
డామిట్...కథ అడ్డం తిరిగింది
ఆ నాలుగు జట్లదీ స్వయంకృతం నిలకడలేమి ప్రధాన సమస్య జట్ల ఎంపికలోనూ తప్పులు
ఐపీఎల్‌లో లీగ్ దశ ముగిసింది. గతేడాది ఫైనలిస్ట్‌లు కోల్‌కతా నైట్‌రైడర్స్, పంజాబ్ కింగ్స్ ఎలెవన్‌లతో పాటు ఢిల్లీ డేర్‌డెవిల్స్, సన్‌రైజర్స్ జట్లు తట్టాబుట్టా సర్దుకున్నాయి. ఈ నాలుగు జట్లలో కోల్‌కతా, హైదరాబాద్ ఆఖరి మ్యాచ్ ఫలితం వచ్చే వరకూ రేసులో ఉన్నాయి. కానీ ఢిల్లీ, పంజాబ్ కాస్త తొందరగానే వైదొలిగాయి. అసలు ఈ నాలుగు జట్లు చేసిన తప్పులేంటి? బాగా ఆడలేదా? లేక వ్యూహాలు దెబ్బతీశాయా? లీగ్ దశతోనే సరిపెట్టుకున్న నాలుగు జట్లపై సమీక్ష.
సన్‌రైజర్స్ హైదరాబాద్
ఈ ఏడాది ఆరంభంలో 11 మంది పాత ఆటగాళ్లను వదిలేసిన సన్‌రైజర్స్ పది మంది కొత్తవారిని చేర్చుకుంది. వార్నర్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించి కొత్త ఉత్సాహంతో బరిలోకి దిగింది. ఆరంభంలో బాగా తడబడింది. వైజాగ్‌లో ఆడిన మూడు హోమ్ మ్యాచ్‌లలో రెండు ఓడిపోయింది. తొలి ఆరు మ్యాచ్‌ల్లో నాలుగింట ఓటమి ఎదురైంది. దీంతో ఈ జట్టు ప్లే ఆఫ్‌కు చేరడం కష్టమే అనిపించింది. అయితే ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుంది. వార్నర్‌తో పాటు మోర్గాన్, హెన్రిక్స్ బ్యాట్ ఝళిపించడంతో మూడు వరుస విజయాలతో ప్లే ఆఫ్‌కు చేరువైంది. ఆఖరి రెండు మ్యాచ్‌ల్లో ఒక్కటి గెలిచినా ప్లే ఆఫ్‌కు వెళ్లే స్థితిలో హైదరాబాద్‌లో ఆడిన చివరి రెండు హోమ్ మ్యాచ్‌లలోనూ ఓడిపోయి నిరాశను మూటగట్టుకుంది.
ఒక్కడిపైనే భారం
ఈ సీజన్ అంతా పూర్తిగా కెప్టెన్ వార్నర్ ఒక్కడే బ్యాటింగ్ భారం మోయాల్సి వచ్చింది. ఏడు మ్యాచ్‌లు గెలిస్తే అందులో నాలుగింట వార్నర్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. శిఖర్ ధావన్ ఫర్వాలేదనిపించినా... మిడిలార్డర్ వైఫల్యం దారుణంగా దెబ్బ తీసింది. దేశవాళీ క్రికెటర్లలో మంచి హిట్టర్ లేకపోవడం ఈ జట్టుకు పెద్ద మైనస్ పాయింట్.
‘అకాడమీ’లా ఉన్నా...
బౌలింగ్ విషయంలో సన్‌రైజర్స్‌కు ఓ పెద్ద అకాడమీయే ఉంది. స్టెయిన్ జట్టులో ఉండగానే బౌల్ట్‌ను తెచ్చారు. ఈ ఇద్దరిలో ఎవరిని తుది జట్టులో ఆడించాలో తెలియని అయోమయంతోనే సీజన్ అయిపోయింది. దేశవాళీ బౌలర్లలో భువనేశ్వర్ మినహా అందరూ విఫలమే. ముఖ్యంగా ఇషాంత్ శర్మ ప్రత్యర్థులకు పరుగులు ఇవ్వడానికే జట్టులో ఉన్నట్లు కనిపించాడు. గత రెండు సీజన్లలో సంచలన ప్రదర్శన చూపించిన కరణ్‌శర్మ ఈసారి దారుణంగా విఫలమయ్యాడు.
మొత్తం మీద సరైన జట్టు కూర్పు లేకపోవడం ఈ జట్టుకు ప్రధాన సమస్య. వచ్చే సీజన్‌కైనా ఒకరిద్దరు దేశవాళీ హిట్టర్స్‌ను జట్టులోకి తేవడం అవసరం.
కోల్‌కతా నైట్‌రైడర్స్
విజయంతోనే సీజన్‌ను ఆరంభించిన డిఫెండింగ్ చాంపియన్ ఆరంభ దశలో బాగానే ఆడింది. వర్షం కారణంగా సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో ఓడిపోవడం, ఆ వెంటనే రాజస్తాన్‌తో మ్యాచ్ రద్దు కావడంతో ఈ జట్టు లయను దెబ్బతీసింది. దీనికి తోడు స్పిన్నర్ సునీల్ నరైన్ టోర్నీ మధ్యలో మరోసారి అనుమానాస్పద బౌలింగ్ శైలి కారణంగా పరీక్షను ఎదుర్కొన్నాడు. అయితే తిరిగి పుంజుకుని వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గెలిచి... ఆఖరి రెండు మ్యాచ్‌ల్లో ఒక్క పాయింట్ సాధించినా ప్లే ఆఫ్‌కు చేరే స్థితిలో పటిష్టంగా నిలిచింది. కానీ ముంబైలో వరుసగా చివరి రెండు మ్యాచ్‌లూ ఓడి ఇంటికి చేరింది.
బ్యాటింగ్ వైఫల్యం
కోల్‌కతా బలం దేశవాళీ బ్యాట్స్‌మన్. గంభీర్, ఉతప్ప, యూసుఫ్ పఠాన్, సూర్యకుమార్ యాదవ్, మనీష్ పాండే అందరూ మ్యాచ్ విన్నర్లే. గత సీజన్‌లో ఈ జట్టు టైటిల్ గెలవడంలో వీరిది కీలక పాత్ర. కానీ ఈ సారి ఏ ఒక్కరూ పూర్తి స్థాయిలో నిలకడ చూపలేకపోయారు. రస్సెల్ సరిగా ఆడకపోయుంటే పరిస్థితి దారుణంగా ఉండేది.
అంతమంది ఎందుకో?
ఈసారి కోల్‌కతా బృందంలో ఏకంగా ఏడుగురు స్పిన్నర్లు ఉన్నారు. ప్రతి మ్యాచ్‌లోనూ తుది జట్టులో ముగ్గురు లేదా నలుగురు బరిలోకి దిగారు. ఇంతమంది ఎందుకనేది అంతుచిక్కని వ్యూహం. బౌలర్లను రకరకాలుగా మార్చడం కూడా ప్రతికూల ఫలితాన్నిచ్చింది. ముఖ్యంగా చావోరేవో తేల్చుకోవాల్సిన ఆఖరి మ్యాచ్‌లో నరైన్‌ను ఎందుకు ఆడించలేదనేది పెద్ద మిస్టరీ.
ముంబై ఇండియన్స్‌తో లీగ్ మ్యాచ్‌లో చివరి ఓవర్లో బంతులు వృథా చేసిన పీయూష్ చావ్లా ఈ జట్టు కొంప ముంచాడు. వచ్చే సీజన్‌కు జట్టు కూర్పును సరిజేసుకోవాలి.
ఢిల్లీ డేర్‌డెవిల్స్
ఈ జట్టు బాధ వర్ణనాతీతం. గత ఏడాది పీటర్సన్, రాస్ టేలర్, విజయ్, కార్తీక్‌లాంటి ఖరీదైన ఆటగాళ్లతో ఆడి ఆఖరి స్థానంలో నిలిచిన ఢిల్లీ ఈ సారి భారీగా మార్పులు చేసింది. రూ.16 కోట్లతో యువరాజ్‌ను, రూ.7.5 కోట్లతో మాథ్యూస్‌ను తెచ్చుకుంది. డుమినిని కెప్టెన్‌గా ఎంపిక చేసి కొత్త జట్టుతో బరిలోకి దిగింది. కానీ ఫలితం మాత్రం పెద్దగా మారలేదు. గత సీజన్‌తో పోలిస్తే కాస్త అదనంగా మ్యాచ్‌లు గెలిచినా ప్లే ఆఫ్ రేసులో మాత్రం నిలవలేకపోయింది.
యువరాజ్ వైఫల్యం
భారీగా ఖర్చు చేసి యువరాజ్‌ను తీసుకోవడం వల్ల స్పాన్సర్లను ఢిల్లీ జట్టు ఆకర్షించింది. కానీ మైదానంలో మాత్రం యువరాజ్ పూర్తిగా నిరాశపరిచాడు. 14 మ్యాచ్‌ల్లో 248 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక్క మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ కూడా లేదు. యువ సంచలనం శ్రేయస్ అయ్యర్, డుమిని ఇద్దరూ నిలకడగా ఆడారు. మిగిలిన బ్యాట్స్‌మెన్ దాదాపుగా విఫలమయ్యారు. సౌరవ్ తివారీ, మనోజ్ తివారీలను సరిగ్గా ఉపయోగించుకోలేదు. ఆల్బీ మోర్కెల్ తొలి మ్యాచ్‌లోనే సంచలన ఇన్నింగ్స్ ఆడినా... మాథ్యూస్ కోసం త్యాగం చేయించారు.
బౌలింగ్ ఫర్వాలేదు
కౌల్టర్ నైల్, జహీర్ ఖాన్, ఇమ్రాన్ తాహిర్, అమిత్ మిశ్రాల రూపంలో ఢిల్లీ లైనప్ బాగానే ఉంది. అయితే బ్యాట్స్‌మెన్ నుంచి భారీ స్కోర్లు రాకపోవడంతో వీరిపై ఒత్తిడి పెరిగింది. దీనికి తోడు బౌలింగ్ లైనప్‌లో రకరకాల ప్రయోగాలు చేశారు.
జట్టు కూర్పు సరిగ్గా లేకపోవడం ఢిల్లీని దారుణంగా దెబ్బతీసింది. వచ్చే సీజన్‌కు కొంతమంది ఖరీదైన ఆటగాళ్లను వదిలేసి మళ్లీ వేలానికి వెళ్లే అవకాశం ఉంది.
పంజాబ్ కింగ్స్ ఎలెవన్
ఈ జట్టు ప్రస్థానం మరీ ఘోరం. గత ఏడాది ప్రతి ప్రత్యర్థినీ వణికించిన పంజాబ్ ఈసారి చేతులెత్తేసింది. గత సీజన్‌లో 14 మ్యాచ్‌లకు మూడు మాత్రమే ఓడిన పంజాబ్... ఈసారి 14 మ్యాచ్‌లకుగాను మూడు మాత్రమే గెలిచింది. జట్టు మొత్తం భారీ హిట్టర్లున్నా ఒక్కరు కూడా ఆకట్టుకోలేకపోయారు. మార్ష్, పెరీరాల సేవలను సరిగా వినియోగించుకోలేదు.
మ్యాక్స్‌వెల్‌కు ఏమైంది?
ఈ సీజన్‌లో అందరికంటే ఎక్కువ నిరాశపరిచింది మ్యాక్స్‌వెల్. 11 మ్యాచ్‌ల్లో కేవలం 145 పరుగులు మాత్రమే చేశాడు. సెహ్వాగ్ కూడా ఆకట్టుకోలేకపోయాడు. డేవిడ్ మిల్లర్ ఒక్కడే ఫర్వాలేదనిపించినా తనని బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోట్ చేయలేదు. ఐదో స్థానంలో వచ్చి ఇన్నింగ్స్‌ను సరిదిద్దడానికే అతనికి సమయం సరిపోయింది. తనని ప్రమోట్ చేసి ఉంటే బాగుండేది. ఇక బెయిలీ కూడా విఫలమయ్యాడు. భారీ అంచనాలతో మురళీ విజయ్‌ను తీసుకురావడం ప్రతికూలంగా మారింది. గత ఏడాది హిట్ పెయిర్ వోహ్రా, సెహ్వాగ్‌లలో ఒకరు విజయ్ కోసం త్యాగం చేయాల్సి వచ్చింది.
ఆ మెరుపులు మాయం
గత ఏడాది పంజాబ్ అద్భుత ప్రదర్శనకు కారణం సందీప్ శర్మ, అక్షర్ పటేల్, జాన్సన్‌ల బౌలింగ్. ఈసారి ఈ ముగ్గురూ విఫలమయ్యారు. అనురీత్ సింగ్ మినహా ఒక్క బౌలర్ కూడా ఆకట్టుకోలేదు. దారుణంగా విఫలమైనా... ఈ జట్టును తక్కువ అంచనా వేయలేం. వచ్చే సీజన్‌లో కీలక క్రికెటర్లు ఫామ్‌లోకి వస్తే మళ్లీ పుంజుకుం టుంది. కెప్టెన్ కాకపోతే బెయిలీ జట్టులో ఉండటానికి కూడా అన ర్హుడేమో. కాబట్టి కెప్టెన్సీ గురించి ఆలోచించాలి.