ఫైనల్లో ముంబై గరుడ
► సెమీస్‌లో బెంగళూరుపై విజయం ప్రొ రెజ్లింగ్ లీగ్
న్యూఢిల్లీ: ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యుఎల్)లో ముంబై గరుడ అప్రతిహతంగా దూసుకెళుతోంది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో బెంగళూరు యోధాస్‌ను 5-2తో ఓడించిన ముంబై ఫైనల్లోకి ప్రవేశించింది. ఇప్పటిదాకా ముంబై ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఒక్క ఓటమి కూడా లేకపోవడం విశేషం. పురుషుల 97కేజీ విభాగంలో జరిగిన తొలి బౌట్‌లో ఒడికడ్జ్ ఎలిజబెర్ 7-2తో పావ్లో ఒలియనిక్‌ను ఓడించి ముంబైకి తొలి విజయాన్ని అందించాడు.
ఆ తర్వాత మహిళల 48కేజీలో రితూ ఫోగట్ అనూహ్యంగా పోరాడింది. 2013 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించిన అలీసా లాంప్ (బెంగళూరు)పై తొలి రౌండ్‌లో 0-4తో వెనుకబడింది. ఈ దశలో కోచ్ వ్యూహం ప్రకారం ముందుకెళ్లిన రితూ ప్రత్యర్థిని అలసిపోయేలా చేసింది. ఆ తర్వాత పుంజుకుని 8-4తో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది. బౌట్ పూర్తయ్యేసరికి 10-4 తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది.
పురుషుల 125కేజీలో గియోర్గి సకన్‌డెలిడ్జ్ 7-4తో డావిట్‌ను ఓడించి గరుడ ఆధిక్యాన్ని 3-0కు పెంచాడు. మహిళల 53కేజీలో ఒడునాయో అడెకురోయ్ 10-0తో లలితా షెరావత్‌ను చిత్తుగా ఓడించడంతో ముంబై ఫైనల్‌కు చేరడం ఖాయమైంది. చివరి మూడు బౌట్లలో బెంగళూరు ఐకాన్ రెజ్లర్ నర్సింగ్ యాదవ్ (74కేజీ) 7-0తో ప్రదీప్‌పై ఓదార్పు విజయాన్ని సాధించాడు. ముంబై ఐకాన్ రెజ్లర్ అడెలిన్ గ్రే కేవలం 45 సెకన్లలోనే 6-0తో నవజ్యోత్ కౌర్‌ను చిత్తు చేయగా చివరి బౌట్‌లో బజరంగ్ పూనియా 10-4తో అమిత్ ధన్‌కర్‌ను ఓడించి బెంగళూరుకు రెండో విజయాన్ని అందించింది. నేడు జరిగే రెండో సెమీస్‌లో పంజాబ్, హరియాణా తలపడతాయి. ఈ మ్యాచ్ విజేత ఫైనల్లో ముంబై గరుడతో ఆడుతుంది.