ఐపీఎల్ విజేత ముంబై
కోల్ కతా:ఐపీఎల్-8 ట్రోఫీని ముంబై ఇండియన్స్ కైవసం చేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ తో ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో ముంబై ఇండియన్స్ 41 పరుగుల తేడాతో విజయం సాధించి టైటిల్ ను చేజిక్కించుకుంది. 203 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై బ్యాటింగ్ లో తడబడి ఓటమి పాలైంది. చెన్నై ఆటగాళ్లలో డ్వేన్ స్మిత్(57)హాఫ్ సెంచరీ మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. మైక్ హస్సీ,(4), సురేష్ రైనా(28), బ్రేవో(9), మహేంద్ర సింగ్ ధోనీ(18) లు విఫలం చెందడంతో నిర్ణీత ఓవర్లలో8 వికెట్లు కోల్పోయి 161 పరుగులకే పరిమితమైన చెన్నై ఓటమి చెందింది. ఆద్యంతం ఏకపక్షంగా సాగిన కీలక పోరులో ఘనవిజయం సాధించిన ముంబై ఇండియన్స్ రెండో సారి ట్రోఫీని దక్కించుకోగా.. చెన్నై ఆరోసారి ఫైనల్లో చతికిలబడింది. ఇరు జట్లు మూడు సార్లు ఫైనల్లో తలపడగా.. ముంబై రెండు సార్లు పైచేయి సాధించింది. ముంబై బౌలర్లలో మెక్ లెనగాన్ మూడు, మలింగా, హర్భజన్ సింగ్ లు తలో రెండు వికెట్లు తీసి గెలుపులో కీలక పాత్ర పోషించారు.
ముందు టాస్ గెలిచిన చెన్నై.. ముంబైను బ్యాటింగ్ ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన ముంబై 20ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది. పార్దీవ్ పటేల్ డకౌట్ రూపంలో ఆదిలో వెనుదిరిగినా.. కెప్టెన్ రోహిత్ శర్మ(50), సిమ్మన్స్(68) అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుని ముంబై భారీ స్కోరు చేయడంలో సహకరించారు. ఇరువురూ కలిసి రెండో వికెట్ కు 119 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అయితే ఈ ఇద్దరు 120 పరుగుల వద్ద నిష్ర్కమించడంతో ముంబై స్కోరు కాస్త మందగించింది. అయితే మధ్యలో పొలార్డ్(36), అంబటి రాయుడు (36)పరుగులతో ఆకట్టుకున్నారు.