
చెన్నై నంబర్ వన్
మొహాలీ: ఐపీఎల్ -8 లో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో జరిగిన మ్యాచ్లో చెన్నై7 వికెట్ల తేడాతో గెలుపొందింది. 16.5 ఓవర్లలో పంజాబ్ నిర్ధేశించిన లక్ష్యాన్ని ఛేదించింది. 131 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 2 పరుగుల వద్ద హస్సీ(1), 10 పరుగుల వద్ద బ్రెండన్ మెకల్లమ్(6) వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత బ్యాటింగ్ కి దిగిన డుప్లెసిస్(55), రైనా(41)లు స్కోరు బోర్డుని పరుగులు పెట్టించారు. ఈ ఇద్దరు కలిసి 92 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో చెన్నై సునాయాసంగా గెలుపొందింది. అత్బుతంగా బౌలింగ్ చేసిన చెన్నై బౌలర్ పవన్ నేగికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. 102 పరుగుల వద్ద డుప్లెసిస్ (55) రిషి ధావన్ వేసిన బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. చివర్లో బ్యాటింగ్ కు వచ్చిన ధోనీ(25) పరుగులు చేశాడు. పంజాబ్ బౌలర్లలో సందీప్ శర్మ, రిషి ధావన్, హెన్రిక్స్ లకు ఒక్కో వికెట్ దక్కింది. ఈ విజయంతో 18 పాయింట్లతో లీగ్ దశలో సూపర్ కింగ్స్ నంబర్ వన్ గా నిలిచింది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ని చెన్నై బౌలర్లు 130 పరుగులకే కట్టడి చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. పంజాబ్ జట్టులో అక్షర్ పటేల్ (29 బంతుల్లో 32, 2 ఫోర్లు, 1 సిక్స్) మాత్రమే రాణించాడు. డేవిడ్ మిల్లర్ (11) తో కలిసి ఆరో వికెట్ కు 23 పరుగుల భాగస్వామ్యాన్ని, రిషి ధావన్ తో కలిసి 44 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఏడో వికెట్ గా వెనుదిరిగాడు. రిషి ధావన్ (20 బంతుల్లో 25) మాత్రమే పరవాలేదనిపించాడు.
వృద్ధిమాన్ సాహా(16) , మనన్ వోహ్రా(4) లతో పాటు కెప్టెన్ జార్జీ బెయిలీ (12) నిరాశపరిచారు. రవిచంద్రన్ అశ్విన్ వేసిన ఇన్నింగ్స్ 9వ ఓవర్లో షాట్ ఆడటానికి క్రీజు వదిలి వెళ్లిన గురుకీరత్ సింగ్ (15)ను చెన్నై కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ స్టంపౌట్ చేశాడు. గ్లెన్ మాక్స్ వెల్ (6) రవీంద్ర జడేజా బౌలింగ్ లో క్లీన్ బౌల్డయ్యాడు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో పవన్ నేగి రెండు వికెట్లు పడగొట్టగా, అశ్విన్, ఆశీష్ నెహ్రా, ఈశ్వర్ పాండే, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రేవో ఒక్కో వికెట్ తీశారు.