కూతురు జీవాతో ధోని (ఫైల్ ఫొటో)
ముంబై : తండ్రి అయినప్పటి నుంచి క్రికెటర్‌గా తనలో మార్పు వచ్చిందో.. లేదో కానీ.. వ్యక్తిగా మాత్రం ఎంతో మారానని టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తెలిపాడు. ఈ మార్పుకు తన కూతురు, గారలపట్టీ జీవానే కారణమని అభిప్రాయపడ్డాడు. వ్యక్తిగత జీవితం గురించి ఎప్పుడూ నోరు విప్పని ధోని.. స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన ఓ షోలో తన కూతురితో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నాడు.
‘కూతుర్లందరూ వారి తండ్రులను ఇష్టపడుతారు.. కానీ నా విషయంలో అలా జరగలేదు. జీవా పుట్టినప్పుడు నేను అక్కడలేను. ఎక్కువ సమయం క్రికెట్‌లోనే గడచిపోయేది. ఈ మధ్యలో నా పేరు చెప్పి ఇంట్లోవాళ్లు తనకు భయం చెప్పేవారు. జీవా అన్నం తినకపోతే నాన్న వస్తున్నాడు అని చెప్పి బెదిరించే వారు. ఏదైనా అల్లరి పనులు చేస్తున్నా ఇలాగే చేసేవారు. దీంతో నాన్న అనగానే ఏదో తెలియని భయాన్ని ఆమెలో కల్పించారు. నేను దగ్గరకు తీసుకోవాలని చూస్తే భయపడుతూ దూరంగా ఉండేదని’ ధోని చెప్పుకొచ్చాడు.
ఆ దూరాన్ని ఈ ఐపీఎల్..
ఈ సీజన్ ఐపీఎల్‌తో జీవాతో ఆ దూరం తగ్గిందని ధోని సంతోషం వ్యక్తం చేశాడు. ‘ఈ సీజన్‌లో నా కూతురితో గడిపే సమయం ఎక్కువగా దొరికింది.నా వెంట ఉన్నప్పుడు ఎప్పుడూ గ్రౌండ్‌కు వెళ్లాలని మాత్రమే అడిగేది. అక్కడ జట్టు సహచరుల పిల్లలతో ఎంతో సరదాగా ఆడుకునేది. నేను 1.30, 2.30, 3 గంటలకు లేచేవాడిని. జీవా మాత్రం 9 గంటల్లోపే లేచి బ్రేక్‌ఫాస్ట్ చేసుకుని, పిల్లలతో ఆడుకునేది. అది చూసినప్పుడు నాకు ఎంతో ఉల్లాసంగా ఉండేది.’ అని ధోని మురిసిపోయాడు.
క్రికెట్‌ను జీవా ఎంతగా ఇష్టపడుతుందో తెలియదు కానీ, ఏదో ఒకరోజు ఆమెను మ్యాచ్ ప్రజెంటేషన్‌కు తీసుకువస్తానన్నాడు. అప్పుడు అన్నింటికీ ఆమే సమాధానమిస్తుందని ధోని చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ సమయంలో తాను జిమ్‌లో కన్న తన రూమ్‌లో ఉన్న రోలర్ మీదనే కసరత్తులు చేసేవాడినన్నాడు. ఈ సీజన్‌లో ధోని సారథ్యం వహించిన చెన్నై సూపర్ కింగ్స్ చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ టూర్‌కు సమయం ఉండటంతో ఈ ఖాళీ సమయాన్ని ధోని తన కూతురితో ఆస్వాదిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment