
రాయల్స్‌పై రాయల్‌గా...
►క్వాలిఫయర్-2కు బెంగళూరు
►చెలరేగిన డివిలియర్స్, మన్‌దీప్
►రాజస్తాన్‌పై కోహ్లిసేన విజయం
►చెన్నైతో రేపు అమీతుమీ
ఐపీఎల్‌లో బెంగళూరు జైత్రయాత్ర కొనసాగుతోంది. లీగ్ దశలోనే కాదు... ఒత్తిడితో కూడిన నాకౌట్ మ్యాచ్‌లోనూ ఆ జట్టు పట్టు కోల్పోలేదు. బ్యాటింగ్‌లో డివిలియర్స్, మన్‌దీప్ మెరుపులకు తోడు బౌలర్లు సమష్టిగా రాణించడంతో... ఎలిమినేటర్‌లో రాజస్తాన్‌పై ‘రాయల్’గా గెలిచి క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది. ఇక రేపు (శుక్రవారం) జరిగే మ్యాచ్‌లో చెన్నైతో కోహ్లిసేన అమీతుమీ తేల్చుకోనుంది. ఆ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరుతుంది.
పుణే : ఐపీఎల్ తొలి ఐదు మ్యాచ్‌లలో వరుసగా విజయాలు సాధించి ఊపు మీద కనిపించిన రాజస్తాన్ చివరకు ప్లే ఆఫ్‌తోనే సరిపెట్టుకుంది. కెప్టెన్‌గా ఏ ఫార్మాట్‌లోనూ ఓటమి పాలవ్వని కెప్టెన్ స్మిత్ అదృష్టం కూడా ఆ జట్టు రాతను మార్చలేకపోయింది. బుధవారం ఇక్కడ ఏకపక్షంగా సాగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ చేతిలో 71 పరుగుల తేడాతో రాజస్తాన్ చిత్తుగా ఓడింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.
ఏబీ డివిలియర్స్ (38 బంతుల్లో 66; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), మన్‌దీప్ సింగ్ (34 బంతుల్లో 54 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 11.1 ఓవర్లలోనే 113 పరుగులు జోడించడం విశేషం. అనంతరం రాజస్తాన్ 19 ఓవర్లలో 109 పరుగులకే కుప్పకూలింది. అజింక్య రహానే (39 బంతుల్లో 42; 4 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు. శుక్రవారం రాంచీలో జరిగే రెండో క్వాలిఫయర్‌లో చెన్నైతో బెంగళూరు తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో విజేతగా నిలిచే జట్టు ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.
మెరుపు భాగస్వామ్యం
తొలి 19 బంతుల్లో 16 పరుగులు, తర్వాతి 19 బంతుల్లో 50 పరుగులు...ఇన్నింగ్స్‌ను నెమ్మదిగా ఆరంభించి భారీ షాట్లతో డివిలియర్స్ తన జోరును పెంచిన తీరు ఇది. మన్‌దీప్ కూడా అతనితో దీటుగా, ధాటిగా ఆడటంతో ఎలిమినేటర్ మ్యాచ్‌లో బెంగళూరుకు భారీ స్కోరు సాధ్యమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అనంతరం గేల్ (26 బంతుల్లో 27; 4 ఫోర్లు, 1 సిక్స్), కోహ్లి (12)లను ఐదు పరుగుల వ్యవధిలో ధావల్ కులకర్ణి అవుట్ చేయడంతో రాజస్తాన్ ఆధిక్యం ప్రదర్శించినా... డివి లియర్స్, మన్‌దీప్ భాగస్వామ్యం ఆర్‌సీబీని నిలబెట్టింది. ఆరంభంలో జాగ్రత్తగా ఆడిన వీరిద్దరు ఆ తర్వాత జోరు పెంచారు. అంకిత్ వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్లో డివిలియర్స్ 2 సిక్స్‌లు, 1 ఫోర్‌తో చెలరేగడంతో 19 పరుగులు వచ్చాయి. ఇదే ఊపులో డివిలియర్స్ 34 బంతుల్లో అర్ధ సెంచరీని అందుకున్నాడు. చివర్లో డివిలియర్స్ రనౌటైనా...మరో వైపు దూకుడు కొనసాగించిన మన్‌దీప్ 32 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 14 ఓవర్లు ముగిసే సరికి 94 పరుగులే చేసిన బెంగళూరు ఏబీ, మన్‌దీప్ మెరుపులతో చివరి 6 ఓవర్లలో ఏకంగా 86 పరుగులు చేయడం విశేషం.
టపటపా వికెట్లు
భారీ లక్ష్యఛేదనలో రాజస్తాన్ ఏ దశలోనూ చెప్పుకోదగ్గ ఆటతీరు కనబర్చలేదు. నిరాశాజనకమైన ఆరంభం లభించగా, అది చివరి వరకు కొనసాగింది. వాట్సన్ (10), శామ్సన్ (5), స్మిత్ (12) తక్కువ వ్యవధిలోనే వెనుదిరగడంతో బెంగళూరుకు ప్రత్యర్థిపై పట్టు చిక్కింది. మరో వైపు రహానే పోరాడే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. ఇతర బ్యాట్స్‌మెన్‌లలో ఎవరూ అతనికి సహకరించలేదు. నాయర్ (12), ఫాల్క్‌నర్ (4), బిన్నీ (0) విఫలమయ్యారు. చహల్ వేసిన 14వ ఓవర్లో చివరి బంతిని భారీ షాట్ ఆడబోయిన రహానే డీప్‌లో క్యాచ్ ఇవ్వడంతో రాజస్తాన్ విజయంపై ఆశలు వదిలేసుకుంది. బెంగళూరు బౌలర్లలో హర్షల్, అరవింద్, వీస్, చహల్ తలా 2 వికెట్లు తీశారు.
స్కో రు వివరా లు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్ : గేల్ (బి) ధావల్ 27; కోహ్లి (సి) అండ్ (బి) ధావల్ 12; డివిలియర్స్ (రనౌట్) 66; మన్‌దీప్ (నాటౌట్) 54; కార్తీక్ (సి) రహానే (బి) మోరిస్ 8; సర్ఫరాజ్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 180.
వికెట్ల పతనం : 1-41; 2-46; 3-159; 4-177.
బౌలింగ్ : మోరిస్ 4-0-42-1; ఫాల్క్‌నర్ 4-0-42-0; ధావల్ 4-0-28-2; వాట్సన్ 4-0-32-0; అంకిత్ 3-0-28-0; బిన్నీ 1-0-1-0.
రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్ : రహానే (సి) డివిలియర్స్ (బి) చహల్ 42; వాట్సన్ (సి) కార్తీక్ (బి) అరవింద్ 10; శామ్సన్ (సి) కార్తీక్ (బి) హర్షల్ 5; స్మిత్ (సి) డివిలియర్స్ (బి) వీస్ 12; నాయర్ (సి) కార్తీక్ (బి) హర్షల్ 12; హుడా (సి) స్టార్క్ (బి) వీస్ 11; ఫాల్క్‌నర్ (సి) అండ్ (బి) అరవింద్ 4; బిన్నీ (రనౌట్) 0; మోరిస్ (సి) చహల్ (బి) స్టార్క్ 0; అంకిత్ (నాటౌట్) 7; ధావల్ (బి) చహల్ 3; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (19 ఓవర్లలో ఆలౌట్) 109.
వికెట్ల పతనం : 1-14; 2-33; 3-55; 4-79; 5-87; 6-92; 7-92; 8-95; 9-99; 10-109.
బౌలింగ్ : స్టార్క్ 4-0-22-1; అరవింద్ 4-0-20-2; హర్షల్ 3-0-15-2; వీస్ 4-0-32-2; చహల్ 4-0-20-2.