న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని క్రికెట్ కెరీర్ ఇంకా ఎంత కాలం కొనసాగుతుందనే ప్రశ్నలు ఒకవైపు వస్తుంటే, మరొకవైపు చీఫ్ సెలక్టర్ ఎంఎస్‌కే ప్రసాద్ మాత్రం ఇప్పటికీ ధోనినే బెస్ట్ అంటున్నాడు. భారత్ క్రికెట్‌లో ఎంఎస్ ధోనినే అత్యుత్తమ కీపర్, బెస్ట్ ఫినిషర్ అంటూ కొనియాడాడు. భారత క్రికెట్‌లో మిగతా వారికి వికెట్ కీపర్లగా పరీక్షిస్తున్నా ధోని జట్టులో ఉంటే ఆ బలమే వేరన్నాడు. దాంతోనే వరల్డ్‌కప్‌లో ధోనికి చోటు దక్కిందన్నాడు. ఒక బ్యాట్స్‌మన్‌గా, కీపర్‌గా ధోనిలో సత్తా ఇంకా తగ్గలేదని పేర్కొన్నాడు.
‘ ధోని విషయంలో నాకు ఒక స్పష్టత ఉంది. అతనొక అత్యుత్తమ కీపరే కాదు.. బెస్ట్ ఫినిషర్ కూడా. ప్రత్యేకించి పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ధోని ఇప్పటికే ఉత్తమమే. మరొకవైపు కెప్టెన్ నిర్ణయాలు తీసుకునే క్రమంలో ధోని అనుభవం వెలకట్టలేనిది. వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్‌లో ధోని-జడేజాల ఇన్నింగ్స్ నిజంగా అద్భుతం. టాపార్డర్ కుప్పకూలిన సమయంలో వారిద్దరూ ఆకట్టుకున్నారు. జడేజాకు దిశా నిర్దేశం చేస్తూ ధోని ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. కాకపోతే దురదృష్టం కొద్ది పోరాడి ఓడిపోయాం’ అని ఎంఎస్‌కే చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment