
ఇక వీళ్ల ‘సందడి’...
ముంబై : ఏడాది కాలంగా భారత క్రికెట్‌లో అనుష్క శర్మ గురించి విపరీతంగా చర్చ జరుగుతోంది. కారణం... విరాట్ కోహ్లి ఎక్కడుంటే అనుష్క అక్కడ కనిపిస్తూ సందడి చేస్తోంది. ఇక వీళ్ల బాటలోనే భారత క్రికెట్‌లో మరో కొత్త జంట సందడి మొదలైంది. వాంఖడేలో చెన్నై, ముంబై మ్యాచ్‌కు రోహిత్ శర్మ కాబోయే భార్య రితిక సజ్దే వచ్చి హడావుడి చేసింది.
హర్భజన్ గర్ల్‌ఫ్రెండ్ గీతా బస్రాతో కలిసి వీఐపీ స్టాండ్‌లో కూర్చున్న రితిక... మ్యాచ్ అయిపోగానే రోహిత్ వైపు ప్రేమ సంకేతం చూపించింది. అతను కూడా దీనికి స్పందించి చేతులు చాచి నవ్వాడు. మ్యాచ్ ముగిశాక రితికతో కలిసి సెల్ఫీ తీసుకుని రోహిత్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. అందులో ముంబై ఇండియన్స్‌కు ‘అతి పెద్ద అభిమాని’ అని రాశాడు. ఆదివారం కోల్‌కతాలో జరిగే ఫైనల్‌కు కూడా రితిక వెళుతుందట.