ఫైనల్లో చెన్నై
రాంచీ:ఇద్దరు టీమిండియా కెప్టెన్ల మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో విరాట్ కోహ్లీపై మహేంద్ర సింగ్ ధోనీ పైచేయి సాధించాడు.ఐపీఎల్-8లో భాగంగా ఇక్కడ బెంగళూర్ రాయల్ చాలెంజర్స్ తో జరిగిన క్వాలిఫయర్-2లో చెన్నై సూపర్ కింగ్స్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్ కు చేరింది. బెంగళూర్ నిర్దేశించిన 140 పరుగుల విజయలక్ష్యాన్ని ఒక బంతి మాత్రమే మిగిలి ఉండగానే మాత్రమే ఛేదించిన చెన్నై.. ముంబై ఇండియన్స్ తో తుదిపోరుకు సిద్ధమైంది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై 61పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. డ్వేన్ స్మిత్(17),డుప్లెసిస్(21),సురేష్ రైనా(0) పెవిలియన్ కు చేరి చెన్నైను ఆందోళనకు గురిచేశారు. ఆ తరుణంలో మైక్ హస్సీ చూడచక్కని ఆటతో ఆకట్టుకున్నాడు. గత మ్యాచ్ ల్లో విఫలమై అనేక విమర్శలు ఎదుర్కొన్న హస్సీ కీలక సమయంలో ఫామ్ లో కి వచ్చి జట్టు విజయంలో సహకరించాడు. హస్సీ(46 బంతుల్లో 56;రెండు సిక్సర్లు, మూడు ఫోర్లు) చెలరేగి ఆడి నాల్గో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. అప్పటికే చెన్నై దాదాపు ఖరారైంది. అయితే చివర్లో నేగీ(11), ధోనీ(26)లు వరుసగా పెవిలియన్ కు చేరి మరోసారి ఆందోళనకు గురి చేశారు. ఇంకా రెండు బంతుల్లో ఒక పరుగు చేయాల్సిన సమయంలో ధోనీ పెవిలియన్ చేరినా.. అశ్విన్ ఇన్నింగ్స్ ముగింపు షాట్ ను కొట్టి చెన్నై ఫైనల్ కు చేర్చాడు.
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన బెంగళూర్ రాయల్ చాలెంజర్స్ 140 పరుగుల విజయలక్ష్యాన్ని ప్రత్యర్థికి నిర్దేశించింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ(12) , ఏబీ డివిలియర్స్ (1) వెనువెంటనే వికెట్లను చేజార్చుకుని బెంగళూర్ ను ఆదిలోనే కష్టాల్లో నెట్టారు. అటుతరువాత బెంగళూర్ 36 పరుగుల వద్ద ఉండగా మన్ దీప్(4)ను కూడా నష్టపోవడంతో జట్టు స్కోరు మందగించింది. అయితే క్రిస్ గేల్ కాసేపు మెరుపులు మెరిపించడంతో బెంగళూర్ మధ్యలో పుంజుకుంది.గేల్(41) బ్యాట్ వేగం పెంచే క్రమంలో రైనా బౌలింగ్ లో పెవిలియన్ కు చేరాడు.
ఆ తరువాత దినేష్ కార్తీక్ కు జతకలిసిన సర్ఫరాజ్ ఇన్నింగ్స్ ను మరమ్మత్తులు చేశాడు. కాగా, దినేశ్ కార్తీక్ (28) భారీ షాట్ కు యత్నించి నెహ్రా బౌలింగ్ లో అవుటైయ్యాడు. ఆ తరుణంలో సర్ఫరాజ్(31) ఆదుకోవడంతో బెంగళూర్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది.