
సీఎస్‌కే కోసం నా నిరీక్షణ ముగిసింది: ధోని
చెన్నై: ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్‌ది సుస్థిర ప్రస్థానం. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో రెండేళ్లపాటు జట్టు నిషేధానికి గురైంది. తాజాగా నిషేధం ముగియడంతో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ఇటీవల అధికారిక ట్విట్టర్ ద్వారా అభిమానులతో ఈ శుభవార్తను షేర్ చేసుకుంది. ఇటీవల సీఎస్‌కే జట్టు ఆటగాడిగా 7వ నెంబర్ జెర్సీపై తలా' అని రాసిన టీషర్ట్‌ను ధరించిన ఫొటోలకు సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన వచ్చింది. బాస్ ఈజ్ బ్యాక్! అంటూ ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు.
అయితే చెన్నై ఫ్యాన్స్ చూపిన అభిమానానికి ధోని ఫిదా అయ్యాడు. తన పట్ల చూపించిన అభిమానానికి ధన్యవాదాలు తెలిపాడు. ఇటీవల ప్రారంభమైన తమిళనాడు ప్రీమియర్ లీగ్ ప్రారంభ కార్యక్రమంలో కూడ ధోని చెన్నై సూపర్ కింగ్స్‌ను గుర్తు చేస్తూ ఎల్లో కలర్ టీషర్ట్ ధరించాడు. ఈ సందర్భంగా ధోని మాట్లాడుతూ 'ఇది చాలా మంచి సందర్భం. అభిమానుల ఉత్సాహం అద్భుతంగా ఉంది. వారు నామీద లెక్కలేనంత ప్రేమ, అభిమానం చూపించారు. చెన్నై నా రెండో ఇళ్లని ఇది వరకే చాలా సార్లు చెప్పాను. ఎల్లో జెర్సీలో మరింత రాణిస్తాం. చెన్నై సూపర్ కింగ్స్ కోసం మా సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. వచ్చే ఏడాది మేం ఇక్కడ ఆడుతుంటే మీరంతా సంతోషంగా చూస్తారు.' అంటూ తెలిపాడు.
అంతేకాకుండా అభిమానుల గురించి మాట్లాడుతూ "మేము ఇక్కడ రెండు ఏళ్లు చెన్నై తరపున ఆడలేదు, కానీ మా అభిమానుల సంఖ్య మాత్రం గత రెండు సంవత్సరాలలో పెరిగింది. అభిమానులు వారు మాతోనే ఉన్నారు. వారి ప్రేమ అభిమానం ఎల్లప్పుడూ మాతోనే ఉంది, సీఎస్‌కే తిరిగి ఇక్కడ మొదటి ఆటను ఆడటానికి వచ్చినప్పుడు ఆ అభిమానం మరింత పెరుగుతుందని' ఎంఎస్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ధోనిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవడానికి సిద్ధంగా లేమని చెన్నై ఫ్రాంచైజీ ఇదివరకే ప్రకటించింన విషయం తెలిసిందే.