ఆటగాళ్ల గదుల్లో అమ్మాయిలు
►2014 ఐపీఎల్‌లో ఇద్దరు చెన్నై క్రికెటర్ల నిర్వాకం
►యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన
►పార్టీలతో ఓనర్ల సరదా
గతేడాది ఐపీఎల్ చాలా ‘జాగ్రత్తగా’ జరిగింది. 2013లో స్పాట్ ఫిక్సింగ్ ఉదంతం నేపథ్యంలో 2014 సీజన్‌లో టోర్నీ నిర్వహణ కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. టోర్నీ నిర్వహణ బాధ్యత గవాస్కర్‌కు అప్పగించారు. అడుగడుగునా అవినీతి నిరోధక అధికారులను ఏర్పాటు చేశారు. అయినా క్రికెటర్లు వీటిని లెక్కచేయలేదు. యథేచ్ఛగా నిబంధనలను ఉల్లంఘించారు. ఇద్దరు చెన్నై క్రికెటర్లు తమ గదుల్లో అమ్మాయిలతో రాత్రంతా గడిపారు. అటు యజమానులు కూడా క్రికెటర్లను పార్టీల పేరుతో బయటివాళ్లను కలవనిచ్చారు. గత సీజన్‌లో జరిగిన ఇలాంటి సంఘటనల గురించిన వివరాలు తాజాగా బయటకొచ్చాయి.
ముంబై : గత ఏడాది ఐపీఎల్ (2014) పూర్తిగా విజయవంతమైందని, ఆట తప్ప మరో అంశం గురించి ఎక్కడా చర్చే జరగలేదని లీగ్ నిర్వాహకులు గర్వంగా చెప్పుకున్నారు. అయితే ఐపీఎల్‌నుంచి వివాదాలను దూరంగా ఉంచడం అంత సులువు కాదని గతేడాది జరిగిన కొన్ని ఘటనలు రుజువు చేశాయి. కోర్టు ఆదేశాల కారణంగా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ నేతృత్వంలో ఐపీఎల్-7 జరిగింది. కానీ మైదానం బయటి సంఘటనలు మాత్రం ఆయన దృష్టికి చేరినట్లు లేదు. పార్టీలు కావచ్చు లేదా హోటల్ గదిలో సరసాలు కావచ్చు లేదా ఆటగాళ్ల చుట్టూ ఏజెంట్ల హల్‌చల్ కావచ్చు... ఇలాంటి పలు ఘటనలను బీసీసీఐ అవినీతి నిరోధక భద్రతా బృందం(ఏసీఎస్‌యూ) గుర్తించింది.
ఈ వివరాలతో ఏసీఎస్‌యూ చీఫ్ రవి సవాని, బీసీసీఐకి లేఖ రాశారు. అడుగడుగునా సాగిన నిబంధనల ఉల్లంఘనను గుర్తు చేస్తూ సవాని గత ఐపీఎల్ సమయంలోనే పంపిన మెయిల్ ఇప్పుడు బయటకొచ్చింది. గత ఏడాది ఐపీఎల్ అవినీతిపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలోనే ఇవి చోటు చేసుకున్నాయి. అయితే దీనిపై ఏసీఎస్‌యూ ఆయా ఫ్రాంచైజీల వివరణ కోరిందని, దాంతో తాము సంతృప్తి చెందినట్లు కూడా బోర్డు ప్రకటించడం విశేషం! ఈ ఘటనల గురించి పంపిన మెయిల్‌పై పంజాబ్, ఢిల్లీ యాజమాన్యాలు వివరణ ఇవ్వగా, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్ యాజమాన్యాలు మాత్రం స్పందించలేదు.
పంజాబ్ జట్టు సభ్యుల కోసం యజమాని ప్రీతి జింటా ముంబై సముద్ర తీరంనుంచి 2 కిలోమీటర్ల ఆవల పడవలో పార్టీ ఇచ్చింది. ఆమె మిత్రులు కొంత మంది దీనిని ఏర్పాటు చేశారు. అయితే 2013లో బెట్టింగ్‌కు సంబంధించి ఏసీఎస్‌యూ విచారించిన జాబితాలో ఉన్నవారే ఈ పార్టీ ఇవ్వడం గమనార్హం. కోల్‌కతా జట్టు కోసం షారుఖ్ ఖాన్ మిత్రులు కొందరు పార్టీ ఇచ్చారు. ఇది కూడా నిబంధనలకు విరుద్ధం.
ఢిల్లీ జట్టు స్పాన్సరర్ ఒకరు టీమ్ కోసం ఇచ్చిన పార్టీలో 100 మందికి పైగా బయటి వ్యక్తులు హాజరై ఆటగాళ్లతో ఆత్మీయంగా కలిసిపోయారు. దీనిపై ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వని ఢిల్లీ... అతిథుల జాబితా కూడా ఇవ్వలేదు.
ముంబైలోని ఒక హోటల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడితో ఒక అమ్మాయి రాత్రి 10 గంటలనుంచి ఉదయం 6 గంటల వరకు గడిపింది. విచారిస్తే ‘ఆమె నాకు మంచి స్నేహితురాలు’ అని మాత్రమే సదరు ఆటగాడు చెప్పాడు.
చెన్నై సూపర్ కింగ్స్‌కే చెందిన మరో క్రికెటర్‌తో కూడా మరో అమ్మాయి ఇలాగే రాత్రినుంచి ఉదయం వరకు అతని గదిలోనే ఉంది. దీనిపై ప్రశ్నకు...‘ఆమె తనకు బాగా సన్నిహితురాలని, త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నామని’ ఆ ఆటగాడు చెప్పాడు. అయితే గతంలోనూ ఆ అమ్మాయి శ్రీశాంత్ సహా పలువురు ఐపీఎల్ క్రికెటర్లతో సన్నిహితంగా మెలిగినట్లు, 2013లో ఆమెకు అక్రిడిటేషన్ కార్డు కూడా దక్కినట్లు ఏసీఎస్‌యూ విచారణలో వెల్లడైంది.
ఇద్దరు సన్‌రైజర్స్ ఆటగాళ్లు ఏ నగరంలో ఉన్నా... వారి హోటల్ గదుల్లోకి వచ్చే సందర్శకుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండేది. పంజాబ్ జట్టులోని ఒక సీనియర్ విదేశీ ఆటగాడి మిత్రుడు అతనితో పాటు గదిలో ఉన్నాడు. జట్టు ప్రాక్టీస్ సెషన్లలో తరచుగా కనిపించిన అతను టీమ్ బస్సులో కూడా ప్రయాణించాడు.
ప్లేయర్ ఏజెంట్లు ఆటగాళ్ల హోటల్‌లోనే ఉంటూ నిబంధనలు ఉల్లంఘించారు. రక్త సంబంధీకులు/భార్య మినహా మరెవరూ అదే హోటల్‌లో బస చేయరాదు. కొంతమంది ఆటగాళ్లు మ్యాచ్ కోసం తమ సొంత నగరాలకు వచ్చినప్పుడు రాత్రికి తమ ఇళ్లకు వెళ్లిపోయేవారు. దీని వల్ల వారు బయట ఏం చేస్తున్నారో నిఘా పెట్టడం ఏసీఎస్‌యూకు సాధ్యం కాలేదు.