పుణె: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు మరో గెలుపు రుచి చూసింది. వరుస ఓటములతో సతమతమైన ముంబై.. శనివారం చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చెన్నై విసిరిన 170 పరుగుల లక్ష్యాన్ని ముంబై రెండు వికెట్లు కోల్పోయి 19.4 ఓవర్లలో ఛేదించింది. ఫలితంగా ఈ సీజన్‌లో రెండో విజయాన్ని ముంబై ఖాతాలో వేసుకుంది. అదే సమయంలో తొలి మ్యాచ్‌లో చెన్నైపై ఎదురైన ఓటమికి రోహిత్ అండ్ గ్యాంగ్ ప్రతీకారం తీర్చుకుంది.
ముంబై ఆటగాళ్లలో రోహిత్ శర్మ(56 నాటౌట్; 33 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్(44;34 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), ఎవిన్ లూయిస్(47;43 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
అంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై ఆదిలోనే షేన్ వాట్సన్(12) వికెట్‌ను కోల్పోయింది. ఆ తరుణంలో అంబటి రాయుడు-సురేశ్ రైనాల జోడి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించింది. ఈ జోడి 71 పరుగుల జత చేసిన తర్వాత రాయుడు రెండో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఆ సమయంలో రైనాకు ధోని జత కలిశాడు. ఒకవైపు రైనా దూకుడుగా ఆడితే, ధోని ఆచితూచి ఆటను కొనసాగించాడు. ఈ క్రమంలోనే రైనా హాఫ్ సెంచరీ చేసిన కాసేపటికి ధోని(26) పెవిలియన్ చేరాడు. ప్రధానంగా మెక్లీన్‌గన్ వేసిన 18 ఓవర్‌లో ధోని, డ్వేన్ బ్రేవోలు ఔట్ కావడంతో చెన్నై స్కోరు మందగించింది. చివరి ఓవర్లలో పరుగులు రావడం కష్టంగా మారడంతో భారీ స్కోరును ముంబై ముందు ఉంచలేకపోయింది. ముంబై బౌలర్లలో మెక్లీన్‌గన్, కృనాల్ పాండ్యాలు చెరో రెండో వికెట్లు సాధించగా, హార్దిక్ పాండ్యాకు వికెట్ దక్కింది.,
Comments
Please login to add a commentAdd a comment