మా జట్టుకు వారు మూలస్తంభాలు: కోహ్లి
న్యూఢిల్లీ: చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగనున్న భారత క్రికెట్ జట్టుకు టైటిల్ ను నిలబెట్టుకునే సత్తా ఉందని కెప్టెన్ విరాట్ కోహ్లి విశ్వాసం వ్యక్తం చేశాడు. బుధవారం ఇంగ్లండ్ పర్యటనకు పయనమయ్యే క్రమంలో మీడియాతో మాట్లాడిన కోహ్లి.. మహేంద్ర సింగ్ ధోని, యువరాజ్ సింగ్ల ఎంపికను సమర్ధించాడు. ప్రస్తుత సీనియర్ ఆటగాళ్లుగా ఉన్న వారిద్దరి సేవలు భారత జట్టుకు కచ్చితంగా ఉపయోగపడతాయనే ధీమా వ్యక్తం చేశాడు. భారత జట్టు కష్ట సమయంలో ధోని-యువరాజ్ల అనుభవం తమకు లాభిస్తుందన్నాడు.
'మా జట్టులో వారిద్దరూ మూలస్తంభాలు. వారికి కావాల్సినంత అనుభవం ఉంది. మిడిల్ ఆర్డర్ లో వారి సహజసిద్ధమైన గేమ్ ను ఆడటానికి స్వేచ్ఛనిస్తే మ్యాచ్ పై పట్టు సాధించడానిక ఆస్కారం దొరుకుతుంది. మ్యాచ్ ను ఎలా ముందుకు తీసుకెళ్లాలో వారికి బాగా తెలుసు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇంగ్లండ్ తో జరిగిన గత సిరీస్ లో వీరు ఎంత స్వేచ్ఛగా ఆడారో చూశాం. వారిద్దరూ ఎంతో ఎంజాయ్ చేస్తూ బ్యాటింగ్ చేశారు. చాంపియన్స్ ట్రోఫీలో వారు మాకు ఎంతో కీలకం 'అని కోహ్లి తెలిపాడు.