
ముంబై జోరును ఆపతరమా!
ఐపీఎల్ మొదటి ఆరు మ్యాచ్‌లలో ఐదు పరాజయాలు...కానీ తర్వాతి ఎనిమిది మ్యాచ్‌లలో ఏడు విజయాలు, పాయింట్ల పట్టికలో ఏకంగా రెండో స్థానం. టోర్నీలో ముంబై ఇండియన్స్ జోరు ఎలా పెంచిందో వీటితో అర్థమవుతోంది. ఇంత భీకర ఫామ్‌లో ఉన్న జట్టు ఇప్పుడు సొంతగడ్డపైనే క్వాలిఫయర్ ఆడేందుకు సిద్ధమైంది. అవతలి వైపు కూడా చెన్నై రూపంలో పటిష్ట ప్రత్యర్థి ఉంది. ఎలాంటి స్థితిలోనైనా ఫలితాన్ని మార్చగల నాయకుడి మార్గదర్శనంలో ఆ జట్టు అగ్రస్థానంలో నిలిచింది. మరి ముంబై జోరు కొనసాగుతుందా, చెన్నై వ్యూహాలు పని చేస్తాయా...ఐపీఎల్-8లో తొలుత ఫైనల్‌కు చేరేదెవరు?
రా.గం. 8 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
నేడు ఐపీఎల్ తొలి క్వాలిఫయర్
⇒ ధోని నాయకత్వంపైనే చెన్నై ఆశలు
⇒ అద్భుత ఫామ్‌లో రోహిత్ బృందం
ముంబై: ఐపీఎల్‌లో చిరకాల ప్రత్యర్థులైన రెండు ‘భారీ’ జట్లు మరో కీలక పోరుకు సన్నద్ధమయ్యాయి. మంగళవారం ఇక్కడి వాంఖడే స్టేడియంలో జరిగే తొలి క్వాలిఫయర్‌లో ముంబై ఇండియన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఇందులో విజేతగా నిలిచే జట్టు ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఓడిపోయిన జట్టుకు ఫైనల్ చేరేందుకు రెండో క్వాలిఫయర్ రూపంలో మరో అవకాశం ఉంటుంది. లీగ్ దశలో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లలో చెరొకటి గెలిచాయి. ముందుగా ముంబైలో చెన్నై 6 వికెట్లతో విజయం సాధించగా...ఆ తర్వాత చెన్నైలో ముంబై 6 వికెట్లతో నెగ్గింది.
అంతా ఫామ్‌లో...
ఐపీఎల్ ఆరంభం దశలో ఆటుపోట్ల తర్వాత కోలుకున్న ముంబై జట్టులో ఆ తర్వాత ఆటగాళ్లంతా నిలకడగా రాణించారు. తుది జట్టులో పెద్దగా మార్పుల అవసరం లేకుండా టీమ్ కొనసాగుతోంది. ఓపెనర్లు సిమన్స్, పార్థివ్ చక్కటి ఆరంభాలు ఇస్తుండగా, ఆ తర్వాత రోహిత్, రాయుడు, పొలార్డ్‌లతో మిడిలార్డర్ పటిష్టంగా ఉంది. చెన్నైపై సిక్సర్ల మోత తర్వాత కోల్‌కతాతో కీలక ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించిన హార్దిక్ పాండ్యా ఇప్పుడు కీలక ఆటగాడిగా మారాడు. ప్రధాన పేసర్లు మలింగ, మెక్లీన్‌గన్‌ల ఎనిమిది ఓవర్లు మ్యాచ్‌పై ప్రభావం చూపనున్నాయి. సన్‌రైజర్స్‌తో ఆఖరి మ్యాచ్‌లో వీరిద్దరు కలిసి కేవలం 33 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టారు. వినయ్ కుమార్ కూడా పర్వాలేదనిపించగా, స్పిన్నర్లు హర్భజన్, సుచిత్ ప్రతీ మ్యాచ్‌లో ప్రభావం చూపించారు. ఇంగ్లండ్ ఆటగాడు అలెక్స్ హేల్స్ ముంబై జట్టుతో చేరినా...ప్రస్తుతం జట్టులో విదేశీ ఆటగాళ్ల ఫామ్ చూస్తే అతనికి తుది జట్టులో స్థానం లభించకపోవచ్చు.
బ్యాట్స్‌మెన్‌దే భారం
మరో వైపు రెండు సార్లు చాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ మూడో టైటిల్ వేటలో ఫైనల్‌పై గురి పెట్టింది. అయితే టోర్నీ మొత్తం ఆ జట్టుకు పెద్ద బలంగా నిలిచిన ఓపెనర్ బ్రెండన్ మెకల్లమ్ లేని లోటు గత మ్యాచ్‌లోనే కనిపించింది. అతని స్థానంలో ఆడిన హస్సీ విఫలమయ్యాడు. అయితే బ్యాటింగ్‌లో మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో హస్సీనే కొనసాగించవచ్చు. జట్టు బ్యాటింగ్ ప్రధానంగా డ్వేన్ స్మిత్, రైనా, డు ప్లెసిస్‌లపై ఆధార పడి ఉంది. సీజన్ మొత్తం రెండు సార్లు మాత్రమే 30కి పైగా స్కోర్లు చేసిన కెప్టెన్ ధోని, ఈ మ్యాచ్‌లోనైనా చెలరేగాలని చెన్నై కోరుకుంటోంది. డ్వేన్ బ్రేవో, నేగిలు చివర్లో మెరుపులు మెరిపిస్తే జట్టు భారీస్కోరుకు అవకాశముంటుంది. పేస్ విభాగంలో నెహ్రాకు బ్రేవో అండగా నిలుస్తుండగా, స్పిన్‌లో నేగి, అశ్విన్ కీలకం కానున్నారు.
జట్ల వివరాలు (అంచనా)
చెన్నై సూపర్ కింగ్స్: ధోని (కెప్టెన్), డ్వేన్ స్మిత్, హస్సీ, రైనా, ప్లెసిస్, ధోని, బ్రేవో, నేగి, జడేజా, అశ్విన్, నెహ్రా, పాండే/మోహిత్.
ముంబై ఇండియన్స్: రోహిత్ (కెప్టెన్), సిమన్స్, పార్థివ్, రాయుడు, పొలార్డ్, పాండ్యా, హర్భజన్, సుచిత్, మెక్లీన్‌గన్, వినయ్, మలింగ.