IPL-8
-
సంబరాలు చేసుకుందాం రండి
ముంబై: రెండోసారి ఐపీఎల్ విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ టీమ్ సొంతగడ్డపై సంబరాలకు రెడీ అయింది. టైటిల్ గెలిచి జోష్ మీదున్న రోహిత్ సేన సోమవారం రాత్రి వాంఖేడ్ స్టేడియంలో సంబరాలు చేసుకోనుంది. వేడుకల్లో పాల్గొనాలని అభిమానులను కోరింది. రాత్రి 8 గంటలు సంబరాలు ప్రారంభమవుతాయి. ముంబై ఇండియన్స్ జట్టు సభ్యులు, టీమ్ మెంటార్ సచిన్ టెండూల్కర్, అతడి కుటుంబ సభ్యులు, సహ యాజమాని నీతా అంబానీ పాల్గొంటారు. కోల్ కతా నుంచి రోహిత్ సేన సోమవారం సాయంత్రానికి ముంబై చేరుకుంటుందని అధికార వర్గాలు వెల్లడించాయి. సంబరాలు వీక్షించేందుకు వచ్చే అభిమానులను ఉచితంగా వాంఖేడ్ స్టేడియంలోకి అనుమతిస్తారు. ముందు వచ్చిన వారికి ప్రయారిటీ ఇస్తారు. -
ఇదో గొప్ప ప్రయాణం: రోహిత్ శర్మ
కోల్ కతా: ఐపీఎల్-8 టైటిల్ సాధించడం పట్ల ముంబై ఇండియన్స్ టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆనందం వ్యక్తం చేశాడు. ఈ సీజన్ తమ ప్రయాణం గొప్పగా సాగిందని పేర్కొన్నాడు. ఐపీఎల్ విజేతగా నిలిచిన తన జట్టును ఇంకేమీ అడగబోనని అన్నాడు. ఆదివారం జరిగిన ఐపీఎల్ ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ ను 41 పరుగుల తేడాతో ఓడించి ముంబై టైటిల్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ లో 26 బంతుల్లో 50 పరుగులు చేసిన రోహిత్ శర్మ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అందుకున్నాడు. 'ఇదో గొప్ప ప్రయాణం. దీనికి మించి ఇంకేమీ అడగను. టైటిల్ పోరులో మా ఆటగాళ్లు బాగా ఆడారు. మరిచిపోలేని విజయం అందించారు' అని రోహిత్ శర్మ అన్నాడు. వరుస ఓటముల నుంచి పుంజుకున్న తీరు అనూహ్యమని పేర్కొన్నాడు. -
18 వేల 332 పరుగులు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 8వ సీజన్ లో స్కోరు బోర్డుపై నమోదైన మొత్తం పరుగులు ఎన్నో తెలుసా. అక్షరాల 18 వేల 332 పరుగులు. ఇందులో బౌండరీల ద్వారా వచ్చిన రన్స్ 10,58. ఇందులో 89 అర్ధ సెంచరీలున్నాయి. పరుగుల వీరులు 692 సిక్సర్లు బాదారు. 'సిక్సర' పిడుగు క్రిస్ గేల్ అత్యధికంగా 38 సార్లు బంతిని బౌండరీ దాటించాడు. అత్యధికంగా 108 మీటర్ల వరకు బంతి వెళ్లింది. ఈసారి ఐపీఎల్ లో686 వికెట్లు పడ్డాయి. ఫాస్టెస్ట్ బాల్ వేగం 151.11 కేపీహెచ్(మిచెల్ జాన్సన్) గా నమోదైంది. వయసు పెరిగినా తన బౌలింగ్ పదును తగ్గలేదని నిరూపించిన ఆశిష్ నెహ్రా బెస్ట్ బౌలింగ్ (4/10) గణాంకాలు తన పేరిట లఖించుకున్నాడు. 26 వికెట్లతో డ్వెన్ బ్రేవో టాప్ బౌలర్ గా నిలిచాడు. ఎలా బడితే అలా బాదేసే ఏబీ డివిలియర్స్ అత్యధిక వ్యక్తిగత స్కోరు(133) చేసిన ఆటగాడిగా నిలిచాడు. హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్( 562) టాప్ స్కోరర్ అయ్యాడు. ఈసారి ఇండియా ఆటగాళ్లు సెంచరీలు కొట్టలేకపోయారు. డివిలియర్స్, క్రిస్ గేల్, బ్రెండన్ మెక్ కల్లమ్, షేన్ వాట్సన్ మాత్రమే శతకాలు బాదారు. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచిన పంజాబ్ చిత్తుగా ఓడిన రికార్డు సొంతం చేసుకుంది. బెంగళూరు చేతిలో 138 పరుగుల భారీ తేడాతో ఓటమి మూటగట్టుకుంది. గతేడాది లీగ్ దశలో 22 పాయింట్లతో టాప్'గా నిలిచిన కింగ్స్ ఎలెవన్ పంబాబ్ ఈసారి అట్టడుగు నుంచి 'ఫస్ట్'కు పతనమైంది. చివరి నుంచి రెండో స్థానంలో కుదురుకున్న ఢిల్లీ డేర్ డెవిల్స్ తలరాత ఈసారి కూడా మారలేదు. సన్ రైజర్స్ హైదరాబాద్ కు అదృష్టం కలిసి రాలేదు. డిపెండింగ్ చాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ ప్లేఆప్ కు చేరకుండానే ఇంటిదారి పట్టింది. తన చివరి లీగ్ మ్యాచ్ లో గెలిచి ప్లేఆఫ్ కు వచ్చిన రాజస్థాన్ రాయల్స్ ఫైనల్ కు చేరలేకపోయింది. బెంగళూరు రాయల్ చాలెంజర్స్ కు మరోసారి నిరాశే ఎదురైంది. లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ తుది పోరులో తడబడింది. ఆరంభంలో ఎదురైన వరుస ఓటముల నుంచి అనూహ్యంగా పుంజుకుని ముంబై ఇండియన్స్ టీమ్ టైటిల్ ఎగరేసుకు పోవడం ఊహించని పరిణమామం. ఈ ఐపీఎల్ లో ఎవరు బెస్ట్... స్ట్రైక్ రేట్: ఆండ్రీ రసెల్(192.89) బ్యాటింగ్ సగటు: అజింక్య రహానే(49.09) అర్ధసెంచరీలు: డేవిడ్ వార్నర్(7) సిక్సర్లు: క్రిస్ గేల్(38) ఫోర్లు: డేవిడ్ వార్నర్(65) వేగవంతం సెంచరీ: క్రిస్ గేల్(46 బంతుల్లో) అర్ధ సెంచరీ: రసెల్, హర్భజన్(19 బంతుల్లో) అత్యుత్తమం బౌలింగ్ సగటు: హెన్సిక్స్(14.36) బౌలింగ్ ఎకానమి: అశ్విన్(5.84) డాట్ బాల్స్: అశిష్ నెహ్రా( 170) మెయిడిన్లు: సందీప్ శర్మ(4) అవార్డులు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్: ఆండ్రీ రసెల్ ఎమర్జింగ్ ప్లేయర్: శ్రేయస్ అయ్యర్ బెస్ట్ క్యాచ్: డ్వేన్ బ్రేవో ఫేయిర్ ప్లే అవార్డు: చెన్నై సూపర్ కింగ్స్ ఆరెంజ్ క్యాప్: డేవిడ్ వార్నర్(562 రన్స్) పర్పుల్ క్యాప్: డ్వేన్ బ్రేవో(26 వికెట్లు) -
రెండో ఓవర్ కొంప ముంచింది: ధోని
కోల్ కతా: మ్యాచ్ ను గెలిచిపించే వ్యక్తిగత ప్రదర్శన చేయకపోవడంతో ఐపీఎల్-8 ఫైనల్లో ఓడిపోయామని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ సింగ్ ధోని అన్నాడు. తమ జట్టు పూర్తిస్థాయిలో రాణించక పోవడం కూడా ఓటమికి కారణమని విశ్లేషించాడు. మొహిత్ శర్మ వేసిన రెండో ఓవర్ తమ కొంప ముంచిందని వాపోయాడు. ముంబై పుంజుకోవడానికి, మ్యాచ్ తమ చేయి జారడానికి ఈ ఓవరే కారణమన్నాడు. ఈ ఓవర్ లో రోహిత్ శర్మ రెండు ఫోర్లు, సిక్సర్ తో 16 పరుగులు పిండుకున్నాడు. భారీ స్కోరును ఛేదించేందుకు బరిలోకి దిగిన తమకు శుభారంభం లభించకపోవడం దెబ్బతీసిందన్నాడు. డాషింగ్ ఓపెనర్ బ్రెండన్ మెక్ కల్లమ్ లేకపోవడం కూడా తమ విజయవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపిందన్నాడు. ప్లే ఆప్ లో పుంజుకోలేకపోవడంతో టైటిల్ చేజారిందన్నాడు. మొత్తంగా చూసుకుంటే తమ జట్టు ప్రదర్శన సంతృప్తికరంగా ఉందని ధోని చెప్పాడు. -
'ఇప్పుడు క్రికెట్ ను ప్రేమిస్తున్నా'
కోల్ కతా: తమ జట్టు ఐపీఎల్-8 విజేతగా నిలవడం పట్ల ముంబై ఇండియన్స్ టీమ్ సహ యజమాని నీతా అంబానీ హర్షం వ్యక్తం చేశారు. తానిప్పుడు క్రికెట్ ను ప్రేమిస్తున్నానని చెప్పారు. ఐపీఎల్ మొదలైనప్పుడు తనకు అసలు క్రికెట్ గురించి తెలియదని వెల్లడించారు. ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. 'మొదటి, రెండు ఐపీఎల్ వరకు క్రికెట్ గురించి అసలు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు క్రికెట్ ను అభిమానిస్తున్నా. మా టీమ్ కు పెద్ద సంఖ్యలో మద్దతుగా నిలిచిన అభిమానులను ఇష్టపడుతున్నా' అని నీతా అంబానీ అన్నారు. వాంఖేడ్ మైదానంలో మొదటి క్వాలిఫయిర్ మ్యాచ్ లో చెన్నైని ఓడించిన తర్వాత తామే విజేతగా నిలుస్తామని నమ్మకం ఏర్పడిందని తెలిపారు. తమ జట్టు సాధించిన విజయాన్ని అభిమానులకు అంకితం చేశారు. ఈ క్రెడిట్ మొత్తం టీమ్ కే దక్కుతుందని నీతా అంబానీ కుమారుడు ఆకాశ్ అంబానీ అన్నారు. 10 మ్యాచుల్లో 9 విజయాలు సాధించడం చాలా గొప్ప విషయమని పేర్కొన్నారు. టైటిల్ సాధించేందుకు తమ ఆటగాళ్లు చాలా కష్టపడ్డారని అన్నారు. -
టాప్ ట్రెండింగ్ టీమ్ ముంబై
కోల్ కతా: క్రికెట్ అభిమానులను ఊర్రూతలూగించిన ఐపీఎల్-8 సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. తమ అభిమాన క్రికెటర్లు, జట్ల సమాచారం తెలుసుకునేందుకు, తమ అభిప్రాయాలను పంచుకునేందుకు ఫ్యాన్స్ సామాజిక వెబ్ సైట్లను వేదికగా మలుచుకున్నారు. ఐపీఎల్-8పై దాదాపు 36 కోట్ల ట్వీట్లు వచ్చాయి. ఈ ఏడాది విజేతగా నిలిచిన 753,669 ట్వీట్లతో టాప్ ట్రెండింగ్ టీమ్ గా నిలిచింది. 'ఎక్స్ ప్రెసివ్' ఆటగాడు విరాట్ కోహ్లిపై అత్యధిక ట్వీట్లు వదిలారు. ధోని, గేల్, డీవిలియర్స్, రోహిత్ శర్మ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఏప్రిల్ 9న ఢిల్లీ, చెన్నై జట్ల మధ్య చెపాక్ మైదానంలో జరిగిన మ్యాచ్ సందర్భంగా నిమిషానికో ట్వీట్ నమోదైంది. వాంఖేడ్ మైదానంలో ముంబై, చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ పైనా నెటిజన్లు సోషల్ మీడియాలో అమితాసక్తి చూపారు. -
ధోని, గౌతీ సరసన రోహిత్
కోల్ కతా: ఆరు వారాల పాటు క్రికెట్ అభిమానులకు అలరించిన ఐపీఎల్-8 ముగిసింది. అనూహ్యంగా పుంజుకున్న ముంబై ఇండియన్స్ టీమ్ విజేతగా నిలిచింది. అన్ని విభాగాల్లో పైచేయి సాధించి రెండోసారి టైటిల్ సొంతం చేసుకుంది. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ... మహేంద్ర సింగ్ ధోని, గౌతమ్ గంభీర్ సరసన చేరాడు. రెండుసార్లు జట్టుకు ఐపీఎల్ టైటిల్ అందించిన కెప్టెన్ల జాబితాలో వీరు ముగ్గురూ ఉన్నారు. రాజస్థాన్, హైదరాబాద్ ఒక్కోసారి ఐపీఎల్ టైటిల్ అందుకున్నాయి. ఈ సీజన్ లో 16 మ్యాచ్ లు ఆడిన రోహిత్ 34.42 సగటుతో 482 పరుగులు సాధించాడు. ఇందులో మూడు అర్ధసెంచరీలు ఉన్నాయి. 17 మ్యాచ్ లు ఆడిన ధోని 31 సగటుతో 372 పరుగులు చేశాడు. గౌతమ్ గంభీర్ 13 మ్యాచుల్లో 25.15 సగటుతో 327 పరుగులు సాధించాడు. -
ఐపీఎల్ చాంపియన్ ముంబై ఇండియన్స్
-
ఐపీఎల్ చాంపియన్ ముంబై ఇండియన్స్
-
ముంబై ధూంధాం...
ఐపీఎల్ చాంపియన్ ముంబై ఇండియన్స్ ► ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్‌పై ఘన విజయం ► చెలరేగిన రోహిత్, సిమ్మన్స్, పొలార్డ్ అదే వేదిక... అవే జట్లు... అదే కెప్టెన్లు... అదే ఫలితం... కేవలం సంవత్సరం మారిందంతే..! 2013 ఐపీఎల్ ఫైనల్ ఫలితం మరోసారి పునరావృతమైంది. ఈడెన్ గార్డెన్స్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను చిత్తు చేసి ముంబై ఇండియన్స్ 2015 ఐపీఎల్ విజేతగా నిలిచింది. పటిష్టమైన చెన్నైని చెడుగుడు ఆడేస్తూ సిమ్మన్స్, రోహిత్, పొలార్డ్ పరుగుల జడివాన కురిపించారు. అటు ముంబై బౌలర్లూ మెరిశారు. ఫలితం... రోహిత్ సేన సగర్వంగా రెండోసారి ఐపీఎల్ టైటిల్ సొంతం చేసుకుంది. కోల్‌కతా : బ్యాటింగ్‌కు అనుకూలించే ఫ్లాట్ వికెట్... ఒత్తిడి ఉండే ఫైనల్ మ్యాచ్... సాధారణంగా ఏ కెప్టెన్ అయినా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంటాడు. కానీ వ్యూహాల్లో దిట్టగా భావించే ధోని మాత్రం అనూహ్యంగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ తప్పిదం చెన్నైని వెంటాడింది. వరుస విజయాలతో జోరు మీద ఉన్న ముంబై బ్యాట్స్‌మెన్ ధాటికి చెన్నై కకావికలమైంది. బ్యాటింగ్‌లో సిమ్మన్స్ (45 బంతుల్లో 68; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), రోహిత్ (26 బంతుల్లో 50; 6 ఫోర్లు, 2 సిక్సర్లు)ల వీరోచిత ఇన్నింగ్స్‌తో ఆదివారం జరిగిన ఫైనల్లో ముంబై 41 పరుగుల తేడాతో ధోనిసేనపై విజయం సాధించి రెండోసారి విజేతగా నిలిచింది. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో... ముందుగా ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లకు 202 పరుగులు చేసింది. పొలార్డ్ (18 బంతుల్లో 36; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), రాయుడు (24 బంతుల్లో 36 నాటౌట్; 3 సిక్సర్లు) దుమ్మురేపారు. తర్వాత చెన్నై 20 ఓవర్లలో 8 వికెట్లకు 161 పరుగులకు మాత్రమే పరిమితమైంది. స్మిత్ (48 బంతుల్లో 57; 9 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. రైనా (19 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్), మోహిత్ (7 బంతుల్లో 21 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు), ధోని (13 బం తుల్లో 18; 1 ఫోర్, 1 సిక్స్) మోస్తరుగా ఆడారు. కీలక భాగస్వామ్యం టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇన్నింగ్స్ ఐదో బంతికే పార్థీవ్ (0) వికెట్‌ను కోల్పోయింది. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన రోహిత్.. అచ్చొచ్చిన మైదానంలో విశ్వరూపం చూపాడు. సిమ్మన్స్‌తో కలిసి బౌండరీలు, సిక్సర్లతో రెచ్చిపోవడంతో ముంబై స్కోరు బోర్డు కదం తొక్కింది. వాయువేగంతో బ్యాటింగ్ చేసిన సిమ్మన్స్ 35 బంతుల్లో; రోహిత్ 25 బంతుల్లో అర్ధసెంచరీలు పూర్తి చేశారు. ఓవర్‌కు పదికిపైగా రన్‌రేట్‌తో పరుగులు సాధించడంతో రెండో వికెట్‌కు 67 బంతుల్లోనే 119 పరుగులు సమకూరాయి. అయితే రెండు బంతుల తేడాలో ఈ ఇద్దరూ పెవిలియన్‌కు చేరడంతో ముంబై స్కోరు 120/3గా మారింది. తర్వాత పొలార్డ్, రాయుడు కూడా చెన్నై బౌలర్లను ఆడుకున్నారు. నెహ్రా వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్లో 23 పరుగులు రాబట్టిన పొలార్డ్... 19వ ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించి అవుటయ్యాడు. రాయుడుతో కలిసి నాలుగో వికెట్‌కు 40 బంతుల్లో 71 పరుగులు జోడించాడు. హార్థిక్ పాండ్యా (0) విఫలమైనా.. హర్భజన్ (6 నాటౌట్) సిక్సర్‌తో ముంబై స్కోరు 200 దాటింది. స్మిత్ మినహా అంతా విఫలం భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై ఓపెనర్ హస్సీ (4) తొందరగా అవుటయ్యాడు. స్మిత్, రైనాలు నెమ్మదిగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను పునర్నిర్మించినా కావలసిన రన్‌రేట్ బాగా పెరిగింది. అప్పుడప్పుడూ ఫోర్లు బాదినా... తొలి 10 ఓవర్లలో చెన్నై వికెట్ నష్టానికి 67 పరుగులు మాత్రమే చేసింది. అయితే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న స్మిత్‌తో పాటు రైనాను వరుస ఓవర్లలో హర్భజన్ అవుట్ చేసి మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. ఈ ఇద్దరు రెండో వికెట్‌కు 66 పరుగులు జోడించారు. తర్వాత ముంబై పేసర్లు విజృంభించి వరుస ఓవర్లలో బ్రేవో (9), ధోని, డు ప్లెసిస్ (1), నేగి (3), అశ్విన్ (2)లను అవుట్ చేశారు. చివరి 10 ఓవర్లలో చెన్నై 94 పరుగులు చేసి ఏడు వికెట్లు చేజార్చుకుని ఓడింది. మెక్లీనగన్ 3 వికెట్లు తీశాడు. మలింగ, హర్భజన్‌లకు రెండేసి వికెట్లు లభించాయి. భారీ బృందగానం! ముంబైని గెలిపించిన సమష్టితత్వం కలిసొచ్చిన దిగ్గజాల మార్గదర్శనం టోర్నీ మొదటి ఆరు మ్యాచ్‌లలో ఐదు పరాజయాలు...ఇక ఐపీఎల్-8లో ఆ జట్టు కథ ముగిసినట్లేనని అనిపించింది. అయితే ముంబై ఇండియన్స్ మరోసారి ఫీనిక్స్ పక్షిలా లేచింది. గత ఏడాది యూఏఈ అంచెలో ఇదే తరహాలో వెనకబడి కోలుకున్న రోహిత్ సేన ఇప్పుడు మరింత వేగంగా దూసుకొచ్చింది. ఆటగాళ్లంతా ఒకరితో మరొకరు పోటీ పడి మైదానంలో రాణిస్తే... మహామహులు వెనకనుండి వెన్ను తట్టి నిలవగా ముంబై ఇండియన్స్ రెండో సారి చాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకుంది. రాత మార్చిన ఓపెనింగ్ ఆసీస్ స్టార్ ఫించ్ గాయంతో వెనుదిరగడంతో ఓపెనర్‌గా విండీస్ ఆటగాడు సిమన్స్ రావడం ముంబైకి కలిసొచ్చింది. మరో ఓపెనర్ పార్థీవ్‌తో కలిసి సిమన్స్ టోర్నీ రెండో అర్ధ భాగంలో చెలరేగాడు. వీరిద్దరు దాదాపు ప్రతీ మ్యాచ్‌లో శుభారంభం అందించడంతో తర్వాత వచ్చే బ్యాట్స్‌మన్ నేరుగా ఎదురుదాడికి అవకాశం కలిగింది. గత ఏడాది కూడా ముంబై టాప్ స్కోరర్ అయిన సిమన్స్ ఈ సారి 6 అర్ధ సెంచరీలతో టోర్నీలో మొత్తం 540 పరుగులు చేశాడు. రెండు అర్ధ సెంచరీలు చేసిన పార్థీవ్ కీపర్‌గా కూడా సమర్థంగా రాణించాడు. మూడో స్థానంలో రోహిత్ 482 పరుగులు చేయడంతో ముంబై బ్యాటింగ్‌కు నిలకడ వచ్చిం ది. ఫైనల్లో చేసిన అర్ధ సెంచరీ అతని ప్రత్యేక ప్రదర్శనగా నిలిచిపోతుంది. పొలార్డ్ మెరుపులు గతంలో చాలా మ్యాచ్‌లలో తగినన్ని బం తులు అందుబాటులో లేక ఆశించిన ప్రదర్శన ఇవ్వని పొలార్డ్, ఈ సీజన్లో మాత్రం బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు వచ్చి జట్టు విజయాల్లో కీలక పాత్ర (419 పరుగులు) పోషించాడు. ముఖ్యంగా కోల్‌కతాతో కీలక ఇన్నింగ్స్‌తో ప్లే ఆఫ్‌కు చేర్చిన అతను, తొలి క్వాలిఫయర్‌లో, ఆ తర్వాత ఫైనల్లోనూ చెలరేగిపోయాడు. ఇక కొత్త కుర్రాడు హార్దిక్ పాండ్యా అనూహ్య ప్రదర్శనతో ముంబై మిడిలార్డర్ ఒక్కసారిగా పటిష్టంగా మారిపోయింది. చెన్నైపై సిక్సర్లతో విరుచుకుపడ్డ అతను, కోల్‌కతాపై చక్కటి హాఫ్ సెంచరీ చేశాడు. ఆరంభ మ్యాచ్‌లలో రాణించని రాయుడు తర్వాత నిలదొక్కుకున్నాడు. ఫైనల్ మ్యాచ్‌లో అతని ప్రదర్శన ముంబై విజయంలో ప్రధాన పాత్ర పోషించింది. గన్ పేలింది... ఐపీఎల్ వేలంలో కోచ్ పాంటింగ్ పట్టుబట్టి మెక్లీన్గన్ (18వికె ట్లు)ను తీసుకున్నాడు. తొలి నాలుగు మ్యాచ్‌ల తర్వాత బరిలోకి దిగిన అతను అద్భుతంగా ప్రభావం చూపించాడు. ముఖ్యంగా ముంబై వికెట్‌పై చక్కటి బౌన్స్ రాబట్టిన అతను పేస్‌తో చెలరేగాడు. హైదరాబాద్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో తొలి ఓవర్లో వార్నర్‌ను అవుట్ చేసి ఆటను మలుపు తిప్పాడు. మలింగ (24) ఎప్పటిలాగే తన పదునైన యార్కర్లతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను పూర్తిగా కట్టి పడేశాడు. ఒకప్పటి హర్భజన్ ఈ టోర్నీలో మళ్లీ మెరిశాడు. 18 వికెట్లు తీసిన అతను తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాడు. కనీసం ఒక్క ఫస్ట్ క్లాస్ అనుభవం కూడా లేని లెఫ్టార్మ్ స్పిన్నర్ సుచిత్ (10 వికెట్లు) కూడా ప్రభావం చూపించడంతో ముంబై తుది జట్టులో మార్పుల అవసరం లేకపోయింది. ఫుల్ ‘సపోర్ట్’ ’నేనిక్కడ ఉన్నది ఐపీఎల్ టైటిల్ అందించడానికే’ అని ఆత్మవిశ్వా సంతో ప్రకటించిన హెడ్ కోచ్ రికీ పాంటింగ్ దానిని చేసి చూపించాడు. దిగ్గజ ఆటగాడిగా, టాప్ టీమ్ కెప్టెన్‌గా అతనికి ఉన్న అనుభవం జట్టుకు బాగా ఉపయోగపడింది. ‘మీ కోసం కాదు జట్టు కోసం ఆడండి’ అంటూ అతను తమలో స్ఫూర్తి నింపాడంటూ ప్రతీ ఆటగాడు చెప్పుకొచ్చాడు. అదే విధంగా టీమ్ ఐకాన్‌గా సచిన్, చీఫ్ మెంటార్‌గా కుంబ్లే ఉన్నా...జట్టు ప్రయోజనాల కోసం అవసరమైతే సలహాలు ఇచ్చారు తప్పితే కోచ్ పాత్రను పరిమితం చేసి ఆధిక్యం ప్రదర్శించే పని చేయలేదు. దాంతో పాంటింగ్ మరింత స్వేచ్ఛగా వ్యవహరించాడు. అసిస్టెంట్ కోచ్ రాబిన్ సింగ్, బౌలింగ్ కోచ్ షేన్ బాండ్, ఫీల్డింగ్ కోచ్ జాంటీ రోడ్స్ అతనికి అండగా నిలిచారు. ఫలితమే ఐపీఎల్లో ముంబై జెండా మరోసారి ఎగిరింది. -సాక్షి క్రీడావిభాగం ఎవరికెంత డబ్బు... ముంబై ఇండియన్స్: రూ. 15 కోట్లు చెన్నై సూపర్‌కింగ్స్: రూ. 10 కోట్లు బెంగళూరు రాయల్‌చాలెంజర్స్: రూ. 5 కోట్లు రాజస్తాన్ రాయల్స్: రూ. 4 కోట్లు స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ : సిమ్మన్స్ (సి) ధోని (బి) స్మిత్ 68; పార్థీవ్ రనౌట్ 0; రోహిత్ (సి) జడేజా (బి) బ్రేవో 50; పొలార్డ్ (సి) రైనా (బి) మోహిత్ 36; రాయుడు నాటౌట్ 36; హార్ధిక్ పాండ్యా (సి) రైనా (బి) బ్రేవో 0; హర్భజన్ నాటౌట్ 6; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 202. వికెట్ల పతనం : 1-1; 2-120; 3-120; 4-191; 5-191. బౌలింగ్ : నెహ్రా 4-0-41-0; మోహిత్ 4-0-38-1; అశ్విన్ 2-0-21-0; జడేజా 2-0-26-0; నేగి 2-0-18-0; బ్రేవో 4-0-36-2; స్మిత్ 2-0-17-1. చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్ : స్మిత్ ఎల్బీడబ్ల్యు (బి) హర్భజన్ 57; హస్సీ (సి) సుచిత్ (బి) మెక్లీనగన్ 4; రైనా (స్టంప్) పార్థీవ్ (బి) హర్భజన్ 28; ధోని (బి) మలింగ 18; బ్రేవో (సి) సిమ్మన్స్ (బి) మెక్లీనగన్ 9; పవన్ నేగి (సి) హార్ధిక్ (బి) మలింగ 3; డు ప్లెసిస్ (సి) రోహిత్ (బి) వినయ్ 1; జడేజా నాటౌట్ 11; అశ్విన్ (సి) సుచిత్ (బి) మెక్లీనగన్ 2; మోహిత్ నాటౌట్ 21; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 161. వికెట్ల పతనం : 1-22; 2-88; 3-99; 4-108; 5-124; 6-125; 7-134; 8-137. బౌలింగ్ : మలింగ 4-0-25-2; మెక్లీనగన్ 4-0-25-3: వినయ్ 4-0-39-1; హార్ధిక్ 4-0-36-0; హర్భజన్ 4-0-34-2 -
ఐపీఎల్ విజేత ముంబై
కోల్ కతా:ఐపీఎల్-8 ట్రోఫీని ముంబై ఇండియన్స్ కైవసం చేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ తో ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో ముంబై ఇండియన్స్ 41 పరుగుల తేడాతో విజయం సాధించి టైటిల్ ను చేజిక్కించుకుంది. 203 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై బ్యాటింగ్ లో తడబడి ఓటమి పాలైంది. చెన్నై ఆటగాళ్లలో డ్వేన్ స్మిత్(57)హాఫ్ సెంచరీ మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. మైక్ హస్సీ,(4), సురేష్ రైనా(28), బ్రేవో(9), మహేంద్ర సింగ్ ధోనీ(18) లు విఫలం చెందడంతో నిర్ణీత ఓవర్లలో8 వికెట్లు కోల్పోయి 161 పరుగులకే పరిమితమైన చెన్నై ఓటమి చెందింది. ఆద్యంతం ఏకపక్షంగా సాగిన కీలక పోరులో ఘనవిజయం సాధించిన ముంబై ఇండియన్స్ రెండో సారి ట్రోఫీని దక్కించుకోగా.. చెన్నై ఆరోసారి ఫైనల్లో చతికిలబడింది. ఇరు జట్లు మూడు సార్లు ఫైనల్లో తలపడగా.. ముంబై రెండు సార్లు పైచేయి సాధించింది. ముంబై బౌలర్లలో మెక్ లెనగాన్ మూడు, మలింగా, హర్భజన్ సింగ్ లు తలో రెండు వికెట్లు తీసి గెలుపులో కీలక పాత్ర పోషించారు. ముందు టాస్ గెలిచిన చెన్నై.. ముంబైను బ్యాటింగ్ ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన ముంబై 20ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది. పార్దీవ్ పటేల్ డకౌట్ రూపంలో ఆదిలో వెనుదిరిగినా.. కెప్టెన్ రోహిత్ శర్మ(50), సిమ్మన్స్(68) అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుని ముంబై భారీ స్కోరు చేయడంలో సహకరించారు. ఇరువురూ కలిసి రెండో వికెట్ కు 119 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అయితే ఈ ఇద్దరు 120 పరుగుల వద్ద నిష్ర్కమించడంతో ముంబై స్కోరు కాస్త మందగించింది. అయితే మధ్యలో పొలార్డ్(36), అంబటి రాయుడు (36)పరుగులతో ఆకట్టుకున్నారు. -
చెన్నై విజయలక్ష్యం 203
కోల్ కతా: ఐపీఎల్-8 లో భాగంగా ఇక్కడ ఈడెన్ గార్డెన్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న ఫైనల్ పోరులో ముంబై ఇండియన్స్ 203 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థికి నిర్దేశించింది. పార్దీవ్ పటేల్ డకౌట్ రూపంలో ఆదిలో వెనుదిరిగినా.. కెప్టెన్ రోహిత్ శర్మ(50), సిమ్మన్స్(68) అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుని ముంబై భారీ స్కోరు చేయడంలో సహకరించారు. ఇరువురూ కలిసి రెండో వికెట్ కు 119 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అయితే ఈ ఇద్దరు 120 పరుగుల వద్ద నిష్ర్కమించడంతో ముంబై స్కోరు కాస్త మందగించింది. అయితే మధ్యలో పొలార్డ్(36), అంబటి రాయుడు (36), హర్భజన్ సింగ్(6) పరుగులు చేయడంతో ముంబై నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో బ్రేవోకు రెండు వికెట్లు లభించగా, డ్వేన్ స్మిత్ ,మోహిత్ శర్మ లకు తలో వికెట్ లభించింది. తొలుత టాస్ గెలిచిన చెన్నై.. ముంబై ఇండియన్స్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. -
ముంబై దూకుడు
కోల్ కతా: ఐపీఎల్-8 లో భాగంగా ఇక్కడ ఈడెన్ గార్డెన్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న ఫైనల్ పోరులో ముంబై ఇండియన్స్ దూకుడుగా బ్యాటింగ్ కొనసాగిస్తోంది. ఆదిలోనే పార్దీవ్ పటేల్ వికెట్ ను డకౌట్ రూపంలో కోల్పోయిన ముంబై బ్యాటింగ్ లో జోరును మాత్రం యథావిధిగా కొనసాగిస్తోంది. పది ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ వికెట్ నష్టానికి 98 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తోంది. ముంబై ఆటగాళ్లలో రోహిత్ శర్మ(39), సిమ్మన్స్ (56) లు వేగంగా స్కోరు బోర్డును ముందుకు పరుగులు పెట్టిస్తున్నారు. -
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై
కోల్ కతా: ఐపీఎల్-8లో భాగంగా ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న ఫైనల్ పోరులో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. సంచలన విజయాలతో ఫైనల్ కు చేరిన ఇరు జట్లు తుదిపోరులో ఆమీతుమీ తేల్చుకోవడానికి సన్నద్ధమయ్యాయి. రెండు జట్ల బలబలాలను పరిశీలిస్తే చెన్నై కంటే ముంబై పటిష్టంగా ఉంది. కాగా, క్వాలిఫయర్ -2లో మైక్ హస్సీ బ్యాటింగ్ చలవతో బెంగళూర్ ను మట్టికరిపించి ఫైనల్ కు చేరిన చెన్నై ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. మరోవైపు క్వాలిఫయర్ -1లో చెన్నై ను ఓడించి ముంబై ఇండియన్స్ అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తోంది. ఫైనల్ సమరానికి కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదిక సిద్ధమైంది. ఈ రెండు జట్లు ఫైనల్లో రెండుసార్లు తలపడగా.. చెరోసారి విజయం సాధించాయి. ముంబై ఫైనల్ చేరిన ప్రతిసారీ చెన్నైతోనే తలపడింది. 2009లో ముంబైపై చెన్నై గెలవగా.. 2013లో చెన్నైపై ముంబై ఇండియన్స్ గెలిచింది. -
'డబుల్' కొడతారా.. 'రికార్డు' సృష్టిస్తారా?
హైదరాబాద్: ఐపీఎల్ -8లో భాగంగా ఆదివారం సాయంత్రం జరగబోయే ఫైనల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ గెలిస్తే.. ఐపీఎల్ లో రెండో టైటిల్ సాధించిన జట్ల సరసన చేరుతుంది. చెన్నై సూపర్ కింగ్స్ గెలిస్తే.. ఐపీఎల్ చరిత్రలో మూడుసార్లు చాంపియన్ గా నిలిచిన జట్టుగా సరికొత్త రికార్డు సృష్టించనుంది. ఫైనల్ సమరానికి కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదిక సిద్ధమైంది. ఈ రెండు జట్లు ఫైనల్లో రెండుసార్లు తలపడగా.. చెరోసారి విజయం సాధించాయి. ముంబై ఫైనల్ చేరిన ప్రతిసారీ చెన్నైతోనే తలపడింది. 2010లో ముంబైపై చెన్నై గెలవగా.. 2013లో చెన్నైపై ముంబై ఇండియన్స్ గెలిచింది. తాజాగా మూడోసారి ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. మరోవైపు చెన్నై మాత్రం ఆరుసార్లు ఫైనల్ చేరగా.. మూడుసార్లు ముంబైతో (నేటి మ్యాచ్ కలిపి).. రాజస్థాన్ రాయల్స్, కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లతో ఒక్కోసారి తలపడింది. బలాబలాలు: ఈ సీజన్లో ఇప్పటిదాకా ముంబై ఇండియన్స్ అద్భుతమైన ఫామ్ కనబరుస్తోంది. ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్‌తో పాటు ఓపెనర్లు పార్థివ్ పటేల్, సిమ్మన్స్.. అదే విధంగా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్‌లో రాణిస్తున్నారు. మరోవైపు బంతితో లసిత్ మలింగ, హర్భజన్ సింగ్ ముంబై విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. చెన్నై జట్టులో ఓపెనర్ మెక్ కల్లమ్ లేకపోవటం ఆ జట్టుకు లోటు. మెక్ కల్లమ్ స్థానంలో జట్టులోకి వచ్చిన మైక్ హస్సీ కూడా బ్యాటింగ్‌లో అదరగొడుతున్నాడు. అంతేకాకుండా డ్వేన్ స్మిత్, డుప్లెసిస్, ఎంఎస్ ధోని, రైనా బ్యాటింగ్‌లో ఆకట్టుకుంటుండగా.. పవన్ నేగి, డ్వేన్ బ్రేవో తమ ఆల్ రౌండ్ ప్రదర్శనతో జట్టుకు విజయాన్ని అందిస్తున్నారు. బౌలింగ్ విషయంలో చెన్నై కాస్త బలహీనమే అని చెప్పాలి. పేసర్ అశిష్ నెహ్రాతో పాటు ఆల్ రౌండర్ బ్రేవో మాత్రమే రాణిస్తున్నారు. -
IPLని కుదిపేసిన ఫిక్సింగ్,సెక్స్స్కాండల్స్
-
క్లైమాక్స్‌కు రంగం సిద్ధం
-
వయసైపోయింది కదా...
ఈ ఏడాది ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ ఆశిష్ నెహ్రా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఇప్పటికే 22 వికెట్లతో ధోనిసేన ఫైనల్‌కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఇంత అద్భుతంగా ఎలా బౌలింగ్ చేస్తున్నారని అడిగితే నెహ్రా కాస్త భిన్నంగా స్పందించాడు. ‘నేను గత 10 సంవత్సరాలుగా నిలకడగానే ఆడుతున్నాను. ఐపీఎల్లో అవకాశం లభించిన ప్రతి సీజన్లోనూ రాణించాను. కానీ ఎవరూ గుర్తించలేదు. ఇప్పుడు నా వయసు 36 సంవత్సరాలు. వయసైపోయిన వ్యక్తి వికెట్లు తీస్తున్నాడని ఇప్పుడు నన్ను గుర్తిస్తున్నారనుకుంటా’ అని అన్నాడు. -
క్లైమాక్స్‌కు రంగం సిద్ధం
►నేడు ఐపీఎల్ ఫైనల్ ►ముంబై ఇండియన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ ఢీ ►ఫామ్‌లో రోహిత్ సేన ఆత్మవిశ్వాసంతో ధోని బృందం హోరాహోరీ పోరాటాలు... ఉత్కంఠభరిత మ్యాచ్‌లు... బౌండరీల హోరు, సిక్సర్ల జోరు... కళ్లుచెదిరే క్యాచ్‌లు... 47 రోజుల పాటు అభిమానులను ఉర్రూతలూగించిన టి20 వినోదానికి నేటితో తెరపడనుంది. ఈడెన్‌గార్డెన్స్‌లో భారీ క్లైమాక్స్‌కు రంగం సిద్ధమైంది. లీగ్ చరిత్రలోనే రెండు హై ప్రొఫైల్ జట్లు టైటిల్ కోసం తలపడుతున్నాయి. ఎనిమిదో సీజన్ ఐపీఎల్ ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. కోల్‌కతా : మరోసారి ఆధిపత్య పోరుకు రంగం సిద్ధమైంది. ముంబై, చెన్నై జట్లు ఐపీఎల్లో ఎప్పుడు, ఎక్కడ మ్యాచ్ ఆడినా అది అభిమానులకు కన్నుల పండగే. ఇక అది ఫైనల్ అయితే ఆ ఉత్సాహమే వేరు. ఈ సీజన్లో ఇప్పటికే మూడుసార్లు తలపడిన ఈ రెండు జట్లు ఈసారి అన్నింటికంటే పెద్ద మ్యాచ్‌కు సిద్ధమయ్యాయి. చారిత్రక ఈడెన్‌గార్డెన్స్‌లో ఆదివారం జరిగే ఐపీఎల్ ఫైనల్లో ముంబై ఇండియన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. 2013లో ఇదే వేదికపై జరిగిన ఐపీఎల్-6 ఫైనల్లో ముంబై జట్టు చెన్నైపై గెలిచింది. ఈసారి లీగ్ దశలో తొలి ఆరు మ్యాచ్‌ల్లో ఐదు ఓడిపోయి... ప్రతి మ్యాచ్‌లోనూ చావోరేవో తరహాలో ఆడి... ఆఖరి లీగ్ మ్యాచ్‌లో విజయంతో ప్లేఆఫ్‌కు చేరింది ముంబై జట్టు. క్వాలిఫయర్-1లో చెన్నైని అలవోకగా ఓడించి నాలుగు రోజుల విశ్రాంతితో తాజాగా బరిలోకి దిగుతోంది. అటు చెన్నై జట్టు మిగిలిన అన్ని జట్ల కంటే ముందే ప్లే ఆఫ్‌కు చేరినా... ముంబై చేతిలో ఓటమితో కంగుతింది. కానీ భీకరమైన ఫామ్‌లో ఉన్న బెంగళూరును క్వాలిఫయర్-2లో ఓడించి మరోసారి ముంబైకి సవాల్ విసురుతోంది. ఎవరు గెలిచినా ఈ మ్యాచ్ ఆసక్తికరంగా సాగడం మాత్రం ఖాయం. అన్ని విభాగాల్లో ఫామ్‌లో... ముంబై ఇండియన్స్ జట్టు అన్ని విభాగాల్లోనూ భీకరమైన ఫామ్‌లో ఉంది. ముఖ్యంగా ఓపెనర్లు సిమ్మన్స్, పార్థీవ్ పటేల్ సంచలన ఆటతీరుతో జట్టుకు అద్భుతమైన భాగస్వామ్యాలు అందిస్తున్నారు. లీగ్ ఆరంభ దశలో బాగా ఆడిన రోహిత్ శర్మ ఆ తర్వాత కాస్త తడబడ్డాడు. అయితే ఈడెన్ అతనికి బాగా కలిసొచ్చిన మైదానం. ఇక్కడే కెప్టెన్‌గా తొలిసారి 2013లో ఐపీఎల్ టైటిల్ అందుకున్నాడు. అలాగే వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరునూ ఇక్కడే నమోదు చేశాడు. ఈ ఏడాది ఆరంభ మ్యాచ్‌లో కోల్‌కతాపై అద్భుతంగా ఆడి సెంచరీకి చేరువలో ఆగాడు. కాబట్టి ఈ వేదికపై రోహిత్ ఆత్మవిశ్వాసంతో ఆడటం ఖాయం. అంబటి రాయుడు, యువ సంచలనం హార్దిక్ పాండ్యలతో పాటు పొలార్డ్ కూడా చెలరేగితే ముంబై భారీ స్కోరు సాధించడం ఖాయం. ఇక బౌలింగ్‌లో మెక్లీనగన్, మలింగ ఇద్దరూ అద్భుతంగా రాణిస్తున్నారు. గత సీజన్లో కోల్‌కతా తరఫున ఆడిన వినయ్ కుమార్ ఈసారి ముంబై తరఫున తన ఈడెన్ అనుభవాన్ని ఉపయోగించనున్నాడు. స్పిన్నర్ హర్భజన్ భారత జట్టులో పునరాగమనంతో రెట్టించిన ఉత్సాహంతో ఉన్నాడు. లెఫ్టార్మ్ స్పిన్నర్ సుచిత్ కూడా టోర్నీలో గణనీయమైన ప్రభావం చూపించాడు. మొత్తం మీద ముంబై జట్టు అన్ని విభాగాల్లో సమతూకంతో, మంచి ఫామ్‌లో ఉంది. రైనా, స్మిత్ రాణించాలి చెన్నై సీజన్లో నిలక డగా విజయాలు సాధించడానికి కారణం ఓపెనర్లు. మెకల్లమ్, డ్వేన్ స్మిత్‌ల సంచలన ఆరంభాలు ఆ జట్టును విజయాల బాటలో నడిపించాయి. అయితే మెకల్లమ్ వెళ్లిపోయాక ఆ లోటు కనపడకుండా మైక్ హస్సీ తన అనుభవాన్ని ఉపయోగించి ఆడుతున్నాడు. కానీ డ్వేన్ స్మిత్ ఫామ్ కోల్పోవడం చెన్నైని ఆందోళనలో పడేస్తోంది. ఇక సురేశ్ రైనా కూడా ఈ సీజన్లో ఒక్కసారి కూడా తన మార్క్ ఇన్నింగ్స్ ఆడలేదు. రైనా, స్మిత్ గాడిలో పడితే మాత్రం ఎలాంటి ప్రత్యర్థి అయినా భయపడాల్సిందే. డుప్లెసిస్‌తో పాటు ఆల్‌రౌండర్లు బ్రేవో, జడేజా, పవన్ నేగి కూడా రాణించాల్సి ఉంది. కెప్టెన్ ధోని ఫామ్ గురించి ఆందోళన లేదు. అయితే ఈ సీజన్లో ఇప్పటివరకూ చెన్నై మిడిలార్డర్ ఆకట్టుకోలేకపోయింది. చావోరేవో తేల్చుకోవాల్సిన ఈ మ్యాచ్‌లో అయినా మిడిలార్డర్ గాడిలో పడాలి. ఇక బౌలింగ్‌లో నెహ్రా, డ్వేన్ బ్రేవో ఇద్దరూ పోటాపోటీగా వికెట్లు తీస్తున్నారు. మోహిత్ శర్మ, అశ్విన్‌ల నుంచి వీరికి కావలసిన సహకారం లభిస్తోంది. జడేజా, నేగి కలిసి ఐదో బౌలర్ కోటాను పూర్తి చేస్తున్నారు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో డ్వేన్ బ్రేవో బౌలింగ్ కీలకం. ధోని వ్యూహాలతో ఫామ్‌లో ఉన్న బెంగళూరును ఓడించి ఫైనల్‌కు చేరిన చెన్నై... మరోసారి తమ కెప్టెన్ వ్యూహాలపై నమ్మకంతో ఆత్మవిశ్వాసంతోనే ఫైనల్ ఆడబోతోంది. జట్లు(అంచనా) చెన్నై సూపర్ కింగ్స్ : ధోని (కెప్టెన్), డ్వేన్ స్మిత్, మైక్ హస్సీ, సురేశ్ రైనా, డుప్లెసిస్, డ్వేన్ బ్రేవో, రవీంద్ర జడేజా, పవన్ నేగి, అశ్విన్, ఆశిష్ నెహ్రా, మోహిత్ శర్మ. ముంబై ఇండియన్స్ : రోహిత్ శర్మ (కెప్టెన్), సిమ్మన్స్, పార్థీవ్ పటేల్, అంబటి రాయుడు, పొలార్డ్, హార్దిక్ పాండ్య, సుచిత్, హర్భజన్ సింగ్, వినయ్ కుమార్, మెక్లీనగన్, లసిత్ మలింగ. ఆసక్తికర సమరం సహజంగానే ఈడెన్ గార్డెన్స్ పిచ్ స్పిన్‌కు సహకరిస్తుంది. అందుకే ఈ సీజన్లో కోల్‌కతా తమ జట్టును స్పిన్నర్లతో నింపేసింది. ఫైనల్ కోసం కొత్త ట్రాక్‌ను వినియోగిస్తున్నామని, దీనిపై బౌన్స్ కూడా బాగానే ఉంటుందని క్యూరేటర్ చెబుతున్నారు. కాబటి ఆఫ్ స్పిన్నర్లు అశ్విన్, హర్భజన్ ఇద్దరూ చాలా కీలకం. ఇద్దరూ బంగ్లాదేశ్ వెళ్లే టెస్టు జట్టులో ఉన్నారు. కాబట్టి ఈ మ్యాచ్‌లో బాగా రాణించిన వాళ్లు తుది జట్టులో కచ్చితంగా ఉంటారు. 3 ముంబై రెండుసార్లు ఫైనల్‌కు చేరి ఒక్కసారి టైటిల్ గెలిచింది. రెండుసార్లు కూడా చెన్నైతోనే ఫైనల్లో ఆడింది. 2010లో చెన్నై చేతిలో 22 పరుగులతో ఓడి, 2013లో 23 పరుగులతో గెలిచింది. మూడోసారి కూడా ఫైనల్ చెన్నైతోనే ఆడబోతోంది. 6 చెన్నై జట్టు ఫైనల్‌కు చేరడం ఇది ఆరోసారి. గతంలో ఫైనల్‌కు చేరిన ఐదుసార్లలో రెండు సార్లు ధోనిసేన టైటిల్ గెలిచింది. -
ధోనీ నాయకత్వమే..
కోల్ కతా: ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ సక్సెక్ కు మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వమే కారణమని సహచర ఆటగాడు సురేష్ రైనా అభిప్రాయపడ్డాడు. గత ఎనిమిది ఎడిషన్లలో చెన్నై నిలకడగా ఆడటం వెనుక ధోనీదే ప్రధాన భూమిక అని స్పష్టం చేశాడు. శుక్రవారం బెంగళూర్ రాయల్ చాలెంజర్స్ పై చెన్నై మూడు వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్ కు చేరిన అనంతరం ధోనీపై రైనా ప్రశంసల వర్షం కురిపించాడు. 'ధోనీ నిలకడైన కెప్టెన్. ఆ కెప్టెన్ చెన్నై కు ఉండటం అదృష్టం. ఎనిమిది ఐపీఎల్ సీజన్ లలో ఆరుసార్లు ఫైనల్ కు వెళ్లడమే ఇందుకు ఉదాహరణ' అని రైనా తెలిపాడు. అయితే మరోసారి ముంబై ఇండియన్స్ తో తుదిపోరుకు సిద్ధమవుతున్నట్లు రైనా తెలిపాడు. 2013లో ముంబై ఇండియన్స్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ ను చేజార్చుకున్న సంగతి ఇంకా తమ మదిలో ఉందని రైనా తెలిపాడు. -
ఆటగాళ్ల గదుల్లో అమ్మాయిలు
►2014 ఐపీఎల్లో ఇద్దరు చెన్నై క్రికెటర్ల నిర్వాకం ►యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన ►పార్టీలతో ఓనర్ల సరదా గతేడాది ఐపీఎల్ చాలా ‘జాగ్రత్తగా’ జరిగింది. 2013లో స్పాట్ ఫిక్సింగ్ ఉదంతం నేపథ్యంలో 2014 సీజన్లో టోర్నీ నిర్వహణ కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. టోర్నీ నిర్వహణ బాధ్యత గవాస్కర్‌కు అప్పగించారు. అడుగడుగునా అవినీతి నిరోధక అధికారులను ఏర్పాటు చేశారు. అయినా క్రికెటర్లు వీటిని లెక్కచేయలేదు. యథేచ్ఛగా నిబంధనలను ఉల్లంఘించారు. ఇద్దరు చెన్నై క్రికెటర్లు తమ గదుల్లో అమ్మాయిలతో రాత్రంతా గడిపారు. అటు యజమానులు కూడా క్రికెటర్లను పార్టీల పేరుతో బయటివాళ్లను కలవనిచ్చారు. గత సీజన్లో జరిగిన ఇలాంటి సంఘటనల గురించిన వివరాలు తాజాగా బయటకొచ్చాయి. ముంబై : గత ఏడాది ఐపీఎల్ (2014) పూర్తిగా విజయవంతమైందని, ఆట తప్ప మరో అంశం గురించి ఎక్కడా చర్చే జరగలేదని లీగ్ నిర్వాహకులు గర్వంగా చెప్పుకున్నారు. అయితే ఐపీఎల్‌నుంచి వివాదాలను దూరంగా ఉంచడం అంత సులువు కాదని గతేడాది జరిగిన కొన్ని ఘటనలు రుజువు చేశాయి. కోర్టు ఆదేశాల కారణంగా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ నేతృత్వంలో ఐపీఎల్-7 జరిగింది. కానీ మైదానం బయటి సంఘటనలు మాత్రం ఆయన దృష్టికి చేరినట్లు లేదు. పార్టీలు కావచ్చు లేదా హోటల్ గదిలో సరసాలు కావచ్చు లేదా ఆటగాళ్ల చుట్టూ ఏజెంట్ల హల్చల్ కావచ్చు... ఇలాంటి పలు ఘటనలను బీసీసీఐ అవినీతి నిరోధక భద్రతా బృందం(ఏసీఎస్‌యూ) గుర్తించింది. ఈ వివరాలతో ఏసీఎస్‌యూ చీఫ్ రవి సవాని, బీసీసీఐకి లేఖ రాశారు. అడుగడుగునా సాగిన నిబంధనల ఉల్లంఘనను గుర్తు చేస్తూ సవాని గత ఐపీఎల్ సమయంలోనే పంపిన మెయిల్ ఇప్పుడు బయటకొచ్చింది. గత ఏడాది ఐపీఎల్ అవినీతిపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలోనే ఇవి చోటు చేసుకున్నాయి. అయితే దీనిపై ఏసీఎస్‌యూ ఆయా ఫ్రాంచైజీల వివరణ కోరిందని, దాంతో తాము సంతృప్తి చెందినట్లు కూడా బోర్డు ప్రకటించడం విశేషం! ఈ ఘటనల గురించి పంపిన మెయిల్‌పై పంజాబ్, ఢిల్లీ యాజమాన్యాలు వివరణ ఇవ్వగా, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్ యాజమాన్యాలు మాత్రం స్పందించలేదు. పంజాబ్ జట్టు సభ్యుల కోసం యజమాని ప్రీతి జింటా ముంబై సముద్ర తీరంనుంచి 2 కిలోమీటర్ల ఆవల పడవలో పార్టీ ఇచ్చింది. ఆమె మిత్రులు కొంత మంది దీనిని ఏర్పాటు చేశారు. అయితే 2013లో బెట్టింగ్‌కు సంబంధించి ఏసీఎస్‌యూ విచారించిన జాబితాలో ఉన్నవారే ఈ పార్టీ ఇవ్వడం గమనార్హం. కోల్‌కతా జట్టు కోసం షారుఖ్ ఖాన్ మిత్రులు కొందరు పార్టీ ఇచ్చారు. ఇది కూడా నిబంధనలకు విరుద్ధం. ఢిల్లీ జట్టు స్పాన్సరర్ ఒకరు టీమ్ కోసం ఇచ్చిన పార్టీలో 100 మందికి పైగా బయటి వ్యక్తులు హాజరై ఆటగాళ్లతో ఆత్మీయంగా కలిసిపోయారు. దీనిపై ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వని ఢిల్లీ... అతిథుల జాబితా కూడా ఇవ్వలేదు. ముంబైలోని ఒక హోటల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడితో ఒక అమ్మాయి రాత్రి 10 గంటలనుంచి ఉదయం 6 గంటల వరకు గడిపింది. విచారిస్తే ‘ఆమె నాకు మంచి స్నేహితురాలు’ అని మాత్రమే సదరు ఆటగాడు చెప్పాడు. చెన్నై సూపర్ కింగ్స్‌కే చెందిన మరో క్రికెటర్‌తో కూడా మరో అమ్మాయి ఇలాగే రాత్రినుంచి ఉదయం వరకు అతని గదిలోనే ఉంది. దీనిపై ప్రశ్నకు...‘ఆమె తనకు బాగా సన్నిహితురాలని, త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నామని’ ఆ ఆటగాడు చెప్పాడు. అయితే గతంలోనూ ఆ అమ్మాయి శ్రీశాంత్ సహా పలువురు ఐపీఎల్ క్రికెటర్లతో సన్నిహితంగా మెలిగినట్లు, 2013లో ఆమెకు అక్రిడిటేషన్ కార్డు కూడా దక్కినట్లు ఏసీఎస్‌యూ విచారణలో వెల్లడైంది. ఇద్దరు సన్‌రైజర్స్ ఆటగాళ్లు ఏ నగరంలో ఉన్నా... వారి హోటల్ గదుల్లోకి వచ్చే సందర్శకుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండేది. పంజాబ్ జట్టులోని ఒక సీనియర్ విదేశీ ఆటగాడి మిత్రుడు అతనితో పాటు గదిలో ఉన్నాడు. జట్టు ప్రాక్టీస్ సెషన్లలో తరచుగా కనిపించిన అతను టీమ్ బస్సులో కూడా ప్రయాణించాడు. ప్లేయర్ ఏజెంట్లు ఆటగాళ్ల హోటల్లోనే ఉంటూ నిబంధనలు ఉల్లంఘించారు. రక్త సంబంధీకులు/భార్య మినహా మరెవరూ అదే హోటల్లో బస చేయరాదు. కొంతమంది ఆటగాళ్లు మ్యాచ్ కోసం తమ సొంత నగరాలకు వచ్చినప్పుడు రాత్రికి తమ ఇళ్లకు వెళ్లిపోయేవారు. దీని వల్ల వారు బయట ఏం చేస్తున్నారో నిఘా పెట్టడం ఏసీఎస్‌యూకు సాధ్యం కాలేదు. -
ఫైనల్లో చెన్నై
-
కాచుకో... ముంబై
►ఐపీఎల్ ఫైనల్లో చెన్నై సూపర్‌కింగ్స్ ►నెహ్రా సూపర్ బౌలింగ్ ►క్వాలిఫయర్-2లో బెంగళూరుపై విజయం ►ఫైనల్లో రేపు ముంబై ఇండియన్స్‌తో ధోని సేన అమీతుమీ ధోని వ్యూహాల ముందు కోహ్లి దూకుడు పనిచేయలేదు. బెంగళూరు భారీ హిట్టర్లంతా... చెన్నై బౌలర్ల క్రమశిక్షణకు చేష్టలుడిగారు. గేల్, కోహ్లి, డివిలియర్స్ త్రయం కీలక మ్యాచ్‌లో విఫలం కావడంతో... క్వాలిఫయర్-2లో చెన్నై గెలిచింది. ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ధోనిసేన కాస్త తడబడ్డా నిలబడింది. రాయల్ చాలెంజర్స్‌పై నెగ్గిన సూపర్ కింగ్స్... ఇక ముంబై ఇండియన్స్‌తో రేపు జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనుంది. రాంచీ : మొదట్లో... ఆఖర్లో కాస్త తడబడినా... మైక్ హస్సీ (46 బంతుల్లో 56; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ధోని (29 బంతుల్లో 26; 1 ఫోర్)ల సమయోచిత బ్యాటింగ్‌తో చెన్నై సూపర్‌కింగ్స్ ఐపీఎల్ ఫైనల్‌కు చేరింది. పటిష్టమైన బెంగళూరుకు పగ్గాలు వేసి ముంబైతో అమీతుమీకి సిద్ధమైంది. బ్యాటింగ్ వైఫల్యంతో ఇబ్బందులు ఎదుర్కొన్న కోహ్లిసేన కీలక మ్యాచ్‌లో తడబడింది. దీంతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై 3 వికెట్ల తేడాతో బెంగళూరుపై నెగ్గింది. ఫలితంగా ఎనిమిది సీజన్లలో ఆరోసారి ఫైనల్‌కు చేరుకుంది. జేఎస్సీఏ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో... మొదట బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లకు 139 పరుగులు చేసింది. గేల్ (43 బంతుల్లో 41; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), సర్ఫరాజ్ (21 బంతుల్లో 31; 4 ఫోర్లు), దినేశ్ కార్తీక్ (26 బంతుల్లో 28; 4 ఫోర్లు) రాణించారు. తర్వాత చెన్నై 19.5 ఓవర్లలో 7 వికెట్లకు 140 పరుగులు చేసి నెగ్గింది. నెహ్రాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఒకే ఓవర్లో కోహ్లి, డివిలియర్స్... టాస్ గెలిచి ధోని బౌలింగ్ తీసుకున్నాడు. అయితే తొలి మూడు ఓవర్లలో ఓపెనర్లు గేల్, కోహ్లి (9 బంతుల్లో 12; 1 ఫోర్, 1 సిక్స్) వేగం గా పరుగులు చేశారు. కానీ ఐదో ఓవర్లో నెహ్రా... కోహ్లితో పాటు డివిలియర్స్ (1)నూ అవుట్ చేయడంతో ఆర్సీబీ ఇన్నింగ్స్ తడబడింది. దీంతో పవర్‌ప్లేలో బెంగళూరు 2 వికెట్లకు 29 పరుగులతోనే సరిపెట్టుకుంది. మన్దీప్ (4) నిరాశపర్చినా...గేల్, దినేశ్ కార్తీక్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. రైనా వేసిన 14వ ఓవర్లో రెండు భారీ సిక్సర్లు కొట్టిన ఈ కరీబియన్ స్టార్ నాలుగో వికెట్‌కు కార్తీక్‌తో 44 పరుగులు జోడించి అవుటయ్యాడు. తర్వాత సర్ఫరాజ్ వేగంగా ఆడినా.. రెండో ఎండ్‌లో వరుస విరామాల్లో కార్తీక్, వీస్ (12), హర్షల్ పటేల్ (2)లు అవుటయ్యారు. కార్తీక్, సర్ఫరాజ్‌లు ఐదో వికెట్‌కు 27 పరుగులు జోడించారు. తొలి 10 ఓవర్లలో 46 పరుగులు చేసిన బెంగళూరు చివరి 10 ఓవర్లలో 93 పరుగులు చేసింది. నెహ్రా మూడు వికెట్లు తీశాడు. హస్సీ యాంకర్ పాత్ర ఓపెనర్లలో స్మిత్ (12 బంతుల్లో 17; 3 ఫోర్లు) తొందరగా అవుటైనా... హస్సీ నిలకడగా ఆడాడు. వన్‌డౌన్‌లో డుప్లెసిస్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను క్రమంగా నిర్మించాడు. ఈ ఇద్దరు రెండో వికెట్‌కు 40 పరుగులు జోడించాకా... స్పిన్నర్ చాహల్ చెన్నైని దెబ్బతీశాడు. మూడు బంతుల తేడాలో డు ప్లెసిస్, రైనా (0)ను అవుట్ చేశాడు. దీంతో తొలి 10 ఓవర్లలో సూపర్‌కింగ్స్ 3 వికెట్లకు 62 పరుగులు చేసింది. అయితే హస్సీతో జతకలిసిన కెప్టెన్ ధోని సమయోచిత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. స్ట్రయిక్‌ను రొటేట్ చేస్తూ అవసరమైనప్పుడు భారీ షాట్లు ఆడారు. చివరి ఐదు ఓవర్లలో 49 పరుగులు చేయాల్సిన దశలో హస్సీ రెండు భారీ సిక్సర్లు కొట్టి అవుటయ్యాడు. ఈ ఇద్దరు నాలుగో వికెట్‌కు 47 పరుగులు జోడించారు. తర్వాత నేగి (12) కూడా చెలరేగి ఆడాడు. అయితే 12 బంతుల్లో 13 పరుగులు చేయాల్సిన దశలో వరుస బంతుల్లో నేగి, బ్రేవో (0) అవుటయ్యారు. ఇక 6 బంతుల్లో 5 పరుగులు కావాల్సిన సమయంలో ధోని నాలుగు పరుగులు చేసి అవుటైనా... అశ్విన్ (1 నాటౌట్) విజయాన్ని పూర్తి చేశాడు. చాహల్ 2 వికెట్లు తీశాడు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్ : గేల్ (సి అండ్ బి) రైనా 41; కోహ్లి (సి) మోహిత్ (బి) నెహ్రా 12; డివిలియర్స్ ఎల్బీడబ్ల్యు (బి) నెహ్రా 1; మన్దీప్ (సి) హస్సీ (బి) అశ్విన్ 4; దినేశ్ కార్తీక్ (సి) మోహిత్ (బి) నెహ్రా 28; సర్ఫరాజ్ (సి) నేగి (బి) బ్రేవో 31; వీస్ (సి) బ్రేవో (బి) మోహిత్ 12; హర్షల్ రనౌట్ 2; స్టార్క్ నాటౌట్ 1; శ్రీనాథ్ అరవింద్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 139. వికెట్ల పతనం : 1-23; 2-25; 3-36; 4-80; 5-107; 6-125; 7-138; 8-139. బౌలింగ్ : నెహ్రా 4-0-28-3; అశ్విన్ 4-0-13-1; మోహిత్ 4-0-22-1; రైనా 3-0-36-1; బ్రేవో 3-0-21-1; నేగి 1-0-4-0; జడేజా 1-0-13-0. చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్ : స్మిత్ (సి) స్టార్క్ (బి) అరవింద్ 17; హస్సీ (సి) పటేల్ (బి) వీస్ 56; డు ప్లెసిస్ (బి) చాహల్ 21; రైనా (సి) వీస్ (బి) చాహల్ 0; ధోని (సి) కార్తీక్ (బి) పటేల్ 26; నేగి రనౌట్ 12; బ్రేవో (బి) స్టార్క్ 0; జడేజా నాటౌట్ 0; అశ్విన్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం: (19.5 ఓవర్లలో 7 వికెట్లకు) 140. వికెట్ల పతనం : 1-21; 2-61; 3-61; 4-108; 5-135; 6-135; 7-139. బౌలింగ్ : స్టార్క్ 4-0-27-1; అరవింద్ 4-0-25-1; హర్షల్ పటేల్ 3.5-0-26-1; వీస్ 4-0-30-1; చాహల్ 4-0-28-2. -
ప్రభుత్వం అనుమతిస్తేనే...
భారత ప్రభుత్వం అనుమతిస్తేనే పాకిస్తాన్‌తో క్రికెట్ సిరీస్ పునరుద్ధరిస్తామని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా చెప్పారు. పాక్ బోర్డుతో పరిష్కరించుకోవాల్సిన అంశాలు కూడా చాలా ఉన్నందున ఇప్పట్లో సిరీస్ జరగడం కష్టమేనని చెప్పారు. -
ఫైనల్లో చెన్నై
రాంచీ:ఇద్దరు టీమిండియా కెప్టెన్ల మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో విరాట్ కోహ్లీపై మహేంద్ర సింగ్ ధోనీ పైచేయి సాధించాడు.ఐపీఎల్-8లో భాగంగా ఇక్కడ బెంగళూర్ రాయల్ చాలెంజర్స్ తో జరిగిన క్వాలిఫయర్-2లో చెన్నై సూపర్ కింగ్స్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్ కు చేరింది. బెంగళూర్ నిర్దేశించిన 140 పరుగుల విజయలక్ష్యాన్ని ఒక బంతి మాత్రమే మిగిలి ఉండగానే మాత్రమే ఛేదించిన చెన్నై.. ముంబై ఇండియన్స్ తో తుదిపోరుకు సిద్ధమైంది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై 61పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. డ్వేన్ స్మిత్(17),డుప్లెసిస్(21),సురేష్ రైనా(0) పెవిలియన్ కు చేరి చెన్నైను ఆందోళనకు గురిచేశారు. ఆ తరుణంలో మైక్ హస్సీ చూడచక్కని ఆటతో ఆకట్టుకున్నాడు. గత మ్యాచ్ ల్లో విఫలమై అనేక విమర్శలు ఎదుర్కొన్న హస్సీ కీలక సమయంలో ఫామ్ లో కి వచ్చి జట్టు విజయంలో సహకరించాడు. హస్సీ(46 బంతుల్లో 56;రెండు సిక్సర్లు, మూడు ఫోర్లు) చెలరేగి ఆడి నాల్గో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. అప్పటికే చెన్నై దాదాపు ఖరారైంది. అయితే చివర్లో నేగీ(11), ధోనీ(26)లు వరుసగా పెవిలియన్ కు చేరి మరోసారి ఆందోళనకు గురి చేశారు. ఇంకా రెండు బంతుల్లో ఒక పరుగు చేయాల్సిన సమయంలో ధోనీ పెవిలియన్ చేరినా.. అశ్విన్ ఇన్నింగ్స్ ముగింపు షాట్ ను కొట్టి చెన్నై ఫైనల్ కు చేర్చాడు. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన బెంగళూర్ రాయల్ చాలెంజర్స్ 140 పరుగుల విజయలక్ష్యాన్ని ప్రత్యర్థికి నిర్దేశించింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ(12) , ఏబీ డివిలియర్స్ (1) వెనువెంటనే వికెట్లను చేజార్చుకుని బెంగళూర్ ను ఆదిలోనే కష్టాల్లో నెట్టారు. అటుతరువాత బెంగళూర్ 36 పరుగుల వద్ద ఉండగా మన్ దీప్(4)ను కూడా నష్టపోవడంతో జట్టు స్కోరు మందగించింది. అయితే క్రిస్ గేల్ కాసేపు మెరుపులు మెరిపించడంతో బెంగళూర్ మధ్యలో పుంజుకుంది.గేల్(41) బ్యాట్ వేగం పెంచే క్రమంలో రైనా బౌలింగ్ లో పెవిలియన్ కు చేరాడు. ఆ తరువాత దినేష్ కార్తీక్ కు జతకలిసిన సర్ఫరాజ్ ఇన్నింగ్స్ ను మరమ్మత్తులు చేశాడు. కాగా, దినేశ్ కార్తీక్ (28) భారీ షాట్ కు యత్నించి నెహ్రా బౌలింగ్ లో అవుటైయ్యాడు. ఆ తరుణంలో సర్ఫరాజ్(31) ఆదుకోవడంతో బెంగళూర్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది.