'షారూఖ్ ఖాన్ ను రానీయం'
ముంబై: బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ వరుసగా మూడో ఏడాది వాంఖడే స్టేడియంలో మ్యాచ్ చూసే అవకాశాన్ని కోల్పోయాడు. 2012లో వాంఖడే స్టేడియంలో రభస చేయడంతో అతడిపై ఐదేళ్ల నిషేధం విధించారు. దీంతో ఈనెల 14న కోల్ కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరగనున్న కీలక మ్యాచ్ ను ప్రత్యక్షంగా చూసే అవకాశం లేకుండా పోయింది. షారూఖ్ ఖాన్ పై నిషేధం కొనసాగుతున్నందున, వాంఖడే స్టేడియంలోకి అతన్ని అనుమతించబోమని ముంబై క్రికెట్ అసోసియేషన్ అధికారి ఒకరు తెలిపారు.
అయితే గతేడాది వాంఖడేలో ఫైనల్ మ్యాచ్ చూసేందుకు షారూఖ్ అనుమతినిచ్చింది. తర్వాత ఫైనల్ మ్యాచ్ వేదికను బెంగళూరుకు మార్చడంతో కింగ్ ఖాన్ ఇక్కడ మ్యాచ్ ను చూడలేకపోయాడు. వాంఖడేకు కూతవేటు దూరంలో ఉన్న బ్రాబోర్న్ స్టేడియం ఈనెల 16న కోల్ కతా, రాజస్థాన్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ ను చూసేందుకు షారూఖ్ కు వీలుంది.