
టార్గెట్ ‘ప్లే ఆఫ్’
ఏడాది క్రితం ఉప్పల్ స్టేడియం సన్‌రైజర్స్, పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్. సన్ 205 పరుగుల భారీ స్కోరు సాధించింది.
సొంతగడ్డపై సన్‌రైజర్స్ సిద్ధం
►నేడు పంజాబ్‌తో మ్యాచ్
►ఫామ్‌లో హైదరాబాద్ జట్టు
ఐపీఎల్‌లో తొలి తొమ్మిది మ్యాచ్‌ల పాటు పడుతూ, లేస్తూ ముందుకు సాగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇప్పుడు కాస్త కుదురుకుంది. మొదటిసారి వరుసగా రెండు మ్యాచ్‌లు గెలవడంతో జట్టులో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇక లీగ్‌లో మిగిలిన మూడు మ్యాచ్‌లు కూడా సొంతగడ్డపైనే సన్ ఆడనుంది. రెండు మ్యాచ్‌లు గెలిస్తే ప్లే ఆఫ్ ఖాయం కాగల స్థితిలో ఇప్పుడు తొలి పోరుకు సిద్ధమైంది. మరోవైపు వరుస ఓటములతో కుంగిపోయిన బలహీన ప్రత్యర్థి ఏ మాత్రం పోటీనివ్వగలదో చూడాలి.
సాక్షి, హైదరాబాద్ : ఏడాది క్రితం ఉప్పల్ స్టేడియం సన్‌రైజర్స్, పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్. సన్ 205 పరుగుల భారీ స్కోరు సాధించింది. అయితే అప్పుడు భీకర ఫామ్‌లో ఉన్న పంజాబ్ మరో ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. అయితే ఇప్పుడు సీన్ మారింది. వరుస పరాజయాలతో కింగ్స్ ఎలెవన్ కుదేలు కాగా... హైదరాబాద్ ఒక్కసారిగా ఫామ్‌లోకి వచ్చింది.
ఇదే జోరులో పంజాబ్‌ను చిత్తు చేయాలని పట్టుదలగా ఉన్న రైజర్స్ ఏడో విజయంపై దృష్టి పెట్టింది. నేడు (సోమవారం) ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో పంజాబ్‌తో హైదరాబాద్ తలపడనుంది. ఇరు జట్లు కూడా శనివారం మ్యాచ్‌లు ఆడినందున ఆదివారం ఆటగాళ్లు ప్రాక్టీస్ చేయకుండా విశ్రాంతి తీసుకున్నారు.
అంతా ఫామ్‌లో...
టోర్నీలో హైదరాబాద్ ఓడినప్పుడు బౌలింగ్‌లో స్టెయిన్, బౌల్ట్‌ల గురించి తీవ్ర చర్చ జరిగింది. కానీ వీరిద్దరు లేకుండానే సన్ రెండు మ్యాచ్‌లు గెలిచిన సమయంలో ఈ ఇద్దరు పేసర్లను అంతా మర్చిపోయారు. వీరు లేకుండా సన్ బౌలింగ్ పటిష్టంగా కనిపిస్తోంది. ఫలితంగా రెండు మ్యాచ్‌లలోనూ జట్టు లక్ష్యం కాపాడుకోగలిగింది. భువనేశ్వర్, ఇషాంత్, ప్రవీణ్‌ల పేస్‌కు తోడు హెన్రిక్స్, బొపారా మీడియం పేస్ ఫలితాన్నిచ్చింది.
ఆల్‌రౌండర్లు కరణ్ శర్మ, రసూల్ గత మ్యాచ్‌లో తమ బాధ్యతను సమర్థంగా నిర్వర్తించారు. బ్యాటింగ్‌లో జట్టు ప్రధానంగా వార్నర్, ధావన్‌లపైనే ఆధారపడుతూ వచ్చింది. అయితే మోర్గాన్, హెన్రిక్స్‌లు ఆడిన ఇన్నింగ్స్‌లు బ్యాటింగ్‌పై ఉన్న భయాన్ని దూరం చేశాయి. కెప్టెన్‌గా కూడా వార్నర్ విజయవంతం అయ్యాడనే చెప్పవచ్చు. వీరంతా మరోసారి సమష్టిగా చెలరేగితే హైదరాబాద్ విజయం ఖాయం. తుది జట్టులో మార్పులు ఉండకపోవచ్చు కాబట్టి ఈ సారి హోం మ్యాచ్‌లో స్థానిక కుర్రాళ్లు విహారి, ఆశిష్ రెడ్డిలకు చోటు లభించే అవకాశం దాదాపుగా లేనట్లే.
పసలేని పంజాబ్...
కేవలం 2 విజయాలు... ఆడిన 11 మ్యాచ్‌లలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ దుస్థితి ఇది. గతేడాది ప్రత్యర్థి జట్లకు వణుకు పుట్టించి ఫైనల్ చేరిన బెయిలీ సేన ఈసారి బేలగా మారిపోయింది. మొహాలీలో జరిగిన మ్యాచ్‌లో సన్‌కు తలవంచిన ఆ జట్టు పరిస్థితిలో ఈ రెండు వారాల్లో పెద్దగా మార్పేమీ రాలేదు. ఒకరితో మరొకరు పోటీ పడుతూ విఫలమయ్యారు. ఎన్ని ప్రయత్నాలు చేసిన ఆ జట్టుకు విజయం దక్కడం లేదు. ఫలితంగా టీమ్‌లో ఒక్కసారిగా నిరుత్సాహం ఆవరించింది.
కోల్‌కతాతో గత మ్యాచ్‌లో ఎలాగోలా 183 పరుగులు చేయగలిగినా దానిని కాపాడుకోవడం పంజాబ్ వల్ల కాలేదు. అన్ని మ్యాచ్‌లలో కలిపి ఆ జట్టు బ్యాట్స్‌మెన్ కేవలం 4 అర్ధ సెంచరీలే నమోదు చేయడం పరిస్థితిని సూచిస్తోంది. తుది జట్టులో మార్పులు చేసినా, బ్యాటింగ్ ఆర్డర్ మార్చినా ఫలితంలో తేడా రావడం లేదు. బౌలింగ్‌లో మాత్రం అనురీత్ సింగ్, సందీప్ శర్మ, అక్షర్ పటేల్ ఆకట్టుకున్నారు.
మరో వైపు విజయ్, వోహ్రా, సాహా, మిల్లర్, బెయిలీల బ్యాటింగ్ బలం అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. వరుసగా విఫలమైన మ్యాక్స్‌వెల్ ఫామ్‌లోకి రావడం మాత్రం వారికి కాస్త ఊరటనిచ్చింది. మొత్తంగా బలాబలాలు చూస్తే పరిస్థితి అంతా సన్‌రైజర్స్‌కు అనుకూలంగానే కనిపిస్తోంది. పంజాబ్ గెలిస్తే అది సంచలనమే కావచ్చు.