యువీని తక్కువ ధరకు కొనాలనుకున్నాం కానీ..
న్యూఢిల్లీ: ఐపీఎల్ వేలంలో ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ 16 కోట్ల రూపాయల ధర పలకడానికి ఐపీఎల్ మార్కెటే కారణమని ఢిల్లీ డేర్ డెవిల్స్ సీఈఓ హేమంత్ దువా చెప్పారు. తాజా సీజన్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న యువీకి హేమంత్ మద్దతుగా నిలిచారు. 'యువీని వీలైనంత వరకు తక్కువ ధరకు కొనుగోలు చేయాలనుకున్నాం, 16 కోట్ల రూపాయలు ఇవ్వాలనుకోలేదు. వేలంలో యువీ ధర అమాంతం పెరిగిపోయింది. అతని కోసం ఫ్రాంచైజీలు పోటీపడి ధరను పెంచాయి. యువీ భారీ ధర పలకడానికి మార్కెటే కారణం' అని హేమంత్ చెప్పారు. యువీకి జట్టు అండగా ఉంటుందని, అతను మళ్లీ ఫామ్ అందుకుంటాడని విశ్వాసం వ్యక్తం చేశారు. క్రికెటర్లు కూడా మానవమాత్రులేనని, ఈ విషయం అర్థం చేసుకోవాలని అన్నారు.
ఐపీఎల్-8లో ఢిల్లీకి ఆడుతున్న యువీ ఇప్పటి వరకు 12 మ్యాచ్ల్లో 18.63 సగటుతో 205 పరుగులు చేశాడు. ఢిల్లీ వరుస పరాజయాలతో ప్లే ఆఫ్ రేసు నుంచి దాదాపుగా వైదొలిగినట్టే. కాగా 16 కోట్ల మొత్తం పూర్తిగా చెల్లించాలని అడగనని యువీ చెప్పాడు.