కొనసాగుతున్న ధోని 'లవ్ ఎఫైర్'
ముంబై: వాంఖెడే మైదానంతో ఎంఎస్ ధోని లవ్ ఎఫైర్ కొనసాగుతోంది. ఈ స్టేడియంలో 'మిస్టర్ కూల్' ఎన్నో మెమరబుల్ ఇన్నింగ్స్ ఆడాడు. 2011 వన్డే ప్రపంచకప్‌లో ఇదే వేదికపై శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో నువాన్ కులశేఖర బౌలింగ్‌లో అద్భుతమైన సిక్సర్ కొట్టి చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మరోసారి టీమిండియా వరల్డ్‌కప్‌ను కైవసం చేసుకోవడంతో కీలకపాత్ర పోషించాడు. అప్పటివరకు 8 మ్యాచుల్లో 150 పరుగులు మాత్రమే చేసిన ధోని ఫైనల్లో 91 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు.
తాజాగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడి వాంఖేడ్‌తో తన అనుబంధాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. పుణే సూపర్ జెయింట్- ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మంగళవారం జరిగిన మొదటి ప్లేఆఫ్ మ్యాచ్‌లో సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ధోని బ్యాటింగ్‌కు వచ్చేటప్పటికీ పుణె స్కోరు 89/3గా ఉంది. ధోని ధనాధన్ బ్యాటింగ్‌తో స్కోరుకు పరుగులు పెట్టించాడు. 26 బంతుల్లో 5 సిక్సర్లతో 40 పరుగులతో అజేయంగా నిలిచాడు. మెక్లీనగన్ వేసిన 19వ ఓవర్‌లో ధోని 2 భారీ సిక్సర్లు బాదాడు. 20 పరుగులతో ముంబైను చిత్తు చేయడంతో ఐపీఎల్–10 ఫైనల్లోకి దూసుకెళ్లింది. తుదిపోరులోనూ ధోని చెలరేగాలని అభిమానులు కోరుకుంటున్నారు.