధానం చెప్పారు.
ధోనీతో యువీకి విబేధాలున్నట్టు ఆ మధ్య వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. యువీ తండ్రి యోగరాజ్ ఈ విషయాన్ని బహిరంగంగా ప్రస్తావించాడు. 2011 వన్డే ప్రపంచ కప్లో టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించిన యువీకి ఆ తర్వాత అవకాశాలు రాకపోవడానికి ధోనీయే కారణమని యోగరాజ్ నిందించాడు. కాగా యువీ ఈ ఆరోపణలను ఖండించాడు. ధోనీతో తనకు ఎలాంటి విబేధాలూ లేవని చెప్పాడు. మైదానంలోనూ, వెలుపలా మహీతో స్నేహంగానే ఉన్నాడు.