
ఫైనల్ కు చేరేదెవరో?
ముంబై: ఐపీఎల్‌లో సమ ఉజ్జీలుగా పరిగణించబడుతున్న ముంబై ఇండియన్స్ - చెన్నై సూపర్ కింగ్స్ ల మధ్య మరి కాసేపట్లో కీలక పోరుకు తెరలేవనుంంది. వాంఖడే స్టేడియంలో మంగళవారం ఇక్కడ జరిగే తొలి క్వాలిఫయర్‌లో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఇందులో విజేతగా నిలిచే జట్టు నేరుగా ఫైనల్ కు ప్రవేశిస్తుంది. రెండు సార్లు చాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ మూడో టైటిల్ ను కైవశం చేసుకోవడానికి సమాయత్తమవుతుండగా, టోర్నీలో నిలకడగా రాణించిన ముంబై ముందుగా ఫైనల్ కు చేరాలని భావిస్తోంది. దీంతో ఇరు జట్ల మధ్య తొలి పోరు ఆసక్తిగా జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇరు జట్ల బలాబలాలను పరిశీలిస్తే..
చెన్నై సూపర్ కింగ్స్ : జట్టు బ్యాటింగ్ ప్రధానంగా డ్వేన్ స్మిత్, సురేష్ రైనా, డు ప్లెసిస్‌లపై ఆధార పడి ఉంది. వీరిలో స్మిత్, డు ప్లెసిస్ లు మంచి ఫామ్ లో ఉండగా, రైనా కూడా తనదైన రోజున ఆకట్టుకుంటున్నాడు. అయితే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మాత్రం ఇప్పటివరకూ పెద్దగా ప్రభావం చూపలేదు. ధోనీ సీజన్ మొత్తంగా రెండు సార్లు మాత్రమే 30కి పైగా స్కోర్లు నమోదు చేశాడు. మరో ఆటగాడు నేగీ చివర్లో కాస్త దూకుడుగానే ఆడుతున్నాడు. నేటి మ్యాచ్ లో బ్రెండెన్ మెకల్లమ్ లేకపోవడం చెన్నైకు తీరని నష్టంగా చెప్పవచ్చు.గాయం కారణంగా మెకల్లమ్ బెంచ్ కే పరిమితమవుతున్నాడు కాగా, అతని స్థానంలో జట్టులోకి వచ్చిన మైక్ హస్సీ రాణిస్తే మాత్రం చెన్నైవిజయం సాధించే అవకాశం ఉంది. పేస్ విభాగంలో నెహ్రాకు బ్రేవో అండగా నిలుస్తుండగా, స్పిన్‌లో నేగి, అశ్విన్ కీలకం కానున్నారు.
ముంబై ఇండియన్ప్ : ఐపీఎల్ ఆరంభంలో పేలవంగా ఆడిన వరుస ఓటములు మూటగట్టుకున్న ముంబై ఆ తర్వాత నిలకడగా రాణించింది. బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్ విభాగాల్లో సూపర్ ఫామ్ ను కొనసాగిస్తున్న ముంబై ఈ మ్యాచ్ లో గెలిచి ఫైనల్ బెర్తును ఖరారు చేసుకోవాలని యోచిస్తోంది. సొంతగడ్డపై మ్యాచ్ జరుగుతుండటం ముంబై కు లాభించే అవకాశం ఉంది. ముంబై టీమ్ లో ఓపెనర్లు సిమన్స్, పార్థివ్ లు శుభారంభాన్నివ్వడం కూడా జట్టుక కలిసొచ్చేదిగా కనబడుతోంది. మిడిల్ ఆర్డర్ లో రోహిత్ శర్మ , అంబటి రాయుడు, పొలార్డ్‌లు ముంబై బ్యాటింగ్ లో కీలక పాత్ర పోషిస్తున్నారు. మరో ఆటగాడు హార్దిక్ పాండ్యా ఒక్కసారిగా జట్టులో కీలక ఆటగాడిగా మారాడు. వరుస రెండు మ్యాచ్ ల్లో రాణించిన పాండ్యా మరోసారి బ్యాట్ ఝుళిపించాలని ముంబై కోరుకుంటోంది. దీంతో పాటు ప్రధాన పేసర్లు మలింగ, మెక్లీన్‌గన్‌లు తమ అటాకింగ్ బౌలింగ్ తో ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య జరిగే తొలి క్వాలిఫయర్ మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.
ఓడిన జట్టుకు మరో అవకాశం..
తొలి క్వాలిఫయర్ లో ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్ లో ఓడిన జట్టు తన తదుపరి మ్యాచ్ లో అదృష్టాన్ని పరిక్షించుకోవడానికి మరో వీలు ఉంది. బుధవారం బెంగళూర్ రాయల్ చాలెంజర్స్- రాజస్థాన్ ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరుగనుంది. వీటిలో గెలిచిన జట్టు.. నేడు ఓడిన జట్టుతో తలపడి ఫైనల్ చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో ముంబై-చెన్నై లు పెద్దగా ఒత్తిడి లేకుండానే ఆడటానికి వారికి ఇదొక సువర్ణావకాశం.