క్లైమాక్స్‌కు రంగం సిద్ధం | Ready for climax | Sakshi
Sakshi News home page

క్లైమాక్స్‌కు రంగం సిద్ధం

Published Sun, May 24 2015 12:56 AM | Last Updated on Sun, Sep 3 2017 2:34 AM

క్లైమాక్స్‌కు రంగం సిద్ధం

క్లైమాక్స్‌కు రంగం సిద్ధం

నేడు ఐపీఎల్ ఫైనల్
ముంబై ఇండియన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ ఢీ
ఫామ్‌లో రోహిత్ సేన   ఆత్మవిశ్వాసంతో ధోని బృందం

 
 హోరాహోరీ పోరాటాలు... ఉత్కంఠభరిత మ్యాచ్‌లు... బౌండరీల హోరు, సిక్సర్ల జోరు... కళ్లుచెదిరే క్యాచ్‌లు... 47 రోజుల పాటు అభిమానులను ఉర్రూతలూగించిన టి20 వినోదానికి నేటితో తెరపడనుంది. ఈడెన్‌గార్డెన్స్‌లో భారీ క్లైమాక్స్‌కు రంగం సిద్ధమైంది. లీగ్ చరిత్రలోనే రెండు హై ప్రొఫైల్ జట్లు టైటిల్ కోసం తలపడుతున్నాయి. ఎనిమిదో సీజన్ ఐపీఎల్ ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.
 
 కోల్‌కతా : మరోసారి ఆధిపత్య పోరుకు రంగం సిద్ధమైంది. ముంబై, చెన్నై జట్లు ఐపీఎల్‌లో ఎప్పుడు, ఎక్కడ మ్యాచ్ ఆడినా అది అభిమానులకు కన్నుల పండగే. ఇక అది ఫైనల్ అయితే ఆ ఉత్సాహమే వేరు. ఈ సీజన్‌లో ఇప్పటికే మూడుసార్లు తలపడిన ఈ రెండు జట్లు ఈసారి అన్నింటికంటే పెద్ద మ్యాచ్‌కు సిద్ధమయ్యాయి. చారిత్రక ఈడెన్‌గార్డెన్స్‌లో ఆదివారం జరిగే ఐపీఎల్ ఫైనల్లో ముంబై ఇండియన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. 2013లో ఇదే వేదికపై జరిగిన ఐపీఎల్-6 ఫైనల్లో ముంబై జట్టు చెన్నైపై గెలిచింది.

ఈసారి లీగ్ దశలో తొలి ఆరు మ్యాచ్‌ల్లో ఐదు ఓడిపోయి... ప్రతి మ్యాచ్‌లోనూ చావోరేవో తరహాలో ఆడి... ఆఖరి లీగ్ మ్యాచ్‌లో విజయంతో ప్లేఆఫ్‌కు చేరింది ముంబై జట్టు. క్వాలిఫయర్-1లో చెన్నైని అలవోకగా ఓడించి నాలుగు రోజుల విశ్రాంతితో తాజాగా బరిలోకి దిగుతోంది. అటు చెన్నై జట్టు మిగిలిన అన్ని జట్ల కంటే ముందే ప్లే ఆఫ్‌కు చేరినా... ముంబై చేతిలో ఓటమితో కంగుతింది. కానీ భీకరమైన ఫామ్‌లో ఉన్న బెంగళూరును క్వాలిఫయర్-2లో ఓడించి మరోసారి ముంబైకి సవాల్ విసురుతోంది. ఎవరు గెలిచినా ఈ మ్యాచ్ ఆసక్తికరంగా సాగడం మాత్రం ఖాయం.

 అన్ని విభాగాల్లో ఫామ్‌లో...
 ముంబై ఇండియన్స్ జట్టు అన్ని విభాగాల్లోనూ భీకరమైన ఫామ్‌లో ఉంది. ముఖ్యంగా ఓపెనర్లు సిమ్మన్స్, పార్థీవ్ పటేల్ సంచలన ఆటతీరుతో జట్టుకు అద్భుతమైన భాగస్వామ్యాలు అందిస్తున్నారు. లీగ్ ఆరంభ దశలో బాగా ఆడిన రోహిత్ శర్మ ఆ తర్వాత కాస్త తడబడ్డాడు. అయితే ఈడెన్ అతనికి బాగా కలిసొచ్చిన మైదానం. ఇక్కడే కెప్టెన్‌గా తొలిసారి 2013లో ఐపీఎల్ టైటిల్ అందుకున్నాడు. అలాగే వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరునూ ఇక్కడే నమోదు చేశాడు.

ఈ ఏడాది ఆరంభ మ్యాచ్‌లో కోల్‌కతాపై అద్భుతంగా ఆడి సెంచరీకి చేరువలో ఆగాడు. కాబట్టి ఈ వేదికపై రోహిత్ ఆత్మవిశ్వాసంతో ఆడటం ఖాయం. అంబటి రాయుడు, యువ సంచలనం హార్దిక్ పాండ్యలతో పాటు పొలార్డ్ కూడా చెలరేగితే ముంబై భారీ స్కోరు సాధించడం ఖాయం. ఇక బౌలింగ్‌లో మెక్లీనగన్, మలింగ ఇద్దరూ అద్భుతంగా రాణిస్తున్నారు. గత సీజన్‌లో కోల్‌కతా తరఫున ఆడిన వినయ్ కుమార్ ఈసారి ముంబై తరఫున తన ఈడెన్ అనుభవాన్ని ఉపయోగించనున్నాడు. స్పిన్నర్ హర్భజన్ భారత జట్టులో పునరాగమనంతో రెట్టించిన ఉత్సాహంతో ఉన్నాడు. లెఫ్టార్మ్ స్పిన్నర్ సుచిత్ కూడా టోర్నీలో గణనీయమైన ప్రభావం చూపించాడు. మొత్తం మీద ముంబై జట్టు అన్ని విభాగాల్లో సమతూకంతో, మంచి ఫామ్‌లో ఉంది.

 రైనా, స్మిత్ రాణించాలి
 చెన్నై సీజన్‌లో నిలక డగా విజయాలు సాధించడానికి కారణం ఓపెనర్లు. మెకల్లమ్, డ్వేన్ స్మిత్‌ల సంచలన ఆరంభాలు ఆ జట్టును విజయాల బాటలో నడిపించాయి. అయితే మెకల్లమ్ వెళ్లిపోయాక ఆ లోటు కనపడకుండా మైక్ హస్సీ తన అనుభవాన్ని ఉపయోగించి ఆడుతున్నాడు. కానీ డ్వేన్ స్మిత్ ఫామ్ కోల్పోవడం చెన్నైని ఆందోళనలో పడేస్తోంది. ఇక సురేశ్ రైనా కూడా ఈ సీజన్‌లో ఒక్కసారి కూడా తన మార్క్ ఇన్నింగ్స్ ఆడలేదు. రైనా, స్మిత్ గాడిలో పడితే మాత్రం ఎలాంటి ప్రత్యర్థి అయినా భయపడాల్సిందే. డుప్లెసిస్‌తో పాటు ఆల్‌రౌండర్లు బ్రేవో, జడేజా, పవన్ నేగి కూడా రాణించాల్సి ఉంది. కెప్టెన్ ధోని ఫామ్ గురించి ఆందోళన లేదు.

అయితే ఈ సీజన్‌లో ఇప్పటివరకూ చెన్నై మిడిలార్డర్ ఆకట్టుకోలేకపోయింది. చావోరేవో తేల్చుకోవాల్సిన ఈ మ్యాచ్‌లో అయినా మిడిలార్డర్ గాడిలో పడాలి. ఇక బౌలింగ్‌లో నెహ్రా, డ్వేన్ బ్రేవో ఇద్దరూ పోటాపోటీగా వికెట్లు తీస్తున్నారు. మోహిత్ శర్మ, అశ్విన్‌ల నుంచి వీరికి కావలసిన సహకారం లభిస్తోంది. జడేజా, నేగి కలిసి ఐదో బౌలర్ కోటాను పూర్తి చేస్తున్నారు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో డ్వేన్ బ్రేవో బౌలింగ్ కీలకం. ధోని వ్యూహాలతో ఫామ్‌లో ఉన్న బెంగళూరును ఓడించి ఫైనల్‌కు చేరిన చెన్నై... మరోసారి తమ కెప్టెన్ వ్యూహాలపై నమ్మకంతో ఆత్మవిశ్వాసంతోనే ఫైనల్ ఆడబోతోంది.

 జట్లు(అంచనా)
 చెన్నై సూపర్ కింగ్స్ : ధోని (కెప్టెన్), డ్వేన్ స్మిత్, మైక్ హస్సీ, సురేశ్ రైనా, డుప్లెసిస్, డ్వేన్ బ్రేవో, రవీంద్ర జడేజా, పవన్ నేగి, అశ్విన్, ఆశిష్ నెహ్రా, మోహిత్ శర్మ.
 ముంబై ఇండియన్స్ : రోహిత్ శర్మ (కెప్టెన్), సిమ్మన్స్, పార్థీవ్ పటేల్, అంబటి రాయుడు, పొలార్డ్, హార్దిక్ పాండ్య, సుచిత్, హర్భజన్ సింగ్, వినయ్ కుమార్, మెక్లీనగన్, లసిత్ మలింగ.
 
 ఆసక్తికర సమరం
 సహజంగానే ఈడెన్ గార్డెన్స్ పిచ్ స్పిన్‌కు సహకరిస్తుంది. అందుకే ఈ సీజన్‌లో కోల్‌కతా తమ జట్టును స్పిన్నర్లతో నింపేసింది. ఫైనల్ కోసం కొత్త ట్రాక్‌ను వినియోగిస్తున్నామని, దీనిపై బౌన్స్ కూడా బాగానే ఉంటుందని క్యూరేటర్ చెబుతున్నారు. కాబటి ఆఫ్ స్పిన్నర్లు అశ్విన్, హర్భజన్ ఇద్దరూ చాలా కీలకం. ఇద్దరూ బంగ్లాదేశ్ వెళ్లే టెస్టు జట్టులో ఉన్నారు. కాబట్టి ఈ మ్యాచ్‌లో బాగా రాణించిన వాళ్లు తుది జట్టులో కచ్చితంగా ఉంటారు.
 
 3    ముంబై రెండుసార్లు ఫైనల్‌కు చేరి ఒక్కసారి టైటిల్ గెలిచింది. రెండుసార్లు కూడా చెన్నైతోనే ఫైనల్లో ఆడింది. 2010లో చెన్నై చేతిలో 22 పరుగులతో ఓడి, 2013లో 23 పరుగులతో గెలిచింది. మూడోసారి కూడా ఫైనల్ చెన్నైతోనే ఆడబోతోంది.
 6    చెన్నై జట్టు ఫైనల్‌కు చేరడం ఇది ఆరోసారి. గతంలో ఫైనల్‌కు చేరిన ఐదుసార్లలో రెండు సార్లు ధోనిసేన టైటిల్ గెలిచింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement