ముంబై ధూంధాం... | Mumbai Indians crush Chennai Super Kings to capture IPL 2015 title | Sakshi
Sakshi News home page

ముంబై ధూంధాం...

Published Mon, May 25 2015 1:09 AM | Last Updated on Sun, Sep 3 2017 2:37 AM

Mumbai Indians crush Chennai Super Kings to capture IPL 2015 title

ఐపీఎల్ చాంపియన్ ముంబై ఇండియన్స్
 
ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్‌పై ఘన విజయం   
చెలరేగిన రోహిత్, సిమ్మన్స్, పొలార్డ్

 

 అదే వేదిక... అవే జట్లు... అదే కెప్టెన్లు... అదే ఫలితం... కేవలం సంవత్సరం మారిందంతే..! 2013 ఐపీఎల్ ఫైనల్ ఫలితం మరోసారి పునరావృతమైంది. ఈడెన్ గార్డెన్స్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను చిత్తు చేసి ముంబై ఇండియన్స్ 2015 ఐపీఎల్ విజేతగా నిలిచింది. పటిష్టమైన చెన్నైని చెడుగుడు ఆడేస్తూ సిమ్మన్స్, రోహిత్, పొలార్డ్ పరుగుల జడివాన కురిపించారు. అటు ముంబై బౌలర్లూ మెరిశారు. ఫలితం... రోహిత్ సేన సగర్వంగా రెండోసారి ఐపీఎల్ టైటిల్ సొంతం చేసుకుంది.
 
 కోల్‌కతా : బ్యాటింగ్‌కు అనుకూలించే ఫ్లాట్ వికెట్... ఒత్తిడి ఉండే ఫైనల్ మ్యాచ్... సాధారణంగా ఏ కెప్టెన్ అయినా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంటాడు. కానీ వ్యూహాల్లో దిట్టగా భావించే ధోని మాత్రం అనూహ్యంగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ తప్పిదం చెన్నైని వెంటాడింది. వరుస విజయాలతో జోరు మీద ఉన్న ముంబై బ్యాట్స్‌మెన్ ధాటికి చెన్నై కకావికలమైంది. బ్యాటింగ్‌లో సిమ్మన్స్ (45 బంతుల్లో 68; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), రోహిత్ (26 బంతుల్లో 50; 6 ఫోర్లు, 2 సిక్సర్లు)ల వీరోచిత ఇన్నింగ్స్‌తో ఆదివారం జరిగిన ఫైనల్లో ముంబై 41 పరుగుల తేడాతో ధోనిసేనపై విజయం సాధించి రెండోసారి విజేతగా నిలిచింది.

ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో... ముందుగా ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లకు 202 పరుగులు చేసింది. పొలార్డ్ (18 బంతుల్లో 36; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), రాయుడు (24 బంతుల్లో 36 నాటౌట్; 3 సిక్సర్లు) దుమ్మురేపారు. తర్వాత చెన్నై 20 ఓవర్లలో 8 వికెట్లకు 161 పరుగులకు మాత్రమే పరిమితమైంది. స్మిత్ (48 బంతుల్లో 57; 9 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. రైనా (19 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్), మోహిత్ (7 బంతుల్లో 21 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు), ధోని (13 బం తుల్లో 18; 1 ఫోర్, 1 సిక్స్) మోస్తరుగా ఆడారు.

 కీలక భాగస్వామ్యం
 టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇన్నింగ్స్ ఐదో బంతికే పార్థీవ్ (0) వికెట్‌ను కోల్పోయింది. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన రోహిత్.. అచ్చొచ్చిన మైదానంలో విశ్వరూపం చూపాడు. సిమ్మన్స్‌తో కలిసి బౌండరీలు, సిక్సర్లతో రెచ్చిపోవడంతో ముంబై స్కోరు బోర్డు కదం తొక్కింది. వాయువేగంతో బ్యాటింగ్ చేసిన సిమ్మన్స్ 35 బంతుల్లో; రోహిత్ 25 బంతుల్లో అర్ధసెంచరీలు పూర్తి చేశారు. ఓవర్‌కు పదికిపైగా రన్‌రేట్‌తో పరుగులు సాధించడంతో రెండో వికెట్‌కు 67 బంతుల్లోనే 119 పరుగులు సమకూరాయి.

అయితే రెండు బంతుల తేడాలో ఈ ఇద్దరూ పెవిలియన్‌కు చేరడంతో ముంబై స్కోరు 120/3గా మారింది. తర్వాత పొలార్డ్, రాయుడు కూడా చెన్నై బౌలర్లను ఆడుకున్నారు. నెహ్రా వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో 23 పరుగులు రాబట్టిన పొలార్డ్... 19వ ఓవర్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి అవుటయ్యాడు. రాయుడుతో కలిసి నాలుగో వికెట్‌కు 40 బంతుల్లో 71 పరుగులు జోడించాడు. హార్థిక్ పాండ్యా (0) విఫలమైనా.. హర్భజన్ (6 నాటౌట్) సిక్సర్‌తో ముంబై స్కోరు 200 దాటింది.  

 స్మిత్ మినహా అంతా విఫలం
 భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై ఓపెనర్ హస్సీ (4) తొందరగా అవుటయ్యాడు. స్మిత్, రైనాలు నెమ్మదిగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను పునర్‌నిర్మించినా కావలసిన రన్‌రేట్ బాగా పెరిగింది. అప్పుడప్పుడూ ఫోర్లు బాదినా... తొలి 10 ఓవర్లలో చెన్నై వికెట్ నష్టానికి 67 పరుగులు మాత్రమే చేసింది. అయితే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న స్మిత్‌తో పాటు రైనాను వరుస ఓవర్లలో హర్భజన్ అవుట్ చేసి మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. ఈ ఇద్దరు రెండో వికెట్‌కు 66 పరుగులు జోడించారు. తర్వాత ముంబై పేసర్లు విజృంభించి వరుస ఓవర్లలో బ్రేవో (9), ధోని, డు ప్లెసిస్ (1), నేగి (3), అశ్విన్ (2)లను అవుట్ చేశారు. చివరి 10 ఓవర్లలో చెన్నై 94 పరుగులు చేసి ఏడు వికెట్లు చేజార్చుకుని ఓడింది. మెక్లీనగన్ 3 వికెట్లు తీశాడు. మలింగ, హర్భజన్‌లకు రెండేసి వికెట్లు లభించాయి.
 
 భారీ బృందగానం!
ముంబైని గెలిపించిన సమష్టితత్వం
కలిసొచ్చిన దిగ్గజాల మార్గదర్శనం

 
 టోర్నీ మొదటి ఆరు మ్యాచ్‌లలో ఐదు పరాజయాలు...ఇక ఐపీఎల్-8లో ఆ జట్టు కథ ముగిసినట్లేనని అనిపించింది. అయితే ముంబై ఇండియన్స్ మరోసారి ఫీనిక్స్ పక్షిలా లేచింది. గత ఏడాది యూఏఈ అంచెలో ఇదే తరహాలో వెనకబడి కోలుకున్న రోహిత్ సేన ఇప్పుడు మరింత వేగంగా దూసుకొచ్చింది. ఆటగాళ్లంతా ఒకరితో మరొకరు పోటీ పడి మైదానంలో రాణిస్తే... మహామహులు వెనకనుండి వెన్ను తట్టి నిలవగా ముంబై ఇండియన్స్ రెండో సారి చాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకుంది.

 రాత మార్చిన ఓపెనింగ్
 ఆసీస్ స్టార్ ఫించ్ గాయంతో వెనుదిరగడంతో ఓపెనర్‌గా విండీస్ ఆటగాడు సిమన్స్ రావడం ముంబైకి కలిసొచ్చింది. మరో ఓపెనర్ పార్థీవ్‌తో కలిసి సిమన్స్ టోర్నీ రెండో అర్ధ భాగంలో చెలరేగాడు. వీరిద్దరు దాదాపు ప్రతీ మ్యాచ్‌లో శుభారంభం అందించడంతో తర్వాత వచ్చే బ్యాట్స్‌మన్ నేరుగా ఎదురుదాడికి అవకాశం కలిగింది. గత ఏడాది కూడా ముంబై టాప్ స్కోరర్ అయిన సిమన్స్ ఈ సారి 6 అర్ధ సెంచరీలతో టోర్నీలో మొత్తం 540 పరుగులు చేశాడు. రెండు అర్ధ సెంచరీలు చేసిన పార్థీవ్ కీపర్‌గా కూడా సమర్థంగా రాణించాడు. మూడో స్థానంలో రోహిత్ 482 పరుగులు చేయడంతో ముంబై బ్యాటింగ్‌కు నిలకడ వచ్చిం ది. ఫైనల్లో చేసిన అర్ధ సెంచరీ అతని ప్రత్యేక ప్రదర్శనగా నిలిచిపోతుంది.

 పొలార్డ్ మెరుపులు
 గతంలో చాలా మ్యాచ్‌లలో తగినన్ని బం తులు అందుబాటులో లేక ఆశించిన ప్రదర్శన ఇవ్వని పొలార్డ్, ఈ సీజన్‌లో మాత్రం బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు వచ్చి జట్టు విజయాల్లో కీలక పాత్ర (419 పరుగులు) పోషించాడు. ముఖ్యంగా కోల్‌కతాతో కీలక ఇన్నింగ్స్‌తో ప్లే ఆఫ్‌కు చేర్చిన అతను, తొలి క్వాలిఫయర్‌లో, ఆ తర్వాత ఫైనల్లోనూ  చెలరేగిపోయాడు. ఇక కొత్త కుర్రాడు హార్దిక్ పాండ్యా అనూహ్య ప్రదర్శనతో ముంబై మిడిలార్డర్ ఒక్కసారిగా పటిష్టంగా మారిపోయింది. చెన్నైపై సిక్సర్లతో విరుచుకుపడ్డ అతను, కోల్‌కతాపై చక్కటి హాఫ్ సెంచరీ చేశాడు. ఆరంభ మ్యాచ్‌లలో రాణించని రాయుడు తర్వాత నిలదొక్కుకున్నాడు. ఫైనల్ మ్యాచ్‌లో అతని ప్రదర్శన ముంబై విజయంలో ప్రధాన పాత్ర పోషించింది.

 గన్ పేలింది...
 ఐపీఎల్ వేలంలో కోచ్ పాంటింగ్ పట్టుబట్టి మెక్లీన్‌గన్ (18వికె ట్లు)ను తీసుకున్నాడు. తొలి నాలుగు మ్యాచ్‌ల తర్వాత బరిలోకి దిగిన అతను అద్భుతంగా ప్రభావం చూపించాడు. ముఖ్యంగా ముంబై వికెట్‌పై చక్కటి బౌన్స్ రాబట్టిన అతను పేస్‌తో చెలరేగాడు. హైదరాబాద్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో తొలి ఓవర్లో వార్నర్‌ను అవుట్ చేసి ఆటను మలుపు తిప్పాడు. మలింగ (24) ఎప్పటిలాగే తన పదునైన యార్కర్లతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను పూర్తిగా కట్టి పడేశాడు. ఒకప్పటి హర్భజన్ ఈ టోర్నీలో మళ్లీ మెరిశాడు. 18 వికెట్లు తీసిన అతను తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాడు. కనీసం ఒక్క ఫస్ట్ క్లాస్ అనుభవం కూడా లేని లెఫ్టార్మ్ స్పిన్నర్ సుచిత్ (10 వికెట్లు) కూడా ప్రభావం చూపించడంతో ముంబై తుది జట్టులో మార్పుల అవసరం లేకపోయింది.

 ఫుల్ ‘సపోర్ట్’
 ’నేనిక్కడ ఉన్నది ఐపీఎల్ టైటిల్ అందించడానికే’ అని ఆత్మవిశ్వా సంతో ప్రకటించిన హెడ్ కోచ్ రికీ పాంటింగ్ దానిని చేసి చూపించాడు. దిగ్గజ ఆటగాడిగా, టాప్ టీమ్ కెప్టెన్‌గా అతనికి ఉన్న అనుభవం జట్టుకు బాగా ఉపయోగపడింది. ‘మీ కోసం కాదు జట్టు కోసం ఆడండి’ అంటూ అతను తమలో స్ఫూర్తి నింపాడంటూ ప్రతీ ఆటగాడు చెప్పుకొచ్చాడు. అదే విధంగా టీమ్ ఐకాన్‌గా సచిన్, చీఫ్ మెంటార్‌గా కుంబ్లే ఉన్నా...జట్టు ప్రయోజనాల కోసం అవసరమైతే సలహాలు ఇచ్చారు తప్పితే కోచ్ పాత్రను పరిమితం చేసి ఆధిక్యం ప్రదర్శించే పని చేయలేదు. దాంతో పాంటింగ్ మరింత స్వేచ్ఛగా వ్యవహరించాడు. అసిస్టెంట్ కోచ్ రాబిన్ సింగ్, బౌలింగ్ కోచ్ షేన్ బాండ్, ఫీల్డింగ్ కోచ్ జాంటీ రోడ్స్ అతనికి అండగా నిలిచారు. ఫలితమే ఐపీఎల్‌లో ముంబై జెండా మరోసారి ఎగిరింది.
 -సాక్షి క్రీడావిభాగం
 
 ఎవరికెంత డబ్బు...
 ముంబై ఇండియన్స్: రూ. 15 కోట్లు
 చెన్నై సూపర్‌కింగ్స్: రూ. 10 కోట్లు
 బెంగళూరు రాయల్‌చాలెంజర్స్: రూ. 5 కోట్లు
 రాజస్తాన్ రాయల్స్: రూ. 4 కోట్లు

 
  స్కోరు వివరాలు
 ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ : సిమ్మన్స్ (సి) ధోని (బి) స్మిత్ 68; పార్థీవ్ రనౌట్ 0; రోహిత్ (సి) జడేజా (బి) బ్రేవో 50; పొలార్డ్ (సి) రైనా (బి) మోహిత్ 36; రాయుడు నాటౌట్ 36; హార్ధిక్ పాండ్యా (సి) రైనా (బి) బ్రేవో 0; హర్భజన్ నాటౌట్ 6; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 202.
 వికెట్ల పతనం : 1-1; 2-120; 3-120; 4-191; 5-191.
 బౌలింగ్ : నెహ్రా 4-0-41-0; మోహిత్ 4-0-38-1; అశ్విన్ 2-0-21-0; జడేజా 2-0-26-0; నేగి 2-0-18-0; బ్రేవో 4-0-36-2; స్మిత్ 2-0-17-1.

 చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్ : స్మిత్ ఎల్బీడబ్ల్యు (బి) హర్భజన్ 57; హస్సీ (సి) సుచిత్ (బి) మెక్లీనగన్ 4; రైనా (స్టంప్) పార్థీవ్ (బి) హర్భజన్ 28; ధోని (బి) మలింగ 18; బ్రేవో (సి) సిమ్మన్స్ (బి) మెక్లీనగన్ 9; పవన్ నేగి (సి) హార్ధిక్ (బి) మలింగ 3; డు ప్లెసిస్ (సి) రోహిత్ (బి) వినయ్ 1; జడేజా నాటౌట్ 11; అశ్విన్ (సి) సుచిత్ (బి) మెక్లీనగన్ 2; మోహిత్ నాటౌట్ 21; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 161.
 వికెట్ల పతనం : 1-22; 2-88; 3-99; 4-108; 5-124; 6-125; 7-134; 8-137.
 బౌలింగ్ : మలింగ 4-0-25-2; మెక్లీనగన్ 4-0-25-3: వినయ్ 4-0-39-1; హార్ధిక్ 4-0-36-0; హర్భజన్ 4-0-34-2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement