చెన్నై ‘టాప్’... | chennai super kings is top | Sakshi
Sakshi News home page

చెన్నై ‘టాప్’...

Published Sun, May 17 2015 12:41 AM | Last Updated on Sun, Sep 3 2017 2:10 AM

చెన్నై ‘టాప్’...

చెన్నై ‘టాప్’...

పంజాబ్‌పై అలవోక విజయం
రాణించిన డుప్లెసిస్, రైనా 
అధికారికంగా ప్లేఆఫ్‌కు

 
 అంచనాలకు తగ్గట్టు రాణించిన చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్-8 సీజన్‌లో అగ్రస్థానంలో నిలిచింది. 18 పాయింట్లతో నంబర్‌వన్ హోదాతో అధికారికంగా ప్లేఆఫ్‌లో అడుగుపెట్టింది. విజయంతో ఆరంభించి... మరో చక్కటి గెలుపుతోనే ధోని సేన లీగ్ దశను ముగించింది. అటు గత సీజన్‌లో కేవలం మూడు మ్యాచ్‌లే ఓడిన పంజాబ్ ఈసారి మూడే గెలిచి ఆఖరి స్థానంతో తమ ప్రస్థానాన్ని ముగించింది.
 
 మొహాలీ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో తమదెంత పటిష్ట జట్టో చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి నిరూపించుకుంది. బౌలింగ్, బ్యాటింగ్‌లో అదరగొట్టే ఆటతీరుతో పంజాబ్ కింగ్స్ ఎలెవన్‌ను బెంబేలెత్తించింది. ఫలితంగా శనివారం ఏకపక్షంగా జరిగిన ఈ మ్యాచ్‌లో చెన్నై ఏడు వికెట్ల తేడాతో సునాయాస విజయం దక్కించుకుంది. దీంతో ప్లేఆఫ్‌కు వెళ్లిన తొలి జట్టుగా నిలిచింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ ఎలెవన్ 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 130 పరుగులే చేసింది. టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలం కాగా... అక్షర్ పటేల్ (29 బంతుల్లో 32; 2 ఫోర్లు; 1 సిక్స్), రిషీ ధావన్ (20 బంతుల్లో 25 నాటౌట్; 1 ఫోర్; 2 సిక్సర్లు) టాప్ స్కోరర్లుగా నిలిచారు.

పవన్ నేగికి రెండు వికెట్లు దక్కగా... స్పిన్నర్ అశ్విన్ (1/14) పొదుపైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. అనంతరం ఈ లక్ష్యాన్ని చెన్నై సూపర్ కింగ్స్ 16.5 ఓవర్లలో మూడు వికెట్లకు 134 పరుగులు చేసి అధిగమించింది. డు ప్లెసిస్ (41 బంతుల్లో 55; 5 ఫోర్లు; 1 సిక్స్), రైనా (34 బంతుల్లో 41 నాటౌట్; 4 ఫోర్లు) నిలకడగా ఆడారు. చివర్లో ధోని (16 బంతు ల్లో 25 నాటౌట్; 2 ఫోర్లు; 2 సిక్సర్లు) దడదడలాడించాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నేగి నిలిచాడు.

 వికెట్లు టపటపా...
 టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ బ్యాట్స్‌మెన్‌ను చెన్నై బౌలర్లు ప్రారంభం నుంచే వణికించారు. ఏ దశలోనూ ఈ ఆటగాళ్ల మధ్య చెప్పుకోదగ్గ భాగస్వామ్యం ఏర్పడలేదు. తొలి రెండు ఓవర్లలో ఫోర్, సిక్స్‌తో టచ్‌లో కనిపించిన ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (12 బంతుల్లో 15; 1 ఫోర్; 1 సిక్స్) మూడో ఓవర్‌లో పవన్ నేగికి చిక్కాడు. కొద్ది సేపటికే వరుస ఓవర్లలో బెయిలీ (7 బంతుల్లో 12; 2 ఫోర్లు)ని ఆశిష్ నెహ్రా.. వోహ్రా (7 బంతుల్లో 4) వికెట్‌ను ఈశ్వర్ పాండే తీయడంతో పంజాబ్ 35 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. పొదుపుగా బౌలింగ్ చేసిన స్పిన్నర్ అశ్విన్ తన రెండో ఓవర్‌లో ధోని స్టంపింగ్‌తో గురుకీరత్ (14 బంతుల్లో 15; 3 ఫోర్లు)ను పెవిలియన్‌కు పంపాడు. ఇది ఐపీఎల్‌లో ధోనికి 23వ స్టంపింగ్. దినేష్ కార్తీక్ (23) రికార్డును సమం చేశాడు. మ్యాక్స్‌వెల్, మిల్లర్ కూడా తక్కువ స్కోర్లకే అవుటవ్వడంతో పంజాబ్ భారీ స్కోరుపై ఆశలు వదులుకుంది.

 ఆదిలో తడబడినా..
 స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకి పంజాబ్ తొలి ఓవర్‌లోనే ఝలక్ ఇచ్చింది. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడిన హస్సీ (1)ని సందీప్ అవుట్ చేశాడు. ఈ షాక్ నుంచి తేరుకునేలోగానే రెండో ఓవర్‌లో మెకల్లమ్ (6 బంతుల్లో 6; 1 ఫోర్)ని హెండ్రిక్స్ బౌల్డ్ చేయడంతో 10 పరుగులకే చెన్నై రెండు వికెట్లు కోల్పోయింది. అయితే ఎలాంటి సంచలనాలకు తావీయకుండా డు ప్లెసిస్, రైనా జోడి పంజాబ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంది. ఇరువురూ అడపాదడపా బౌండరీలతో చెలరేగారు.

మధ్య ఓవర్లలో నిదానంగా సాగిన ఇన్నింగ్స్‌కు 12వ ఓవర్‌లో డు ప్లెసిస్ 6,4తో జోష్ నింపాడు. ఆ తర్వాతి ఓవర్‌లో రిషీ ధావన్ తనను బౌల్డ్ చేశాడు. మూడో వికెట్‌కు వీరిద్దరు 92 పరుగులు జత చేశారు. ఇక ధోని ధనాధన్ ఆటతో విజయం లాంఛనమే అయ్యింది. 17వ ఓవర్‌లో వరుసగా రెండు సిక్స్‌లు బాదాడు ఇందులో గాల్లోకి ఎగిరి గుండ్రంగా తిరిగి ఫైన్ లెగ్‌లో కొట్టిన సిక్స్ హైలైట్‌గా నిలిచింది. అదే ఓవర్‌లో రైనా ఓ ఫోర్‌తో మ్యాచ్‌ను ముగించాడు.
 
స్కోరు వివరాలు
 పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ఇన్నింగ్స్ : సాహా (సి) మెకల్లమ్ (బి) నేగి 15; వోహ్రా (సి) నెహ్రా (బి) పాండే 4; బెయిలీ (సి) ధోని (బి) నెహ్రా 12; మ్యాక్స్‌వెల్ (బి) జడేజా 6; గుర్‌కీరత్ సింగ్ (స్టంప్డ్) ధోని (బి) అశ్విన్ 15; మిల్లర్ (సి) జడేజా (బి) నేగి 11; పటేల్ (సి) ధోని (బి) బ్రేవో 32; రిషీ ధావన్ నాటౌట్ 25; హెండ్రిక్స్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో ఏడు వికెట్లకు) 130.
వికెట్ల పతనం : 1-16, 2-31, 3-35, 4-53, 5-55, 6-78, 7-122.
బౌలింగ్ : నేగి 4-0-25-2; ఈశ్వర్ పాండే 3-0-22-1; నెహ్రా 3-0-17-1; అశ్విన్ 4-0-14-1; జడేజా 3-0-18-1; రైనా 1-0-8-0; బ్రేవో 2-0-20-1.

 చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్ : మైక్ హస్సీ (సి) సాహా (బి) సందీప్ 1; మెకల్లమ్ (బి) హెండ్రిక్స్ 6; డు ప్లెసిస్ (బి) ధావన్ 55; రైనా నాటౌట్ 41; ధోని నాటౌట్ 25; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (16.5 ఓవర్లలో మూడు వికెట్లకు) 134.
 వికెట్ల పతనం : 1-2, 2-10, 3-102. బౌలింగ్ : సందీప్ శర్మ 2-0-9-1; హెండ్రిక్స్ 3-0-25-1; గురుకీరత్ 3-0-22-0; ధావన్ 2-0-12-1; మ్యాక్స్‌వెల్ 1-0-8-0; అక్షర్ 3-0-28-0; అనురీత్ 2.5-0-30-0.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement