
బెంగళూరుకు వాన దెబ్బ
ఎక్కడైనా వర్షం పడాలంటే బెంగళూరు జట్టును క్రికెట్ ఆడటానికి పిలిస్తే సరిపోతుందేమో.
► ఢిల్లీతో మ్యాచ్ రద్దు
► రెండో స్థానం అవకాశం కోల్పోయిన కోహ్లిసేన
► మూడో స్థానంతో ప్లేఆఫ్‌కు రాయల్ చాలెంజర్స్
బెంగళూరు : ఎక్కడైనా వర్షం పడాలంటే బెంగళూరు జట్టును క్రికెట్ ఆడటానికి పిలిస్తే సరిపోతుందేమో. ఈ సీజన్‌లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో బెంగళూరుకు వర్షం ఎదురయింది. తొలుత మొహాలీలో పంజాబ్‌తో మ్యాచ్‌లో వర్షం కారణంగా ఓడిపోయిన కోహ్లిసేన... హైదరాబాద్‌లో సన్‌రైజర్స్ మ్యాచ్‌లో వర్షంలోనే గెలిచింది. ఇక సొంతగడ్డపై ఈ సీజన్‌లో చివరి మ్యాచ్ ఢిల్లీతో ఆడాల్సి ఉండగా... సగం మ్యాచ్ జరిగాక భారీ వర్షం ముంచెత్తింది. దీంతో ఈ మ్యాచ్ రద్దయింది.
చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో.. ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్లకు 187 పరుగులు చేసింది. డికాక్ (39 బంతుల్లో 69; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), డుమిని (43 బంతుల్లో 67 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగి ఆడారు. తర్వాత బెంగళూరు 1.1 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 2 పరుగులు చేసింది. కోహ్లి (1 నాటౌట్), గేల్ (1 నాటౌట్) ఆడుతున్నారు. ఈ దశలో ఎడతెరిపి లేకుండా వర్షం పడటంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. ఫలితంగా ఇరుజట్లకు చెరో పాయింట్ కేటాయించారు. ప్రతి సీజన్‌లో ఒక్క మ్యాచ్‌లో గ్రీన్ డ్రెస్‌తో (పర్యావరణ పరిరక్షణ ప్రచారం కోసం) ఆడే బెంగళూరు సొంతగడ్డపై చివరి మ్యాచ్ ద్వారా ఆ సంప్రదాయాన్ని కొనసాగించింది.
రాణించిన డికాక్, డుమిని
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి ఓపెనర్లు డికాక్, శ్రేయస్ అయ్యర్ (18 బంతుల్లో 20; 1 ఫోర్, 1 సిక్స్) సరైన శుభారంభాన్నిచ్చారు. ఈ ఇద్దరు తొలి వికెట్‌కు 55 పరుగులు జోడించారు. వన్‌డౌన్‌లో కెప్టెన్ డుమిని యాంకర్ పాత్రతో ఆకట్టుకున్నాడు. రెండో ఎండ్‌లో డికాక్ భారీ హిట్టింగ్‌కు తెరలేపడంతో తొలి 10 ఓవర్లలో ఢిల్లీ వికెట్ నష్టానికి 91 పరుగులు చేసింది. ఈ దశలో డికాక్ మరో రెండు సిక్సర్లు, ఓ బౌండరీ బాది అవుటయ్యాడు. దీంతో రెండో వికెట్‌కు 55 పరుగుల భాగస్వామ్యం ముగిసింది.
తర్వాత చాహల్ వేసిన ఇన్నింగ్స్ 14వ ఓవర్‌లో డుమిని వరుసగా మూడు సిక్సర్లతో రెచ్చిపోయాడు. కానీ అవతలి ఎండ్‌లో స్వల్ప విరామాల్లో యువరాజ్ (11), కేదార్ జాదవ్ (0), మ్యాథ్యూస్ (1)లు అవుట్‌కావడంతో ఢిల్లీ ఇన్నింగ్స్ కుదుపునకు లోనైంది. అయితే సౌరభ్ తివారీ (13 నాటౌట్)తో కలిసి డుమిని మరోసారి విజృంభించడంతో చివరి మూడు ఓవర్లలో 36 పరుగులు సమకూరాయి. ఈ ఇద్దరు ఆరో వికెట్‌కు కేవలం 4.4 ఓవర్లలో అజేయంగా 46 పరుగులు జోడించడంతో ఢిల్లీ భారీ స్కోరు చేసింది. హర్షల్, చాహల్ చెరో రెండు వికెట్లు తీశారు.
స్కోరు వివరాలు
ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్ : డికాక్ (సి) కోహ్లి (బి) చాహల్ 69; శ్రేయస్ (సి) గేల్ (బి) పటేల్ 20; డుమిని నాటౌట్ 67; యువరాజ్ (సి) స్టార్క్ (బి) చాహల్ 11; జాదవ్ (సి) కార్తీక్ (బి) పటేల్ 0; మ్యాథ్యూస్ రనౌట్ 1; సౌరభ్ తివారీ నాటౌట్ 13; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 187.
వికెట్ల పతనం : 1-55; 2-110; 3-137; 4-139; 5-141.
బౌలింగ్ : స్టార్క్ 4-0-35-0; దిండా 3-0-39-0; హర్షల్ పటేల్ 4-0-30-2; వీస్ 4-0-39-0; గేల్ 2-0-15-0; చాహల్ 3-0-26-2.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్ : కోహ్లి నాటౌట్ 1; గేల్ నాటౌట్ 1; మొత్తం: (1.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 2.
బౌలింగ్: జయంత్ 1-0-2-0; జహీర్ 0.1-0-0-0.