
‘టెంపర్’ తగ్గదా..!
►మారని కోహ్లి వ్యవహారశైలి
►మైదానంలో ఆగ్రహావేశాలు
►నియంత్రణ కోల్పోతున్నభారత టెస్టు కెప్టెన్
బ్యాట్స్‌మన్‌గా విరాట్ కోహ్లి స్థాయి సచిన్‌కు తగ్గనిది... తన ప్రదర్శనతో తక్కువ సమయంలోనే దిగ్గజాల సరసన చోటు దక్కించుకున్న ఘనత అతనిది... కానీ మైదానంలో ప్రవర్తన విషయంలో మాత్రం నాటి స్టార్లతో పోలిస్తే అతనికి పడేది సున్నా మార్కులే. అంతర్జాతీయ స్థాయి క్రికెటర్‌గా, భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాననే స్పృహ లేకుండా కోహ్లి సృష్టిస్తున్న వివాదాలు అతని ఆటకు మచ్చ తెస్తున్నాయి. ఇకపై టెస్టు కెప్టెన్‌గా కూడా మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన కోహ్లి తన ఆగ్రహావేశాలు నియంత్రించుకోలేడా!
సాక్షి క్రీడా విభాగం : దాదాపు పాతికేళ్ల కెరీర్‌లో సచిన్ ఎప్పుడైనా తోటి ఆటగాడిపై నోరు జారడం, దురుసుగా ప్రవర్తించడం చూశారా! కేవలం టన్నుల కొద్దీ పరుగులే కాదు వ్యక్తిత్వం కూడా సచిన్‌ను గొప్పవాడిగా నిలబెట్టింది. మరి సచిన్‌కు వారసుడు అంటూ కితాబులందుకున్న వ్యక్తి ఎంత హుందాగా ఉండాలి! ధోని స్థానంలో సారథిగా వచ్చే వ్యక్తి అతనిలాగే ఎంతటి నిగ్రహం చూపించాలి! కానీ విరాట్ కోహ్లి వల్ల మాత్రం ఇది కావడం లేదు. అది అండర్-19 స్థాయి అయినా, రంజీ ట్రోఫీ అయినా, ఐపీఎల్ అయినా, టెస్టు లేదా వన్డే అయినా కోహ్లి ‘మార్క్’ ఆగ్రహం మైదానంలో కనిపిస్తూనే ఉంటోంది. పట్టరాని సంతోషమైనా, పట్టలేని కోపమైనా కోహ్లి నోటి వెంట బూతు పురాణం వినిపిస్తూనే ఉంటోంది. తనను తాను నియంత్రించుకోలేని ఈ బలహీనత భవిష్యత్తులో భారత క్రికెట్‌కు ఎలాంటి ఉప(అప)కారం చేస్తుంది?
మళ్లీ కోపమొచ్చింది
ఇటీవల హైదరాబాద్‌లో సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి ఆగ్రహం మరోసారి బయట పడింది. వర్షం పడుతున్నా ఆటను కొనసాగించడంపై అతను అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. ఢిల్లీకే చెందిన అంపైర్ అనిల్ చౌదరి సముదాయించబోయినా అతను వినలేదు. ఆ వెంటనే బెంగళూరులో డ్రెస్సిం గ్ రూమ్ బయట అనుష్కతో ముచ్చట్లతో మరో వివాదం. కోహ్లి స్థాయిని బట్టి చూస్తే అతనికి నిబంధనలు తెలియకపోవడం అనేది ఉండదు.
కానీ ఎవరేమనుకుంటే ఏమిటనే ఒక రకమైన లెక్కలేనితనంతో అతను ఈ రకంగా చేశాడనేది విమర్శ. రాజస్తాన్‌తో ఎలిమినేటర్ మ్యాచ్‌లో అయితే అలా వికెట్ పడిందో లేదో ఇలా నోటినుంచి బూతులు. మ్యాచ్ ఆరంభంనుంచి బెంగళూరు మంచి స్థితిలోనే ఉంది. అంతగా ప్రత్యర్థి ఆటగాళ్లపై నోరు పారేసుకోవాల్సిన అవసరం ఎక్కడా కనిపించలేదు. కానీ అతను తన ధోరణిలోనే సాగాడు. అంతకు ముందు ముంబైతో మ్యాచ్‌లోనూ పార్థివ్‌ను రనౌట్ చేసి ఇలాగే వ్యవహరించాడు.
యువకుడు, ఇలాంటివి సహజం అంటూ గతంలో మద్దతు పలికిన గవాస్కర్‌లాంటి వారినుంచి కూడా ఇకపై అలాంటి మాటలు వినిపించకపోవచ్చు. ఎందుకంటే వయసు 27 ఏళ్లే కావచ్చు... కానీ 150కు పై గా వన్డేల అనుభవజ్ఞుడు, భారత జట్టుకు కెప్టెన్ ఇలా ఉంటానంటే కుదరదు.
ఒకటా...రెండా...
2008లో భారత సీనియర్ జట్టులో చోటు దక్కించుకున్న కోహ్లి దాదాపు ప్రతీ ఏడాది వివాదాల్లోనే ఉన్నాడు. కెరీర్ ఆరంభంలోనే నాగపూర్‌లో మీడియా ఫొటోగ్రాఫర్‌తో వాగ్యుద్ధం, సిడ్నీలో ప్రేక్షకులకు వేలు చూపిన ఘటన, ఐపీఎల్ సందర్భంగా వాంఖడేలో ప్రేక్షకులపై ఆగ్రహం, అదే టోర్నీలో గంభీర్‌తో పెద్ద గొడవ, జింబాబ్వేతో మ్యాచ్‌లో అంపైర్లతో వాదన, ప్రపంచకప్ సమయంలో జర్నలిస్ట్‌పై తిట్ల దండకం...ఇలా ఒకటేమిటి ఎక్కడైనా కోహ్లినే. టెస్టు సిరీస్‌లో జాన్సన్, వార్నర్‌లతో పోటీగా ధాటిగా మాటలతో బదులిచ్చాడంటూ కొన్ని వర్గాలు మెచ్చుకున్నా...అదేమీ జట్టుకు ఉపకరించేది కాదు.
‘ఇప్పుడు భారత జట్టుకు కోచ్‌గా వచ్చే వ్యక్తి కోహ్లి ఆగ్రహాన్ని కూడా నియంత్రించగలగాలి. అతడిని సరైన దారిలో నడిపించాలి. కోహ్లి పదే పదే నియంత్రణ కోల్పోతున్నాడు. క్రికెట్ ఆట కబడ్డీ, ఖోఖోలాంటిది కాదు. సుదీర్ఘ కాలం ఆడాలంటే, జట్టును ముందుండి నడిపించాలంటే టెంపర్‌ను తగ్గించుకోవాలి’ అని స్పిన్ దిగ్గజం బిషన్ సింగ్ బేడి సూచించారు. ఎలాంటి స్థితిలోనూ అదుపు తప్పని ‘మిస్టర్ కూల్’గా ప్రశంసలు అందుకున్న ధోని నుంచి కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరిస్తున్నాడు కాబట్టి ఇకపై కోహ్లి చేసే ప్రతీ పనిపై అందరి దృష్టి ఉంటుందని, మైదానంలో అతను జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు.
భారత క్రికెట్ ప్రయోజనాల దృష్ట్యా కోహ్లి తన ప్రవర్తనను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. బయటివాళ్లకంటే అతనికే దాని గురించి బాగా తెలుసు. కాబట్టి మానసిక కోణంలో చూస్తే స్వీయ నియంత్రణ అవసరం. ఏదైనా ఘటన వల్ల కోహ్లిపై నిషేధం పడితే అది జట్టుపై ఎంతో ప్రభావం చూపిస్తుంది. అరుదైన ప్రతిభ గల ఆటగాడికి తన కోపమే తన శత్రువుగా మారరాదు
- బీపీ బామ్, ప్రముఖ స్పోర్ట్స్ సైకాలజిస్ట్
బోల్ట్‌ను మించిన మార్కెట్ ‘డిమాండ్’
లండన్ : వివాదాల సంగతిఎలా ఉన్నా... కోహ్లి వ్యాపార మార్కెట్‌లో దూసుకెళుతున్నాడు. మరో మూడేళ్లలో మార్కెట్‌ను బాగా ప్రభావితం చేయగల అథ్లెట్లలో కోహ్లి ఆరో స్థానంలో నిలిచాడు. బ్రిటిష్ స్పోర్ట్స్ బిజినెస్ మేగజైన్ ‘స్పోర్ట్స్‌ప్రో’ కథనం ప్రకారం 26 ఏళ్ల కోహ్లి.. జమైకన్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్, ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో కన్నా ముందున్నాడు. ఇక ఈ జాబితాలో ఫార్ములా వన్ చాంపియన్ లూయిస్ హామిల్టన్.. బ్రెజిల్ ఫుట్‌బాల్ సూపర్ స్టార్ నెయ్‌మార్ జూనియర్ మార్కెట్ వర్గాల్లో అత్యధిక ఆదరణ ఉన్నవారిలో తొలి రెండు స్థానాలు దక్కించుకున్నారు. జొకోవిచ్ 14, రొనాల్డో 16, మెస్సీ 22వ స్థానాల్లో కొనసాగుతున్నారు. క్రికెటర్లలో స్మిత్ 45వ స్థానంలో ఉన్నాడు. భారత్ నుంచి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ 44వ స్థానంలో ఉంది.
కొత్త ‘ట్రెండ్’ తెచ్చాడు...
గతంలో భారత క్రికెట్‌ను శాసించిన ఆటగాళ్లు కూడా ఇంత బహిరంగంగా గర్ల్‌ఫ్రెండ్‌లతో మైదానంలో సరసాలాడలేదు. బ్యాట్‌నుంచి ముద్దుల సందేశాలు ఇవ్వలేదు. వారెవరైనా మ్యాచ్ చూడటానికి వచ్చినా, ఒక అతిథిగా మిగిలిపోయేవారు. ఏదో ఉందంటూ ఇద్దరి గురించి మీడియా ఏమైనా రాసుకోవడం వరకే. కానీ కోహ్లి వ్యవహారం మాత్రం అంతా బహిరంగమే. నిజానికి ఒక టూర్‌కు గర్లఫ్రెండ్‌ను అనుమతించడం కూడా కోహ్లితోనే మొదలైంది.
ఎలాగూ బయటికి చెప్పేశాము కదా అంటూ విరాట్ కాస్త ఎక్కువగానే విచ్చలవిడితనం ప్రదర్శిస్తున్నాడు. విదేశీ క్రికెటర్లు తమ గర్ల్‌ఫ్రెండ్స్‌ను వెంట తెచ్చుకున్నా, ఇలా ఎవరూ ప్రవర్తించలేదు. కోహ్లి హంగామా చూసి మిగిలిన క్రికెటర్లు కూడా ఇదే బాట పట్టారు. దాదాపు యువ క్రికెటర్లంతా తమ గర్ల్‌ఫ్రెండ్స్‌ను స్టేడియానికి తీసుకొస్తున్నారు. కానీ వాళ్లెవరూ విరాట్ స్థాయిలో హడావుడి చేయడం లేదు. అయితే అనుష్క సినిమా హీరోయిన్ కావడం వల్ల మీడియా కూడా కాస్త ఉత్సాహం చూపిస్తోంది. ఏదేమైనా కోహ్లి ఇకపై కూడా ఇలాగే ఉంటానందే కుదరదు. బ్యాట్స్‌మన్‌గానే కాకుం డా జట్టును నడిపించే వ్యక్తిగా అటు మైదానంలోనూ, ఇటు మైదానం బయట కూడా హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మరి కోహ్లి మారగలడా!